వాహన అమ్మకాలు తగ్గిపోవడంతో... వచ్చే ఏడాదీ ప్యాసింజర్ వెహికల్స్ ఓకే...కానీ... ?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16 శాతం పతనమైన ఆటోమొబైల్ రంగ గ్రోత్.. వచ్చే ఏడాది ఇలాగే ఉంటుందని అంచనా వేసింది ఇండియా రేటింగ్స్. కాకపోతే ప్రయాణ వాహనాల్లో పురోగతి ఉంటుందని తెలిపింది.
ముంబై: వాహన అమ్మకాలు తగ్గిపోవడంతో దేశీయ ఆటోమొబైల్ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. డిమాండ్ పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నా ఆశించిన స్థాయిలో ప్రకటనలు వెలువడకపోవడంతో పరిశ్రమ డీలా పడిపోయింది. ఇప్పటికే అమ్మకాలు అంతంత మాత్రంగా సాగుతున్నాయి.
రానున్న కాలంలో బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలు తీసుకురావడం వల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది డిమాండ్‌ను ఇంకా ప్రభావితం చేయవచ్చని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అన్ని పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది (2020-21)లో కూడా పరిశ్రమ పుంజుకోకపోవచ్చని తాజా నివేదిక అంచనా వేస్తోంది.
also read ఆటో ఎక్స్ పోలో రెనాల్డ్ డస్టర్ సరికొత్త వెర్షన్
దేశీయ మార్కెట్లో 30 లక్షలకు పైగా వాహనాలు అమ్ముడవుతున్నాయి. 2019 డిసెంబరుతో ముగిసిన కాలానికి అమ్మకాలు 2018తో పోలిస్తే అమ్మకాలు 16 శాతం క్షీణించాయి. కొన్ని విభాగాల పనితీరు మరీ అధ్వాన్నంగా మారింది. రెండేళ్లు ఆటో రంగంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ రంగానికి రెండు బడ్జెట్లలోనూ ఊరట లభించలేదు.
ఆటోమొబైల్ రంగం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అయితే వాహనాల అమ్మకాల్లో క్షీణత మూలంగా ఈ రంగంలో లక్షలాది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. ఆటోమొబైల్ అనుబంధ విభాగాల్లోనూ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఎదురైంది. దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొంది. స్థూల ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన ఔట్‌లుక్‌ను సవరించింది. 2020-21 సంవత్సరానికి గాను సుస్థిరం నుంచి నెగిటివ్‌కు తగ్గించింది. ఇప్పటికే వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉంది. రెగ్యులేటరీ వాతావరణంలో అనిశ్చితి నెలకొంది. దేశవ్యాప్తంగా ఎలక్ర్టిక్ వాహనాలను పెంచడానికి సంబంధించిన విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వాహనాలు కొనుగోలు చేసే వారికి రుణ లభ్యత తగ్గిపోయింది. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా వాహనాలు తీసుకురావడం వల్ల ధరలు పెరుగుతున్నాయి.
also read మారుతి సుజుకి నుండి కొత్త జిమ్నీని మీరు చూశారా...?
గత 18 నెలల్లో ఆర్థిక మందగమనం వల్ల ఆటోమొబైల్ రంగంతోపాటు దాని అనుబంధ పరిశ్రమల్లోనూ లక్షల మంది ఉద్యోగాల్లో కోత విధించారు. లిమిటెడ్ క్రెడిట్ ఫెసిలిటీ, ఈ-మొబిలిటీ ఫుష్, ఇతర అంశాలు ఆటోమొబైల్స్ పడిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాల విక్రయాలు రెండు నుంచి నాలుగు శాతం వరకు ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ పేర్కొన్నది.
కానీ కమర్షియల్ వెహికిల్స్ విభాగంలో డిమాండ్5-7 శాతం పడిపోతుందని అంచనా. టూ వీలర్స్ సెగ్మెంట్‌లో ఐదు శాతం తగ్గిపోయాయని తెలుస్తోంది. 2021-22లో స్టేబుల్ రేటింగ్ కొనసాగుతుందని అంచనా వేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కమర్షియల్ వెహికల్స్ విక్రయాలు 35 శాతానికి పైగా పతనం అయ్యాయి. 2018లో 33 లక్షల వాహనాలు అమ్ముడుపోయాయి. మరోవైపు విద్యుత్ వాహనాల వేదికను అభివ్రుద్ధి చేయడంతోపాటు ఆటోమొబైల్ సంస్థలు నూతన ఉత్పత్తుల కోసం పెట్టుబడులు కొనసాగిస్తాయి.