Asianet News TeluguAsianet News Telugu

కొత్త చట్టాల అమలుతో నేడు 11:30కి తెలంగాణ బడ్జెట్

పారదర్శకత, క్రమశిక్షణ ప్రధానంగా తెలంగాణ బడ్జెట్ ఉండనున్నదని తెలుస్తున్నది. నేడు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సమర్పించనున్నది.
 

Tannir Harish Rao will present telangana state budget today
Author
Hyderabad, First Published Mar 8, 2020, 9:46 AM IST

హైదరాబాద్: పారదర్శక విధానం, కఠిన ఆర్థిక క్రమశిక్షణ, అవినీతి నిరోధక చర్యలు, కొత్త చట్టాల అమలుతో పన్ను వసూళ్లలో ప్రగతి, సహేతుక అధ్యయనాలతో రాబడులు, లీకేజీలు లేని పన్నుల వసూళ్ల వంటి కీలక లక్ష్యాలతో వచ్చే ఆర్థిక సంవత్సర (2020-21) బడ్జెట్ సిద్ధమైంది. 

ఆర్థిక వ్రుద్ధిరేటు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఉంటుందన్న అంచనాతో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపుదిద్దుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 10 శాతానికి పైగా పెంపుదల ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సొంత వనరుల రాబడి వ్రుద్ధిరేటు 15 శాతం ఉంటుందని అంచనా వేయగా, పది నెలల్లో కేవలం 8.46 శాతం వ్రుద్ధిరేటు మాత్రమే రికార్డైంది. 

జనవరి నాటికి రాబడుళ్లో 77.19 శాతం ఆదాయం సమకూరింది. 2019-20లో రూ.1.37 లక్షల కోట్ల రాబడి అంచనా వేస్తే.. జనవరి నాటికి రూ. 1.05 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరాయి. డిసెంబర్ నెలాఖరు నాటికి జీఎస్టీ 20,348 కోట్లు, అమ్మకం పన్నులు రూ.14,005 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీల రూపేణా రూ.9,032 కోట్లు, కేంద్ర పన్నుల వాటా కింద రూ.8,449 కోట్లు, ఇతర పన్నులు రూ.3,559 కోట్లు, రుణాలు రూ.21,715 కోట్లు ఖజానాకు చేరాయి. 

also read ప్రజల అకాంక్షలు...హామీలే ప్రధానం: 8న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

ఇంకా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5956 కోట్లకు చేరుకున్నది. గత ఐదేళ్లలో వాణిజ్య పన్నుల్లో 13.6 శాతం వార్షిక వ్రుద్ధిరేటు సాధించగా, ఈ ఆర్థిక సంవత్సర 15.37 శాతం వ్రుద్ధిరేటుతో 30,268 కోట్ల ఆదాయం పొందింది. 

కీలక ఆబ్కారీ శాఖ రాబడిలోనూ ఆశించిన పురోగతి నమోదైంది. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ గతేడాది 19.8 శాతం సగటు వార్షిక వ్రుద్ధిరేటు సాధించింది. ఈ ఏడాది 30 శాతం వ్రుద్ధిరేటు మించే అవకాశాలు ఉన్నాయి. వాహనాల పన్నుల్లో 19 శాతం వ్రుద్ది నుంచి 2.06 శాతానికి పడిపోయిందని తెలిసింది. ఇక పన్నేతర ఆదాయాల్లో భారీ వ్యత్యాసం నెలకొంది. 

వాస్తవ అంచనాలు, నిర్దేశిత రాబడి లక్ష్యాలతో తెలంగాణ సర్కార్ ఏడో ఏడాది వార్షిక బడ్జెట్లో 10-12 శాతం పురోగతితో రూ.1,46,492.30 కోట్లతో ప్రవేశ పెట్టనున్నది. ఆదివారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు బడ్జెట్ సమర్పించనున్నారు. 

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రభావం రాష్ట్ర ఆదాయంపై పడుతుంది. జీఎస్టీ అమలులోకి వచ్చాక ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రానికి పరిహారం లభించనున్నది. తర్వాత పరిహారం అక్కర్లేకుండానే ఆర్థికంగా తెలంగాణ వ్రుద్ధిరేటు సాధించింది. కానీ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కేంద్రం నుంచి పరిహారం ఆశించే స్థాయికి రాష్ట్ర పరిస్థితి పడిపోయింది. 

గతేడాది ఏప్రిల్, మే నెలల్లో రూ.175 కోట్లు, జూన్, జూలై నెలల్లో రూ.700 కోట్ల పరిహారం లభించింది. తాజాగా కేంద్రం రూ.1,018 కోట్లు కూడా కేంద్రం విడుదల చేసింది. రాష్ట్ర సొంత వనరుల రాబడి వ్రుద్ధిరేటు తిరోగమనం నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలు రూ.89,047 కోట్లతో పారదర్శక విధానాలను అవలంభించే లక్ష్యంతో 15 శాతం మేరకు పెంపుదల వర్తింపజేసినట్లు సమాచారం. 

also read ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్: 2020-21లో ఉద్యోగుల వేతనాల పెంపు...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల మేరకు మొత్తం వ్యయం రూ.1,61,857 కోట్లు అని అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,11,055 కోట్లు, మూలధన వ్యయం రూ.17,274 కోట్లుగా అంచనా వేసింది. సవరించిన అంచనాల్లో అది 72.19 శాతమే నమోదైంది. 

వాణిజ్య పన్నుల ఆదాయం అంచనాలు రూ.31,186 కోట్లు పెంచుకోవాలనే అంచనాతో బడ్జెట్ రూపుదిద్దుకున్నట్లు సమాచారం. సీజీఎస్టీ రూ.5369 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.25817 కోట్లు, ఐజీఎస్టీగా రూ.500 కోట్లు నిర్ధారించారు. కానీ ఈ పద్దు అంచనాలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. 

కీలక ఆదాయ వనరులు ఆబ్కారీ శాఖ నుంచి రూ.10,901 కోట్లు. ఇందుకోసం కొత్తగా బార్లకు అనుమతులు ఇవ్వనున్నట్లు వినికిడి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం లక్ష్యం రూ.6,146 కోట్లు కాగా, ఇప్పటికే రూ.5956 కోట్లకు చేరాయి. ఈ నెలాఖరులోగా మరో రూ.1000 కోట్లు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios