చుక్కలు చూపిస్తున్నా నిత్యావసర ధరలు... 6ఏళ్ల గరిష్టానికి...
నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను అంటున్నాయి. ఫలితంగా జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పైకి దూసుకెళ్లింది. ఆరేళ్ల గరిష్ఠాన్ని తాకుతూ 7.59 శాతంగా నమోదైంది. ఫలితంగా కూరగాయలు, ఆహారోత్పత్తుల ధరలు భగ్గుమన్నాయి. మరోవైపు తయారీరంగ కార్యకలాపాలు నిరుత్సాహపరిచాయి. మెజారిటీ సంస్థల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. డిసెంబర్‌లో -0.3 శాతంగా ఐఐపీ నమోదైంది.
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నది. కొద్ది నెలలుగా క్రమేణా పెరుగుతున్న ధరలు, జనవరిలో దాదాపు ఆరేళ్ల గరిష్ఠ స్థాయిని తాకాయి. గత నెల వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్లకు పైగా స్థాయికి ఎగిసి 7.59 శాతంగా నమోదైంది.
వరుసగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి ప్రమాణాలను దాటి పోవడం ఇది రెండో నెల. 2014 మే తర్వాత ఇదే అత్యంత గరిష్ఠం. రిటైల్ ద్రవ్యోల్బణం 8.33 శాతంగా ఉన్నట్లు బుధవారం ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేశాయి.
ఇంతకుముందు నెల డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 7.35 శాతంగా ఉండగా, నిరుడు జనవరిలో కేవలం 1.97 శాతంగానే ఉండటం గమనార్హం. కూరగాయలు, పప్పుధాన్యాలు, మాంసం, చేపల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో పలుకుతుండటం ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నది.
also read వాలంటైన్స్ డే ఆఫర్...తక్కువ ధరకే ఫ్లయిట్ టికెట్లు...
అయినా స్థూల ఆహార ద్రవ్యోల్బణం అంతకుముందుతో పోల్చితే జనవరిలో 13.63 శాతానికి తగ్గడం విశేషం.ఇంతకుముందు 14.19 శాతంగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) తెలిపింది.
కూరగాయల ధరలు 50.19 శాతం, పప్పులు ఇతర ఆహారోత్పత్తుల ధరలు 16.71 శాతం, మాంసం, చేపల ధరలు 10.50 శాతం మేర పెరిగాయి. గుడ్ల ధరలు కూడా 10.41 శాతం ఎగిశాయి. ఆహార, శీతల పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం 11.79 శాతంగా నమోదైనట్లు ఎన్‌ఎస్‌వో తెలిపింది.
ఇదిలావుంటే హౌజింగ్ 4.20 శాతం ఖరీదైందని, ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 3.66 శాతంగా ఉందని వివరించింది. కాగా, రాబోయే నెలల్లో కూరగాయలు ఇతర ఆహారోత్పత్తుల ధరలు తగ్గవచ్చని, ముఖ్యంగా మాంసం, గుడ్ల ధరలు దిగి రావచ్చునని నిపుణులు అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే వివిధ రంగాల్లోని సేవలు ప్రియం కావడం కూడా ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయంటున్నారు. నానాటికీ ఎగబాకుతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య సమీక్షను ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పటికే గత రెండు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో కీలక వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లని విషయం తెలిసిందే. రెపో, రివర్స్ రెపోలను యథాతథంగా ఉంచింది.
అంతకుముందు వరుసగా వీటిని తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ.. వృద్ధిరేటుకు ఊతమిచ్చే ప్రయత్నం చేసింది. కానీ ద్రవ్యోల్బణం అదుపు తప్పుతున్నదని గ్రహించిన ఆర్బీఐ.. వడ్డీరేట్ల కోతలకు బ్రేకేసింది. నిజానికి ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో ఉంటే.. వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచాలి. కానీ దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ పని చేయలేకపోతున్నది.
మరోవైపు దేశీయ పారిశ్రామికోత్పత్తి మళ్లీ పడకేసింది. గతేడాది డిసెంబర్‌లో -0.3 శాతంగా నమోదైంది. కీలకమైన తయారీ రంగంలో ఉత్పత్తి క్షీణించడం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)ని రుణాత్మకంలోకి నెట్టింది. 2018 డిసెంబర్‌లో ఐఐపీ వృద్ధిరేటు 2.5 శాతంగా ఉన్నట్లు బుధవారం అధికారిక గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది.
2019 ఆగస్టు నుంచి వరుసగా మూడు నెలలపాటు మైనస్‌లోనే నమోదైన గణాంకాలు నవంబర్‌లో తిరిగి వృద్ధిని సంతరించుకున్నాయి. ఆగస్టులో -1.4 శాతం, సెప్టెంబర్‌లో -4.6 శాతం, అక్టోబర్‌లో -4 శాతంగా నమోదైన ఐఐపీ.. నవంబర్‌లో 1.8 శాతానికి పెరిగింది. మళ్లీ డిసెంబర్‌లో గణాంకాలు నిరాశపరిచాయి.
also read వంట గ్యాస్ ధర మళ్ళీ పెరిగింది...సిలిండర్ పై ఎంతంటే ?
తయారీ రంగంలో ఉత్పాదక రేటు 2019 డిసెంబర్‌లో -1.2 శాతంగా ఉన్నది. 2018 డిసెంబర్‌లో 2.9 శాతం వృద్ధిగా నమోదవడం గమనార్హం. విద్యుదుత్పత్తి కూడా 0.1 శాతానికి పడిపోయింది. 2018 డిసెంబర్‌లో 4.5 శాతంగా ఉన్నది. అయితే గనుల రంగంలో మాత్రం ఉత్పత్తి 5.4 శాతానికి పెరిగింది. అంతకుముందు ఇది -1 శాతంగా ఉన్నది.
ప్రధానమైన తయారీ రంగంలో కార్యకలాపాలు నిరుత్సాహకరంగా ఉండటం ఐఐపీని స్థూలంగా దెబ్బతీసింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో ఐఐపీ వృద్ధిరేటు కేవలం 0.5 శాతానికే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే కాలంలో 4.7 శాతం వృద్ధిరేటు ఉన్నది.
కాగా, క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి, పెట్టుబడుల ప్రామాణిక సూచీ క్రిందటేడాది డిసెంబర్‌లో -18.2 శాతానికి పతనమైంది. అంతకుముందు డిసెంబర్‌లో 4.2 శాతం వృద్ధి కనిపిస్తున్నది. మొత్తంగా తయారీ రంగంలోని 23 పరిశ్రమల్లో 16 ప్రతికూల వృద్ధినే సూచిస్తుండటం దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిపై భయాల్ని పెంచుతున్నది.
డిసెంబర్‌లో ఐఐపీ గణాంకాలు మైనస్‌లోకి జారుకోవడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక రంగంలో మోడువారిన ఆశలకు కొత్త చిగురులు వేస్తున్నాయన్న ఆనందం లేకుండా పోయిందని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుంకీ మజుందార్ అన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న విపత్కర పరిస్థితులు.. భారతీయ పారిశ్రామిక రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నదన్న మజుందార్.. కరోనా వైరస్ చైనాతోపాటు భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. చైనాలో తాత్కాలికంగా చాలా సంస్థలు మూతబడ్డాయని, దీనివల్ల భారత్‌లోని ఎలక్ట్రానిక్స్, ఆటో పరిశ్రమ ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. చైనా నుంచి ఆయా రంగాల్లోకి విడిభాగాల సరఫరా నిలిచిపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు.