Asianet News TeluguAsianet News Telugu

Budget 2020: వృద్ది రేట్ పెంపు ‘నిర్మల’మ్మకు ఖచ్చితంగా సవాలే...

వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించే టైం దగ్గర పడుతోంది. రెండేళ్ల క్రితం మాంద్యంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతూ ఉంటే.. మన దేశ వ్రుద్ధిరేటు ఎనిమిది శాతంగా నమోదైంది. కానీ రెండేళ్లలోనే పరిస్థితి తిరగబడింది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు కూడా ఒక కారణమేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది. నోట్ల రద్దు తర్వాత స్థిరాస్తి రంగం, జీఎస్టీ అమలులోకి వచ్చాక చిన్న వ్యాపారులు చేతులెత్తేశారు. ఉపాధి లేక డిమాండ్ కొరవడడంతో ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించడం సవాలే.

Key Challenges For Finance Minister Ahead Of Union Budget
Author
Hyderabad, First Published Jan 29, 2020, 10:56 AM IST

న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉంటే ఎనిమిది శాతం వృద్ధిరేటుతో శెబాష్ అనిపించుకున్న మనదేశ దేశ ఆర్థిక పరిస్థితి 2019 ప్రారంభంలోనే తలకిందులైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటో తేదీన 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తమను గట్టెక్కిస్తారని ప్రజలంతా ఆశలు పెట్టుకున్నారు. 

ఎక్కడా ఏ వస్తువుకూ గిరాకీ లేదు. అన్ని రంగాలనూ స్తబ్దత ఆవహించింది. వృద్ధిరేటు దారుణంగా పడిపోతోంది. ఉత్పాదక రంగం నేలచూపులు చూస్తోంది. నిరుద్యోగం సర్రున పెరిగిపోతోంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మాంద్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. యావద్దేశం ఇప్పుడు కేంద్ర బడ్జెట్‌ వైపు చూస్తోంది.

ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు కల్పించడానికి  విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ ఎలాంటి ఉద్దీపనలతో ముందుకొస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. దీనికి తోడు 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థగా తీర్చి దిద్దాలన్నదని ప్రధాని నరేంద్రమోదీ సంకల్పం.

also read Budget 2020: కెప్టెన్‌ నిర్మలాతో బడ్జెట్ బృందంలో ఎవరెవరు ఉన్నారంటే...

ఇది నెరవేరాలంటే ప్రతియేటా జీడీపీ వ్రుద్ధిరేటు ఎనిమిది శాతానికి పైగా నమోదు కావాల్సి ఉంటుంది. దీంతోపాటు ఏటా 1.2 కోట్ల మంది యువకులకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టింది. కార్పొరేట్ పన్నులో భారీగా కోత విధించింది. వచ్చే ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.102 లక్షల కోట్ల నిధులను వెచ్చిస్తామని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో వచ్చేనెల బడ్జెట్‌లో వేతన జీవులు, నిరుద్యోగులు, రైతులు, పారిశ్రామివేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపారులు, మహిళలు.. ఇలా ప్రతిఒక్కరూ ఎంతోకొంత ఊరటనిచ్చే అంశాలు ఉంటాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.దేశ ఆర్థిక వ్యవస్థను వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు ఐదుశాతానికే పరిమితం కావడం, మున్ముందు అది 4.5%కి తగ్గిపోతుందన్న హెచ్చరికలు ఆర్థిక ప్రణాళిక రూపకర్తల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.2008-09 తర్వాత వృద్ధిరేటు 5శాతానికి పడిపోవడం ఇదే తొలిసారి. 2018-19 తొలి త్రైమాసికంలో 8శాతం మేర కనిపించి, ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచిన వృద్ధిరేటు ఆ తర్వాత వరుసగా 7, 6.6, 5.8%కి పడిపోయింది. తత్ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా దేశ పరపతి తగ్గుతోంది. 

Key Challenges For Finance Minister Ahead Of Union Budget

ఈ పరిస్థితుల్లో వృద్ధిరేటు పుంజుకునే చర్యల్ని బడ్జెట్‌లో ప్రకటించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అసలు సిసలు సవాల్. దేశంపై మాంద్యం ఛాయల ప్రభావం లేదని ప్రభుత్వ వర్గాలు ఉద్ఘాటిస్తున్నా, ఘోరంగా పడిపోయిన పెట్టుబడులు, గిరాకీ, వినియోగం ఈ లక్షణాల్ని తేటతెల్లం చేస్తున్నాయి. 

ముఖ్యంగా గిరాకీ లేమి దెబ్బకు అన్ని వ్యవస్థలూ విలవిల లాడుతున్నాయి. పారిశ్రామిక, ఆటోమొబైల్‌, స్థిరాస్తి రంగాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. పన్ను వసూళ్లలో లక్ష్యాలు చేరుకోలేని పరిస్థితి నెలకొన్నది. తలసరి కుటుంబ నెలవారీ వ్యయం 2011-12లో రూ.1,501 ఉండగా 2017-18 సంవత్సరానికి వచ్చేసరికి రూ.1,446కి పడిపోయిందని వినియోగదారుల వ్యయ సర్వే తేల్చింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గ్రామీణుల ఖర్చు ఏకంగా 8.8% పడిపోయింది. పట్టణాల్లో 2% పెరిగింది.

దేశంలో నల్లధనం వెలికితీతకు 2016లో మోదీ సర్కార్ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు, ఒకే పన్ను విధానం కోసం 2017-18లో కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ అనంతరం పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత కుదేలైన స్థిరాస్తి రంగం ఆ కష్టాలు నేటికీ కొనసాగుతున్నాయి. 

also read Budget 2020: బడ్జెట్‌లో ఆదాయ పన్నులో కోతలు...నిపుణులు అంచనా

స్థిరాస్తి రంగంలో నెలకొన్న కష్టాలతో అసంఘటిత రంగ కార్మికులు భారీ ఎత్తున ఉపాధి కోల్పోయారు. ఇక జీఎస్టీలోని కొన్ని లోపాలు, అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు చిన్న వ్యాపారులకు ఇబ్బందిగా మారాయి. పన్ను చెల్లింపుల్లో సంక్లిష్టతలతో చిన్న వ్యాపారాలు బోర్డులు తిప్పేస్తుండటంతో కిందిస్థాయిలో వేల మంది రోడ్డున పడుతున్నారు.

దేశంలో పని కల్పించే రంగాల్లో రెండో స్థానంలో ఉన్న వ్యవసాయంలో రెండు శాతం వృద్ధిరేటు మాత్రమే నమోదవుతోంది. 2002-11 మధ్య జీడీపీలో 4.4శాతంగా ఉన్న వ్యవసాయ ఆదాయం ప్రస్తుతం 3.1 శాతానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం ఆశలు నెరవేరతాయన్నది ప్రశ్నార్థకంగానే ఉన్నది

వివిధ కారణాలతో ఆదాయం తగ్గడంతో ప్రభుత్వ ఖర్చుల్లో కోతలు పడుతున్నాయి. ఇది ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతోంది. 2017-18లో ప్రభుత్వ ఖర్చు వల్లో దేశ ఆర్థిక రంగం 11% పెరిగిందని ఆర్‌బీఐ అంచనా. 2018-19లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు జరగడంతో.. అభివృద్ధిపై ప్రభుత్వం చేసే ఖర్చులు తగ్గాయి. ఫలితంగా ప్రజలకు డబ్బు అందక ఆర్థికరంగం మందగమనానికి మరో కారణమన్న అభిప్రాయం ఉంది.

ఆహార ద్రవ్యోల్బణమూ భారీగా పెరుగుతోంది. 2019 ఆగస్టులో 3% ఉన్న ద్రవ్యోల్బణం నవంబర్‌కల్లా 10%కి, డిసెంబర్‌కి 14%కి చేరి ఆరేళ్ల గరిష్ఠ రికార్డును బద్దలు కొట్టింది. ముఖ్యంగా కూరగాయల ధరలు 60%, పప్పుదినుసుల ధరలు 15%కి పైగా పెరిగాయి. ఉల్లి కిలో రూ.150 వరకు వెళ్లి ప్రస్తుతం రూ.60 దగ్గర స్థిరపడింది. వంటనూనెల ధరలూ రూ.125కిపైగా చేరాయి. వినియోగదారుడి చేతుల్లో ఉన్న డబ్బునూ తిండికోసమే ఖర్చు చేయాల్సిన రావడంతో మిగతా రంగాల డిమాండ్‌ మరింత కుచించుకుపోతోంది.

దేశంలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతస్థాయికి చేరింది. దీనివల్లే గ్రామాల్లో గిరాకీ భారీగా పడిపోయింది. పట్టణ ప్రాంతాల నిరుద్యోగమూ జాతీయ సగటుకంటే ఎక్కువగానే ఉంది.  ముంబైలోని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ ప్రకారం 2019 తొలి త్రైమాసికంలో 6.65% ఉన్న నిరుద్యోగం నాలుగో త్రైమాసికానికి వచ్చేసరికి 7.7 శాతానికి పెరిగింది.

Key Challenges For Finance Minister Ahead Of Union Budget

కేంద్ర ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం విడుదల చేసిన లెక్కల ప్రకారమూ నిరుద్యోగం 6.1%గా నమోదైంది. 20-24 మధ్య వయస్సు గల వారిలో నిరుద్యోగం 37% ఉంది.బడ్జెటేతర రుణాలతో కలిపితే ద్రవ్యలోటు దాదాపు శాతానికి చేరుకున్నది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు సైతం జీడీపీలో మూడు శాతానికి చేరింది. ఇది 2019-20 బడ్జెట్‌లో చూపిన 2.6శాతం కంటే ఎక్కువ. 

డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గుతుండటంతో ప్రజల వ్యక్తిగత పొదుపూ తగ్గుతోంది. ఫలితంగా బ్యాంకులకు నగదు చేరడంలేదు. మున్ముందు వనరుల సమీకరణకు భారతీయ కార్పొరేట్‌ సంస్థలు విదేశీ మార్కెట్‌కు వెళ్లాల్సిన ఆగత్యం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ రుణాలు గత ఒక్క ఏడాదే 22 బిలియన్‌ డాలర్లకు చేరడం దీన్ని బలపరుస్తోంది.

ప్రస్తుత దేశీయ ఆర్థిక పరిస్థితులు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేలా లేవు. 2018లో చైనా 107 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించగా భారత్‌ 55 బిలియన్‌ డాలర్లతోనే సరిపెట్టుకుంది. 2014-15లో జీడీపీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) అంతకుముందు ఏడాది కంటే 25% పెరిగాయి. ఆ తర్వాత నుంచి వృద్ధిరేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. 

2018-19 నాటికి దేశీయ ఆర్థిక వ్యవస్థలోకి ఎఫ్డీఐలు కేవలం రెండు శాతానికి మాత్రమే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22%కి తగ్గించి సులభతర వాణిజ్య ర్యాంకుల్లో భారత్‌ ప్రపంచంలో 63వ స్థానానికి ఎగబాకినా విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంలేదు.

also read బడ్జెట్ 2020:విద్యుత్ వాహనాలకు ‘నిర్మల’మ్మ ప్రోత్సాహాలిస్తారా...?

ఈ పరిస్థితుల్లో దేశంలో డిమాండ్‌ను సృష్టించి ఆర్థిక వ్యవస్థను మళ్లీ వృద్ధి దిశగా పరుగులు తీయించడానికి చర్యలు తీసుకోవాలని ఆర్థిక, పారిశ్రామిక వేత్తలు, వినియోగ, వ్యవసాయ నిపుణులు కోరుతున్నారు. మధ్యతరగతి ప్రజల చేతుల్లోకి మరింత డబ్బు వచ్చేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు. 

అందులో భాగంగా ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం. రూ.10 లక్షల వార్షిక వ్యక్తిగత ఆదాయం ఉన్న వారికి మరింత రాయితీ ఇవ్వాలని సూచిస్తున్నారు. దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను రద్దు చేయడం గానీ, తగ్గించడం గానీ చేయాలి.నిర్మాణ, రవాణా, వాహన తదితర రంగాలకు జీఎస్టీ కోత విధించాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. ప్రత్యక్ష పన్ను కోడ్‌ అమలులోకి తేవాలన సూచనలు వస్తున్నాయి.

రైతులకు పంట సాయం కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి సాయాన్ని రూ.6వేల నుంచి రెట్టింపు చేయడంతోపాటు మరింత మంది రైతులకు విస్తరించేలా సవరించాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తగిన రీతిలో నిధులు పెంచాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీల ఉపకార వేతనాల పెంచాలన్న అభ్యర్థనలు వ్యక్తం అవుతున్నాయి.

చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కోలుకునేందుకు దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సాయం చేయడంతోపాటు ట్యాక్స్‌ హాలీడే ప్లస్ ఉద్దీపనలు ప్రకటించాలని కోరుతున్నారు. ఈ చర్యలు చేపట్టడం విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఖచ్చితంగా సవాలే.

Follow Us:
Download App:
  • android
  • ios