Asianet News TeluguAsianet News Telugu

అమ్మో కార్వీ!! సంక్షోభం నుంచి కోలుకుంటుందా?!!

ఖాతాదారుల షేర్లను దారి మళ్లించి అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలపై కార్వీ స్టాక్ బ్రోకింగ్, ట్రేడింగ్ సేవలపై సెబీ ఆంక్షలు విధించింది. కార్వీ వాదన వినిపించేందుకు 21 రోజుల గడువు ఇచ్చినా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో యంగ్ అండ్ ఎర్నెస్ట్ సంస్థ ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేపట్టనుండటం ఈ సంస్థకు ఒకింత కష్టకాలమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో సంస్థను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించడానికి కార్వీ గ్రూప్ యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Karvy aftermath: SEBI plans to revamp structure to check skulduggery by brokers
Author
Hyderabad, First Published Nov 27, 2019, 11:50 AM IST

హైదరాబాద్: కార్వీ బ్రోకింగ్ సంస్థలో తలెత్తిన సంక్షోభం మొత్తం కార్వీ గ్రూప్ పునర్వ్యవస్థీకరణకే దారి తీస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గ్రూపులో ముఖ్య సంస్థలైన కార్వీ ఫిన్ టెక్, కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థలకు స్వతంత్ర చైర్మన్లను నియమించే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థకు చెందిన విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి

దీని ప్రకారం అంతర్గత గ్రూపు కంపెనీలు, వాటి వ్యాపార కార్యకలాపాల పునర్ వ్యవస్థీకరణ కసరత్తు ఇప్పటికే కార్వీ గ్రూపు చేపట్టినట్లు తెలుస్తోంది. వివిధ విభాగాలకు స్వతంత్ర చైర్మన్లతో బోర్డులను ఏర్పాటు చేయడం గ్రూప్ ప్రధాన వ్యూహంలో భాగం. 

ఇక హోల్డింగ్ కంపెనీగా ఉన్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ నుంచి ఇతర సంస్థలను విడదీసి స్టాక్ బ్రోకింగ్ వ్యాపార లావాదేవీలను ఒక ప్రత్యేక కంపెనీ కిందకు తేవడం వంటి అంశాలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. 

ఖాతాదారుల షేర్లను తన ఖాతాలోకి బదిలీ చేసి ఖాతాదారుల షేర్ల మార్జిన్లపై ట్రేడింగ్‌ చేయడం, వారి షేర్లను తనఖా పెట్టి నిధులు సమీకరించిందన్న ఆరోపణలపై కొత్త ఖాతాదారులను తీసుకోవడానికి వీలు లేదంటూ కార్వీ గ్రూప్‌నకు చెందిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌పై సెబీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.

also read పీఎస్‌ఎల్‌వీ C-47కి మొదలైన కౌంట్‌డౌన్‌: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కే. శివన్

ఈ నేపథ్యంలో కంపెనీ అవకతవకలపై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఫోరెన్సిక్‌ ఆడిట్‌కూ చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు కార్వీ గ్రూప్‌ వ్యాపారాలపై ఉండే వీలుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. 

ఆర్థిక సేవల్లో చిరపరిచితం కార్వీ కంపెనీ. గతంలో ఐపీఓ కుంభకోణంలో ఇబ్బందులు ఎదుర్కొన్న కార్వీ తాజాగా బ్రోకింగ్‌ వ్యాపారంలో ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో గ్రూప్‌ కంపెనీలపై మదుపర్ల విశ్వాసం కాపాడుకోవడం సంస్థకు సవాలేనని భావిస్తున్నారు. 

కార్వీ గ్రూపులో కార్వి ఫిన్ టెక్, కార్వీ స్టాక్ బ్రోకింగ్ పెద్ద సంస్థలు. కార్వి ఫిన్ టెక్ సంస్థలో అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ గతేడాది మెజారిటీ వాటా అంటే 83 శాతం వాటా కొనుగోలు చేసింది. మిగతా 17 శాతం కార్వీ గ్రూప్ చైర్మన్ సీ పార్థసారధి వద్ద ఉంది. కనుక ఫిన్ టెక్ సంస్థ కార్వీ గ్రూప్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కార్వీకి ప్రస్తుతం బ్రోకింగ్‌ వ్యాపారం ప్రధాన వ్యాపారం. దాదాపు 2.44 లక్షల మంది ఖాతాదారులున్నారు. దేశంలోని అతిపెద్ద 10 బ్రోకింగ్‌ కంపెనీల్లో కార్వీ బ్రోకింగ్‌ ఒకటి. ఖాతాదారుల షేర్లపై మార్జిన్లను వారికే వ్యక్తిగతంగా ఇవ్వాలని సెబీ నిబంధనలు తెచ్చింది.దీంతో అప్పటి వరకూ ఖాతాదారుల షేర్ల మార్జిన్లపై ట్రేడింగ్‌ చేసిన కంపెనీ నగదును కార్వీ సర్దలేకపోయిందని.. దీంతో షేర్లను విక్రయించిన ఖాతాదారులకు నగదు చెల్లించడంలో విఫలమైందని మార్కెట్‌ వర్గాల కథనం. 

Karvy aftermath: SEBI plans to revamp structure to check skulduggery by brokers

ఒక దశలో నిధులు సమీకరించాలన్న ఆలోచన కూడా కార్వీ చేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. షేర్లను విక్రయించగానే నగదు చెల్లించకపోతే మదుపుదారులు ట్రేడింగ్‌ చేయడానికి ఎలా ఇష్టపడతారని మార్కెట్‌ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఖాతాలు కోటక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐకి చెందిన బ్రోకింగ్‌ కంపెనీలకు బదిలీ అయ్యాయని సమాచారం. భవిష్యత్‌లో కార్వీ బ్రోకింగ్‌ ఆదాయం తగ్గడానికి అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. 

కార్వీ డిపాజిటరీ ఖాతా సేవలను కూడా అందిస్తోంది. ట్రేడింగ్‌, డీపీ ఖాతాలు ఇతర బ్రోకింగ్‌ కంపెనీలకు బదిలీ అయితే.. డీపీ సేవలపై వచ్చే ఆదాయం కూడా తగ్గుతుందని అంటున్నారు. పార్థసారథి సారథ్యంలో ఐదుగురు చార్టర్డ్‌ అకౌంటెంట్ల ప్రారంభించిన కార్వీ ప్రస్థానం పలు వ్యాపారాలకు విస్తరించింది. 

1985లో రిజిస్ట్రీ సేవలతో కార్వీ తన కార్యకలాపాలు ప్రారంభించింది. 1990లో హెచ్‌ఎస్ఈ ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్‌ పంపిణీదారుగా రిటైల్‌ బ్రోకింగ్‌లోకి అడుగు పెట్టింది. 1997లో ఎన్‌ఎస్‌డీఎల్‌, సీడీఎస్ఎల్‌లకు డీపీగా మారింది. 2003లో డెట్‌ మార్కెట్‌ బ్రోకింగ్‌ సేవల్లోకి ప్రవేశించింది. 

also read  ఆర్-కామ్ ఆస్తుల కోసం జియో, ఎయిర్‌టెల్ పోటీ

భారీగా విస్తరిస్తూ 2014లో ఆధార్‌, బీపీఓ సేవలను ప్రారంభించింది. 2018లో హెచ్‌సీఎల్‌ సర్వీసెస్‌ సొంతం చేసుకుని కార్వీ ఇన్నోటెక్‌గా పేరు మార్చింది. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌, కార్వీ క్యాపిటల్‌ వంటి 30కి పైగా కంపెనీలు కార్వీ గ్రూప్‌లో ఉన్నాయి.ప్రస్తుతం కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ మిగతా సంస్థలకు హోల్డింగ్ కంపెనీగా ఉంది. గ్రూపులో రియాల్టీ, రెన్యువబుల్ ఎనర్జీ, డేటా మేనేజ్మెంట్, ఎన్బీఎఫ్సీ, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, కార్వీ కామ్ డ్రేడ్ తదితర సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థకు అనుబంధమే. 

ఈ పరిస్థితుల్లో ఫిన్ టెక్, స్టాక్ బ్రోకింగ్ సంస్థలకు స్వతంత్ర చైర్మన్ల నియామకం ద్వారా ఆయా సంస్థల బోర్డులు సమర్థవంతంగా వ్యవహరించడానికి వీలవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు మార్పులు తప్పవని గ్రూప్ సంస్థ చైర్మన్ పార్థసారధి సంకేతాలిచ్చారు. ప్రస్తుత వివాదం నుంచి కార్వీ స్టాక్ బ్రోకింగ్ బయటకు రావాల్సి ఉంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించి, తనఖాలో ఉన్న షేర్లు బయటకు తీసి తప్పు జరుగలేదని నిరూపించుకుని ‘సెబీ’ ఆంక్షల నుంచి బయటపడటం కార్వీకి సవాలే. 

కార్వీ వాదన వినిపించేందుకు సెబీ 21 రోజుల టైం ఇచ్చింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఆధ్వర్యంలో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ‘ఫోరెన్సిక్ ఆడిటింగ్’ చేపట్టడంతో ప్రస్తుత సంక్షోభం నుంచి కార్వీ బయటపడటం సంక్లిష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios