ఐటీ రంగంలో భారీగా కొత్త ఉద్యోగావకాశాలు...దాదాపు లక్ష వరకు...

ఐటీ రంగంలో భారీ కొలువులకు మార్గం సుగమం అవుతోంది. దాదాపు లక్ష మంది వరకు నూతన నియామకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిపుణులైన ప్రతిభావంతులకు పుష్కల అవకాశాలు ఉన్నాయి. క్యాప్ జెమినీ 30 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నది. మిగతా సంస్థలూ ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. 

Indian IT Companies, Start Ups are planning to recruite freshers in different fields like digital tech and others.

న్యూఢిల్లీ: ఐటీ రంగంలో ప్రతి నాలుగైదేళ్లకు సరికొత్త టెక్నాలజీలు ఎంటరవుతాయి. వీటిని నేర్చుకుంటేనే మనుగడ సాధ్యమవుతోంది. క్యాంపస్ సెలక్షన్లల్లోనూ కృత్రిమ మేధ, బిగ్‌డేటా అనలిటిక్స్‌ వంటి డిజిటల్‌ టెక్నాలజీ, ఖర్చు తగ్గించే క్లౌడ్‌ వంటివి అభ్యసించిన వారికే అవకాశాలు లభిస్తున్నాయి. 

ఫలితంగా డిజిటల్​ నైపుణ్యం ఉన్నవారి నియామకాలతోపాటు, ఇప్పటికే పని చేస్తున్న ఉద్యోగులకు పునఃశిక్షణ ఇవ్వడంపై ఐటీ సంస్థలు శ్రద్ధ వహిస్తున్నాయి. క్యాప్‌జెమినీ ఈ ఏడాది 30వేల మందిని నియమిస్తామని ప్రకటించింది. మిగతా దిగ్గజ కంపెనీలు ఇప్పటికే తమ నియామక ప్రణాళికలను బయట పెట్టాయి. 

టీసీఎస్ 39 వేలు, ఇన్ఫోసిస్ 18 వేలు, విప్రో 12 వేలు, కాగ్నిజెంట్ 20 వేలు, హెచ్సీఎల్ టెక్ 15 వేల మందిని నియమించుకోనున్నాయి. దేశీయ ఐటీ-బీపీఓ రంగ ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం వృద్ధి చెందుతాయని ఇండస్ట్రీ బాడీ నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ (నాస్కామ్‌) అంచనా వేసింది. 

also read ఆర్థిక వ్యవస్థకు కరోనా కష్టాలు...దశాబ్ద కనిష్టానికి వృద్ధిరేటు...

ఇందులోనూ డిజిటల్‌ విభాగ ఆదాయాల్లో 23 శాతం వృద్ధి లభించే అవకాశం ఉందని నాస్కామ్ తెలిపింది. ఖాతాదారుల అవసరాలను గమనించి, డిజిటల్‌ సేవల విస్తృతిపై దృష్టిపెట్టిన కంపెనీలు ఇప్పటికే 28 శాతం ఆదాయాన్ని ఈ విభాగం నుంచే ఆర్జిస్తున్నాయి. ఇందుకోసమే ప్రస్తుత ఉద్యోగులకూ ఆయా నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పిస్తూ, నూతన నియామకాల్లోనూ వీటికే ప్రాధాన్యం ఇస్తున్నాయి.

దేశీయంగా ఐటీ రంగంలో దాదాపు 44 లక్షల మంది పనిచేస్తున్నారు. అవసరానికి తగిన కోర్సులు నేర్వని ఉద్యోగులకు, ప్రతిభ చూపని వారికి ఉద్వాసన పలుకుతున్న ఐటీ కంపెనీలు, గతేడాది దాదాపు 6 లక్షల మందికి డిజిటల్‌ సాంకేతికతలపై కంపెనీలు శిక్షణ ఇప్పించాయి. ఈ ఏడాది దాదాపు అదేస్థాయిలో ఈ శిక్షణ ఉండొచ్చని శిక్షణ సంస్థల అంచనా.

దేశంలో ఐటీ నిపుణులు 43.6 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.05 లక్షల మందికి నియామకాలు జరుగనున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీలో నైపుణం పొందిన వారు 8.84 లక్షల మంది. ఇక  దేశీయ ఐటీ పరిశ్రమ ఆదాయం రూ. 14 లక్షల కోట్లుగా ఉంది.

ఉద్యోగంలో కొనసాగాలంటే, డిజిటల్‌ టెక్నాలజీలపై పట్టు సాధించడం తప్పనిసరి. ఉద్యోగులు కూడా ముందుకొస్తున్నారు. మొబైల్‌, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌.. ఏదైనా వినియోగించుకుని తమకు అనువైన వేళ్లలోనే కొత్త కోర్సులు అభ్యసించే వీలును ఉద్యోగులకు ఐటీ కంపెనీలు కల్పిస్తున్నాయి. తగిన నైపుణ్యాలు గల వారిని ఎంపిక చేయడంతోపాటు, శిక్షణ ఇచ్చే బాధ్యతలను వేరే సంస్థలకు అప్పగిస్తున్నాయి.

ఐటీ రంగంలో అనుభవజ్ఞులు, దిగ్గజ కంపెనీల్లో ఉన్నతస్థానాల్లో పనిచేసిన వారితో ప్రణాళికలు రూపొందించి, ఆ మేరకు శిక్షణ ఇప్పించడంలో మరికొన్ని కంపెనీలు నిమగ్నం అవుతున్నాయి. దిగ్గజ సంస్థలకు ఇందువల్ల సమయం, వ్యయాలు ఆదా అవుతున్నాయని ఇలాంటి సేవలను భారత్‌, అమెరికాలో అందిస్తున్న టెక్‌ఎరా ఐటీ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ కిరణ్‌ తెలిపారు.

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కంపెనీలు రెండు విడతల్లో క్యాంపస్ సెలక్షన్స్నిర్వహిస్తున్నాయి. తొలివిడతగా సెప్టెంబర్ - డిసెంబర్, మళ్లీ రెండో విడతగా ఫిబ్రవరి - ఏప్రిల్‌లో చేస్తున్నాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో పాటు ప్రసిద్ధి చెందిన ఇంజినీరింగ్‌ కళాశాలల్లో భర్తీ అధికంగా జరుగుతోంది.

also read చెక్ పోస్టులు దాటాలంటే రూ.48 వేల కోట్ల లంచం

వచ్చిన ప్రాజెక్టులు, ఉద్యోగుల వలసలకు అనుగుణంగా మరిన్ని నియామకాల కోసం ఇంకొన్ని కళాశాలలకూ ఐటీ కంపెనీలు వెళ్తున్నాయి. మిగిలిపోయిన కళాశాలల్లోని విద్యార్థులకూ అవకాశం ఇచ్చేందుకు ఆఫ్‌ క్యాంపస్‌ ఎంపికలను ఐటీకంపెనీలు నిర్వహిస్తున్నాయి. 

ఇవి తమ కార్యాలయ ప్రాంగణంలోనో, లేదా ఆయా ప్రాంతాల్లో కంప్యూటర్‌ మౌలిక సదుపాయాలు బాగున్న కళాశాలలోనో జరుపుతున్నారు. వీటిల్లో ఏ కళాశాల విద్యార్థి అయినా తమ ప్రతిభ నిరూపించుకుని, ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

గతేడాది ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, ఉద్యోగావకాశం పొందలేకపోయిన వారు ఈ ఏడాది ప్రయత్నిద్దామనుకుంటే ఏ కంపెనీ కూడా ప్రాంగణ, ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు హాజరు కానివ్వడంలేదు. ఇటువంటి వారి కోసం హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్ (హైసియా‌) ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించడంతో పాటు, స్క్రీనింగ్‌ పరీక్ష కూడా నిర్వహిస్తున్నది.

ఈ పరీక్షను కెమెరా అనుసంధానించిన డెస్క్‌టాప్‌/ల్యాప్‌టాప్‌ ద్వారా మాత్రమే రాయాల్సి ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అభ్యర్థిని సదరు కెమెరా చిత్రీకరిస్తూ ఉంటుంది. అభ్యర్థి బదులుగా వేరొకరు పరీక్ష రాసే అక్రమ పద్ధతులను దూరం చేసేందుకే ఇది చేపట్టారు. 

వేలమంది దరఖాస్తు చేసుకున్నా, అర్హత మార్కులు సాధించిన వారినే ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు. ఒకరకంగా వీరంతా ప్రీసెలెక్టెడ్‌ అభ్యర్థులన్నమాట. దిగ్గజ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు సహా మొత్తం 52 సంస్థలు గత నెల హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో జాబ్‌ఫెయిర్‌ నిర్వహించి, 715 మందికి అవకాశాలు కల్పించాయి. ఇలా చేయడంతో సంస్థలకూ సమయం, వ్యయాలు ఆదా కానున్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios