Asianet News TeluguAsianet News Telugu

ఉపాధి హామీపై ‘శీత’కన్ను..13%తగ్గింపు, గ్రామీణాభివృద్ధి స్కీంలదీ అదే బాట

గ్రామీణాభివృద్ధిశాఖ కింద ఉన్న పంచాయతీ రాజ్‌ శాఖ విభాగానికి దాదాపు రెట్టింపు కేటాయింపులు చేశారు. 2019-20లో రూ.500 కోట్లు కేటాయిస్తే, వచ్చే ఏడాది దాన్ని రూ.900.94 కోట్లకు పెంచారు. 

Budget 2020: MGNREGA funds down by 13%, marginal dip
Author
New Delhi, First Published Feb 2, 2020, 1:33 PM IST

ఉపాధి హామీపై ‘శీత’కన్ను..13%తగ్గింపు, గ్రామీణాభివృద్ధి స్కీంలదీ అదే బాట
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పట్ల కేంద్రంలోని మోదీ సర్కార్ వివక్ష కొనసాగుతూనే ఉన్నది. 

Also read:అమ్మకానికి ఎల్‌ఐసీ: ఐపీవో దేనికి..?

తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటాయింపుల్లో కేంద్ర బడ్జెట్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కేటాయింపుల్లో 13 శాతానికిపైగా కోత విధించారు. ఇతర గ్రామీణాభివృద్ధి పథకాలకు నిధుల కేటాయింపులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 
2019-20లో గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.1.22 లక్షల కోట్లు కేటాయిస్తే, 2020-21లో దాన్ని రూ.1.20 లక్షల కోట్లకు కుదించారు. ఉపాధి హామీ పథకానికి రూ.9,500 కోట్లు తగ్గాయి. ఈ పథకానికి 2019-20లో రూ.71,001.81 కోట్లు కేటాయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరం కేటాయింపులు రూ.61,500 కోట్లతో సరిపెట్టారు.

గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 2020-21 వాస్తవ అంచనా వ్యయం కేటాయింపుల కంటే ఎక్కువ అని, గ్రామీణ ఉపాధి హామీ పథకం పూర్తి అంచనా వ్యయంతో పోలిస్తే వచ్చే ఏడాది కేటాయింపులు చాలా తక్కువ అని ఆ శాఖ వర్గాల కథనం. 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చిన 2008 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.1.91 లక్షల కోట్లు కేటాయించారని గ్రామీణాభివృద్ధి శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. కానీ నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో 2014 నుంచి 2020 వరకు రూ.2.95 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 

గ్రామీణాభివృద్ధిశాఖ కింద ఉన్న పంచాయతీ రాజ్‌ శాఖ విభాగానికి దాదాపు రెట్టింపు కేటాయింపులు చేశారు. 2019-20లో రూ.500 కోట్లు కేటాయిస్తే, వచ్చే ఏడాది దాన్ని రూ.900.94 కోట్లకు పెంచారు. వీటిలో రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ పథకానికి కేటాయింపులను రూ.465.46 కోట్ల నుంచి రూ.857.53 కోట్లకు పెంచారు. భారత్‌ నెట్‌ కార్యక్రమం కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష గ్రామ పంచాయతీలకు ‘ఫైబర్‌ టు ది హోం’ కనెక్షన్లు ఇస్తామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

గ్రామ పంచాయతీ స్థాయిలో అంగన్‌ వాడీలు, వెల్‌నెస్‌ సెంటర్లు, ప్రభుత్వ స్కూళ్లు, పీడీఎస్‌ ఔట్‌లెట్లు, తపాలాఫీసులు, పోలీస్‌ స్టేషన్లకు డిజిటల్‌ కనెక్టివిటీ కల్పిస్తామని ఆమె వివరించారు. భారత్‌ నెట్‌ పథకానికి రూ.6000 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. 

ఉపాధి పథకానికి కేటాయింపులు తగ్గినా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ఇళ్ల నిర్మాణ పథకాలకు నిధుల కేటాయింపులు పెరిగాయని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇంకా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్వై), ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాలకు నిధుల కేటాయింపులు పెరిగాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios