న్యూఢిల్లీ: మరో వారం మాత్రమే గడువు.. ఏయే రంగాలకు ఎలా ఊరటనిస్తుందన్న సంగతి తేలిపోనున్నది. సరిగ్గా ఎనిమిది రోజుల్లో అంటే వచ్చే నెల ఒకటో తేదీన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు సమర్పిస్తారు. 

వేతన జీవులకు గొప్ప ఊరట?
వచ్చే ఏడాది సమర్పించే బడ్జెట్ ప్రతిపాదనల్లో మధ్యతరగతి, వేతన జీవులకు గొప్ప ఊరట దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయంపై పన్ను శ్లాబుల మార్పులుండవచ్చునని తెలుస్తున్నది. 
ఇప్పటి వరకు మూడు శ్లాబ్‌ల విధానం అమల్లో ఉంది. తాజాగా రూ.7 లక్షల వరకు ఐదు శాతం, రూ.7-10 లక్షల మధ్య 10 శాతం, రూ.10-20 లక్షల మధ్య 20 శాతం, రూ.20 లక్షలు-10 కోట్ల మధ్య 30 శాతం, రూ.10 కోట్ల పైన 35 శాతం పన్ను వసూలవుతుంది.

also read ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించండి.. లేదంటే జ్యువెల్లరీ రంగంలోనూ కొలువుల కోతే

రూ.7 లక్షల ఆదాయం వరకు ఐదు శాతం పన్ను
రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయం గల వారికీ 5 శాతం పన్ను మాత్రమే ప్రతిపాదించే వీలుందని సమాచారం. ప్రస్తుతం రూ.2.5 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులు లేవన్న విషయం తెలిసిందే. రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఐదు శాతం పన్ను అమలులో ఉంది. 

బడ్జెట్ ప్రతిపాదనల తర్వాతే రాయితీలపై స్పష్టత
ఈ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం రిబేట్ ఇస్తున్నది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటకపోతేనే ఇది వర్తిస్తుంది. ఈ క్రమంలో ఐదు శాతం శ్లాబును రూ.7 లక్షలకు పొడిగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. కాగా, రిబేట్  కూడా రూ.7 లక్షల వరకు ఉంటుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉన్నది. 

ప్రత్యక్ష పన్నుల కోడ్‌లో ఐదు శ్లాబ్‌లు
ప్రత్యక్ష పన్నుల కోడ్ ప్రతిపాదించినట్లు చెబుతున్న 5,10, 20, 30, 35 శాతం శ్లాబ్‌లు అమలులోకి తేవాల్సిన అవసరం ఉన్నదని పలువురు విశ్లేషకులు, నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం 5, 20, 30 శాతం శ్లాబ్‌లు అమలులో ఉన్నాయి. 

ఆదాయ పరిమితి పెంచితే చాలా మందికి ఊరట
చాలా మంది ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వారిపై ఐదు శాతం పన్ను విదిస్తున్నారు. ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచితే ఎంతో మందికి పన్ను భారం తగ్గుతుంది.

రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
అలాగే రూ.7 లక్షల నుంచి 10 లక్షల వరకు వార్షిక ఆదాయం గల వారికి 10 శాతం పన్ను మాత్రమే వేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఇప్పుడు రూ.5- 10 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నవారిపై 20 శాతం పన్ను పడుతున్నది. ఆపై ఆదాయం ఉంటే 30 శాతం.

ఈ క్రమంలో రూ.5 లక్షలు-10 లక్షల శ్లాబును సగానికి విభజించి రూ.7 లక్షల వరకు 5 శాతం, అక్కడి నుంచి రూ.10 లక్షలదాకా 10 శాతం పన్నును ప్రతిపాదించనున్నారని తెలుస్తున్నది. 

రూ.20 లక్షల్లోపు ఆదాయం గల వారిపై 20 శాతం టాక్స్
రూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకు వార్షిక ఆదాయముంటే 20 శాతం పన్నుకు వీలు ఉన్నది. రూ.20 లక్షల నుంచి 10 కోట్ల మధ్య 30 శాతం పన్నును ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. ఒక కొత్తగా రూ.10 కోట్లకు మించి వార్షిక ఆదాయం ఉన్నవారికి 35 శాతం శ్లాబ్ పరిచయం చేయవచ్చని తెలుస్తున్నది. ఈ మార్పులన్నీ కూడా 60 ఏళ్ల దిగువన గల వారి వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకేనని సమాచారం. 

సీనియర్ సిటిజన్లకు ఐటీ శ్లాబ్ లు విభిన్నం
60-80 ఏళ్ల వయసున్న సీనియర్‌ సిటిజన్లకు, 80 ఏళ్లపైనున్న వారికి ఐటీ శ్లాబులు, పన్నులు వేర్వేరుగా ఉంటాయన్న సంగతి విదితమే. గతేడాది ఫిబ్రవరిలో ప్రకటించిన మధ్యంతర బడ్జెట్‌లో రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉంటే పన్ను మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే.

అంచనాలు నిజమైతే వేతన జీవులకు ఇలా ఆదా
ఒకవేళ ఈ అంచనాలు వాస్తవ రూపం దాలిస్తే రూ.10 లక్షల్లోపు ఆదాయం కల వారికి కనీసం రూ.60 వేలు, రూ.15 లక్షల్లోపు ఆదాయం గల వారికి రూ.1.10 లక్షలు, రూ.20 లక్షల ఆదాయం కల వారికి రూ.1.60 లక్షల వరకు పన్ను ఆదా అవుతుంది.

కొనుగోలు దారుల్లో సామర్థ్యం పెంపే లక్ష్యం
కాగా, దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం, మార్కెట్‌లో చోటుచేసుకున్న స్తబ్ధతల మధ్య వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెంచేందుకు ఐటీ శ్లాబుల సవరణ, పన్ను కోతలు దోహదపడుతాయని కేంద్రం విశ్వసిస్తున్నది. ఇప్పటికే కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించి జీడీపీకి జోష్‌నిచ్చే ప్రయత్నాన్ని కేంద్రం చేసిన సంగతి విదితమే.

also read కిరాణాలోకి రిలయన్స్‌ ‘స్మార్ట్ పాయింట్లు’!

బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌
ఫిబ్రవరి ఒకటో తేదీన (శనివారం)  కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుండగా, ఆ రోజు స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ జరుగనున్నది. సాధారణంగా శని, ఆదివారాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లకు సెలవు అన్న విషయం తెలిసిందే. అయితే శనివారమైనా బడ్జెట్‌ ప్రకటన ఉన్నందున మార్కెట్లు తెరిచే ఉంటాయని బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్ఈ) స్పష్టం చేసింది. 

పలు వర్గాల అభ్యర్థనల మేరకు బడ్జెట్ నాడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్
ఎప్పటి మాదిరే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ట్రేడింగ్‌ ఉంటుందని వివరించింది. బడ్జెట్‌లో మార్కెట్‌ ఆధారిత ప్రకటనలు ఉంటాయి కాబట్టి ట్రేడింగ్‌ జరుపాలన్న విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయానికి స్టాక్‌ ఎక్సేంజ్‌లు వచ్చినట్లు తెలుస్తున్నది. 2015లోనూ బడ్జెట్‌ ప్రకటన శనివారం (ఫిబ్రవరి 28) వచ్చింది. అప్పుడు కూడా స్టాక్‌ మార్కెట్లు ట్రేడ్‌ అయ్యాయి. నాడు అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

2001 నుంచి బడ్జెట్ సమర్పణ టైం మార్పు
2001లో బడ్జెట్‌ ప్రకటన సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ప్రతీ బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్లు ట్రేడ్‌ అవుతూనే ఉన్నాయి. గడిచిన ఈ దాదాపు 20 ఏళ్లలో ఒక్కసారే శనివారం బడ్జెట్‌ను ప్రకటించగా, ఇప్పుడు మరోసారి శనివారమే అయ్యింది.