ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించండి.. లేదంటే జ్యువెల్లరీ రంగంలోనూ కొలువుల కోతే

అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయంగా పన్ను భారం వల్ల బంగారం ధర 16 శాతానికి పైగా ఉన్నదని గోల్డ్ అండ్ జ్యువెల్లరీ ట్రేడర్స్ అసోసియేషన్లు పేర్కొన్నాయి.

Jewellers want cut in import duty of gold and in income tax in Budget 2020

అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయంగా పన్ను భారం వల్ల బంగారం ధర 16 శాతానికి పైగా ఉన్నదని గోల్డ్ అండ్ జ్యువెల్లరీ ట్రేడర్స్ అసోసియేషన్లు పేర్కొన్నాయి. దేశీయంగా అధిక ధర ఉండటంతో స్మగ్లింగ్ పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశాయి. బంగారం కొనుగోలుదారులు అధిక ధర వల్ల కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని తెలిపాయి. 

ఈ నేపథ్యంలో బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకం సగానికి తగ్గించాలని, నెలవారీ వాయిదాల్లో ఆభరణాలను కొనుగోలు చేసేందుకు అనుమతించాలని కేంద్ర ఆర్థికశాఖను అభ్యర్థించాయి. తమ వినతులపై కేంద్రం సత్వరం చర్యలు చేపట్టకపోతే జ్యువెల్లరీ పరిశ్రమలోనూ ఉద్యోగాల కోత తప్పదని ఆ సంఘాలు స్పష్టం చేశాయి. 

దేశీయ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ బంగారం 10 గ్రాముల ధర ఇటీవల రూ.42 వేలను తాకి.. ప్రస్తుతం రూ.41 వేల పైన కదలాడుతున్నది. అయితే అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం (31.10 గ్రాములు) ధర గరిష్ఠంగా 1879 డాలర్లకు చాలా దూరంగా 1550 డాలర్ల వద్దే నిలకడగా ఉండటం గమనార్హం. 

అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయ మార్కెట్లో ధర అధికంగా ఉండటానికి డాలర్ మారకం విలువతోపాటు కస్టమ్స్ సుంకం 12.5 శాతం, జీఎస్టీ మూడు శాతం కలిపి 15.5 శాతం పన్నుల భారం పడటమే కారణం. ఈ పన్నుభారం లేకుంటే ప్యూర్ గోల్డ్ పది గ్రాముల బంగారం ధర రూ.35,600లకు లభ్యమయ్యేది. 

కానీ పన్ను భారం, ఇతర చార్జీలు కలుపుకుని 10 గ్రామలు ప్యూర్ గోల్డ్ ధర రూ.41,250లకు లభిస్తున్నది. తులం బంగారంపై సుమారు రూ.5650, కిలో బంగారంపై రూ.5.65 లక్షలు అధిక ధర చెల్లించాల్సి వస్తున్నది.

దుబాయి, నేపాల్, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాల నుంచి అధికారికంగానూ, స్మగ్లింగ్ మార్గంలో గానీ తేవడానికి దేశీయంగా అధికర ధర ఉండటమే కారణం. 

అధికారికంగా దిగుమతి చేసకుని, విక్రయించే బంగారం వల్ల ప్రభుత్వానికి పన్ను రూపేణా ఆదాయం వస్తుంది. స్మగ్లింగ్ రూపంలో వస్తున్న బంగారంతో ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నది. దీనికి తోడు కొందరు వ్యాపారులు బ్యాంకు ధరల కంటే తక్కువకు విక్రయిస్తున్నారు. తద్వారా మార్కెట్లో అనైతిక పోరాటానికి కారణం అవుతున్నారు.

దొంగచాటుగా తెచ్చిన బంగారం అని, తక్కువ ధరకే విక్రయిస్తామని నమ్మబలికి స్వచ్ఛత తక్కువగా ఉండే ఆభరణాలను అమాయకులకు అక్రమార్కులు అంటగడుతుండటంతో ప్రజలు మోసపోతున్నారు. 

2018లోనే భారతదేశంలోకి రూ.37వేల కోట్ల విలువైన 110 టన్నుల బంగారం స్మగ్లింగ్ అయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బిల్లులతో అధికారికంగా సేల్స్ జరిపే దుకాణాల్లో విక్రయాలు తగ్గి, ఆభరణాల తయారీ దారులకు ఉపాధి కొరవడి సేల్స్ మన్, సూపర్ వైజర్ స్థాయి ఉద్యోగాల కోత తప్పదని జెమ్స్ అండ్ గోల్డ్ జ్యువెల్లరీ ట్రేడర్స్ అసోసియేషన్లు తెలిపాయి. 

ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలను అఖిల భారత జ్యువెలరీ ట్రేడర్స్, రాష్ట్రాల అసోసియేషన్లు కేంద్ర ఆర్థికశాఖకు వివరించాయి. తక్షణం కస్టమ్స్ సుంకం 12.5 నుంచి ఆరుశాతానికి తగ్గిస్తే స్మగ్లింగ్ గణనీయంగా తగ్గుతుంది. భారం తగ్గి కొనుగోలు దారులు కూడా ముందుకు వస్తారని ట్రేడర్లు తెలిపారు.

రూ.5 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేసే వారికి మాత్రమే ‘పాన్’ నంబర్ నమోదును అమలు చేయాలని ఆయా సంఘాలు అభ్యర్థించాయి. ప్రస్తుతం రూ.2 లక్షల బంగారం కొనుగోళ్లు జరిపితే ‘పాన్’ నమోదు తప్పనిసరి. 

మొబైల్ ఫోన్ల మాదిరిగా బంగారు ఆభరణాలను నెలవారీ వాయిదాల్లో కొనుగోలు చేసేందుకు అనుమతించాలని బులియన్ వ్యాపారులు కోరుతున్నారు. ఈ సదుపాయం కల్పిస్తే మరింతగా కొనుగోళ్లు జరుగుతాయి. అమ్మకాలు, కొనుగోళ్లలో పారదర్శకత పెరుగుతుందని చెబుతున్నారు.

బ్యాంకులు రెండేళ్లుగా జ్యువెల్లరీ రంగానికి రుణాలివ్వడం లేదు. బ్యాంకుల్లో 9.5-13.5 శాతం మధ్య రుణాలు లభించేవని, ఆ అవకాశం లేక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద 18-24 శాతం వడ్డీకి రునాలు తీజుకోవాల్సి వస్తున్నదని వ్యాపారులు వాపోయారు. బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని అభ్యర్థిస్తున్నారు.

ప్యూర్ గోల్డ్ కోసం భరోసా కల్పించే హాల్ మార్కింగ్ తప్పనిసరి కావడంతో 14,18,22 క్యారెట్ల నాణ్యతతో మాత్రమే ఆభరణాలు తయారు చేయాలని కేంద్రం నిబంధన విధించింది. కానీ, సంప్రదాయ ఆభరణాలు తయారు చేసుకునే వారు 20,24 క్యారెట్లలో కోరుకుంటారని, ఆ నాణ్యతలోనే అనుమతించాలని అభ్యర్థించారు.

దేశీయంగా ఆర్థిక మందగమనంతోపాటు ధరలు మరింతగా పెరుగడంతో గతేడాది పసిడి ఆభరణాల వ్యాపారం 30 శాతం వరకు తగ్గిందని బులియన్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. తాము ప్రతిపాదించిన చర్యలు చేపడితే ఈ ఏడాది 10 శాతం పురోగతి లభిస్తుందని గోల్డ్ అండ్ జ్యువెల్లరీ పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios