Asianet News TeluguAsianet News Telugu

జనాభా ప్రాతిపదికన పన్ను వాటా: తెలంగాణ సహా దక్షిణ రాష్ట్రాలకు షాక్


ఉత్తర భారతంలోని అసోం, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు వెయిటేజీ తగ్గినా వాటికి పెద్దగా పన్ను నష్టం జరగలేదు.

15th Finance Commission cuts states' share of central taxes to 41% vs 42%
Author
New Delhi, First Published Feb 2, 2020, 1:52 PM IST


న్యూఢిల్లీ: అనుమానించినంతా జరిగింది. 2011 జనాభా ప్రాతిపదికగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పంపిణీ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని తొలి నుంచి అనుమానించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లోనూ అదే జరిగింది. 15వ ఆర్థిక సంఘం తీసుకున్న విభిన్న కొలమానాల వల్ల మొత్తం 8 రాష్ట్రాల వెయిటేజీ తగ్గిపోయింది. 20 రాష్ట్రాలకు పెరిగింది. వెయిటేజీ తగ్గిన రాష్ట్రాల్లో నాలుగు దక్షిణాది రాష్ట్రాలే. 

ఉత్తర భారతంలోని అసోం, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు వెయిటేజీ తగ్గినా వాటికి పెద్దగా పన్ను నష్టం జరగలేదు. కొత్త కొలమానం వల్ల ఎనిమిది రాష్ట్రాలు 2020-21లో రూ. 18,389 కోట్లు నష్టపోతుండగా, అందులో నాలుగు దక్షిణాది రాష్ట్రాల వాటానే రూ.16,640.29 కోట్లు. 

Also read:ఉపాధి హామీపై ‘శీత’కన్ను..13%తగ్గింపు, గ్రామీణాభివృద్ధి స్కీంలదీ అదే బాట

కొత్త విధానంతో కర్ణాటక అత్యధికంగా రూ.8,367.21 కోట్లు కోల్పోతోంది. ఆ తర్వాతీ స్థానాల్లో కేరళకు రూ.4,367.88కోట్లు, తెలంగాణకు రూ.2,383.90కోట్లు కోత విధించారు. దక్షిణాదిలో తమిళనాడు ఒక్కటే లబ్ధిపొందిన రాష్ట్రం. అలాగే అత్యధికంగా మహారాష్ట్ర రూ.4,814 కోట్లు, రాజస్థాన్‌ 3,795.43 కోట్లు, బీహార్‌ రూ.3,105 కోట్ల మేర లాభపడ్డాయి. 

15వ ఆర్థికసంఘం నిర్దేశించిన ప్రమాణాల్లో తేడాలవల్ల 20 రాష్ట్రాలు రూ.32,923.65 కోట్లు లాభ పడుతున్నాయి. 14వ ఆర్థిక సంఘం 29 రాష్ట్రాలకు పన్నుల్లో వాటాను పంచగా, ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో ఆ రాష్ట్రానికి 1% వాటాను పక్కనపెట్టి, మిగిలిన 41%ని  28 రాష్ట్రాలకు పంచాలని 15వ ఆర్థికసంఘం సిఫార్సు చేసింది. 

15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకూ కలిపి 7,84,180.87 కోట్లు పంచుతున్నారు. అయితే, కుటుంబ నియంత్రణ పాటించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా స్థిరీకరణ జరిగింది. తత్ఫలితంగా అవి ఎక్కువగా నష్టపోవాల్సి వచ్చింది. జనాభా నియంత్రణకు తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకున్నా దానివల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. 

2011 జనాభా లెక్కల వల్ల నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలు కూటమిగా ఏర్పడి నిరసన వ్యక్తంచేశాయి. ఆర్థిక సంఘం విధివిధానాలు మార్చాలని ఎలుగెత్తాయి. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం వాటితో గొంతు కలపలేదు. తమకేమీ పెద్దగా నష్టం జరగదని భావించింది తెలంగాణ ప్రభుత్వం. చివరకు చూస్తే దక్షిణాదిలో ఎక్కువ నష్టపోయిన మూడో రాష్ట్రంగా తెలంగాణ.

2019-20తో పోలిస్తే 2020-21లో తెలంగాణకు వచ్చే కేంద్ర పన్నుల్లో వాటా నికరంగా రూ.809 కోట్లు పెరిగినా కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను 2.437% నుంచి 2.133%కి తగ్గించడం వల్ల రాష్ట్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2,383.90 కోట్లమేర నష్టపోనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.15,987.59 కోట్లు రాగా, ఈసారి అది రూ.16,726.58 కోట్లకు పెరగనుంది. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం అయితే ఇది రూ.19,110.48 కోట్ల మేర ఉండేది.

వచ్చే ఏడాది తెలంగాణకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ కింద రూ.5,145.05 కోట్లు, సెంట్రల్‌ జీఎస్‌టీ కింద రూ.5,062.70 కోట్లు, ఆదాయంపన్ను కింద రూ.4,783.97 కోట్లు, కస్టమ్స్‌ కింద రూ.1,044 కోట్లు, యూనియన్‌ ఎక్సైజ్‌ కింద రూ.682.11 కోట్లు, సేవా పన్ను కింద రూ.8.92 కోట్లు లభించనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కార్పొరేట్‌ టాక్స్‌ రూపేణా 9,916.22 కోట్లు, సెంట్రల్‌ జీఎస్‌టీ 9,757.50 కోట్లు, ఆదాయంపన్ను 9,220.31 కోట్లు, కస్టమ్స్‌ 2,012.13 కోట్లు, యూనియన్‌ ఎక్సైజ్‌ 1,314.66 కోట్లు, సేవా పన్ను 17.19 కోట్లు లభించనున్నాయి.

అయితే, తెలంగాణకు 15వ ఆర్థికసంఘం 2020-21 సంవత్సరానికి ప్రత్యేక గ్రాంట్‌ కింద రూ.723 కోట్లు కేటాయించింది. మొత్తం మూడు రాష్ట్రాలకు కలిపి రూ.6,764 కోట్లు ఈ గ్రాంట్‌ కింద ఇవ్వగా, అందులో అత్యధికంగా కర్ణాటకకు రూ.5,495 కోట్లు, మిజోరాం రాష్ట్రానికి రూ.546 కోట్లు సిఫార్సు చేసింది. 

ఈ ఏడాది 15వ ఆర్థికసంఘం సిఫార్సుల కారణంగా గత ఏడాదికంటే తక్కువ ఆదాయం పొందుతున్నందుకు ఈ రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంటు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణకు 2019-20లో పన్నులవాటా, రెవెన్యూలోటు కింద రూ.18,964 కోట్లు వెళ్తే ఈసారి అది రూ.18,241 కోట్లకు పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని, అందుకే ప్రత్యేక గ్రాంటు కింద రూ.723 కోట్లు ఇవ్వాలని ఆర్థికసంఘం సిఫార్సు చేసింది

Follow Us:
Download App:
  • android
  • ios