Asianet News TeluguAsianet News Telugu

ఆటోమొబైల్ పరిశ్రమకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలివ్వండి...కేంద్ర మంత్రికి వినతి....

మందగమనంతో విక్రయాలు లేక ఇక్కట్లను ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ పరిశ్రమకు తమకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలివ్వండని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరింది. జీఎస్టీ తగ్గించడంతోపాటు లిథియం బ్యాటరీ, ఇతర విడి భాగాల దిగుమతిపై సుంకాలు తగ్గించాలని అభ్యర్థించింది. 
 

Budget 2020: Industry Body Calls For Reduction In GST On Automobiles To 18%
Author
Hyderabad, First Published Jan 13, 2020, 11:32 AM IST

న్యూఢిల్లీ: వచ్చే బడ్జెట్‌లో ఆటోమొబైల్‌ రంగానికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆటో పరిశ్రమ కోరింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత మందగమన పరిస్థితుల దృష్ట్యా సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలని ఆయా సంస్థలు సూచించాయి. 

also read  ఆటోమొబైల్ ఎక్స్ పోలో రిలయన్స్ జియో, ఫేస్ బుక్ సందడి....

వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు, లిథియం ఇయాన్‌ బ్యాటరీ సెల్స్‌ దిగుమతులపై సుంకం రద్దు, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రోత్సాహకాలు కల్పించాలని ఆటోమొబైల్ పరిశ్రమ ఆశిస్తున్నది. ముఖ్యంగా బీఎస్‌-6 వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నది.

బీఎస్‌-6 రాకతో కాలుష్యం తగ్గుముఖం పడుతుందని, అయితే ఈ శ్రేణి వాహనాల తయారీకి 8 నుంచి 10 శాతం ఖర్చు పెరుగుతున్నదని ఆటో సంస్థలు చెబుతున్నాయి. కాబట్టి జీఎస్టీ తగ్గితే ఉపశమనం లభిస్తుందని, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని ఆటోమొబైల్ పరిశ్రమ ప్రతినిధులు కోరుతున్నారు. 

also  read  ‘స్ప్లెండర్’, ‘ఫ్యాషన్’ బైక్‌లు....చరిత్రనే తిరగ రాశాయి.....

అలాగే కొత్త వాహనాల కొనుగోళ్లకు ఊతమిచ్చేలా పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచాలని, స్క్రాపింగ్‌ పాలసీ ఆధారిత ప్రోత్సాహకాలను ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. గడిచిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత దారుణంగా గతేడాది వాహన విక్రయాలు పడిపోయిన విషయం తెలిసిందే. ఆర్థిక మందగమనం వల్ల ఆటో, దాని అనుబంధ రంగాల్లో లక్షల ఉద్యోగాలూ పోయిన సంగతీ విదితమే. 

దీంతో పరిశ్రమ బతకాలంటే బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు తప్పనిసరి అని కంపెనీలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్యాసింజర్‌, ద్విచక్ర, వాణిజ్య వాహన సేల్స్ నిరుడు 13.77 శాతం క్షీణించాయని ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం సియామ్‌ వెల్లడించింది. 

2018లో 2 కోట్ల 67 లక్షల 58,787 యూనిట్ల విక్రయాలు జరిగితే, 2019లో 2,30,73,438 యూనిట్లకే అమ్మకాలు పరిమితం అయ్యాయి. మార్కెట్‌లో నెలకొన్న స్తబ్ధత, తగ్గిన వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ లేమి తదితర అంశాలు ఆటో రంగ అమ్మకాలను దెబ్బతీశాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios