Asianet News TeluguAsianet News Telugu

అప్ఘాన్ నుండి విజయవాడకు వేలకోట్ల డ్రగ్స్... తాలిబన్- తాడేపల్లి సంబంధమేంటి?: ధూళిపాళ్ల సంచలనం

అప్ఘానిస్తాన్ నుడి ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ నగరం విజయవాడకు వేలకోట్ల విలువచేసే హెరాయిన్ అనే డ్రగ్ స్మగ్లింగ్ జరిగిందని... తాలిబన్లుకు తాడేపల్లికి వున్న సంబంధమేంటి అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రశ్నించారు. 

tdp leader dhulipalla narendra sensational comments on drugs smugling in vijayawada
Author
Amaravati, First Published Sep 20, 2021, 4:09 PM IST

గుంటూరు: అభివృద్ధికి చిరునామాగా వుండాల్సిన ఏపీని అంతర్జాతీయ మాఫియాకు అడ్డాగా మార్చారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. దేశంలో జరిగే సంఘటనలు చూస్తే ఏ విధంగా ఏపీలో అంతర్జాతీయ మాఫియా రాజ్యమేలుతోందో అర్థమవుతోందన్నారు ధూళిపాళ్ల. 

''బెంగాల్ రాష్ట్రంలో కలకత్తా విమాశ్రయంలో రేడియో ధార్మిక అణుపదార్థాలను బెంగాల్ సీఐడీ పోలీసులు పట్టుకున్నారు. దాని విలువ రూ.4,250 కోట్లు. దాని మూలాలు ఏపీలో ఉన్నాయని గుర్తించారు. ఆ యురేనియం ఏపీలో కడపలోనే దొరుకుతుందని అందరికీ తెలిసిందే. యురేనియం అక్రమ రవాణా ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించేందుకు ప్రయత్నిస్తే కలకత్తా పోలీసులు పట్టుకున్నారు. దీని వెనుక ఉన్న పులివెందుల పెద్దలు ఎవరో తేలాలి'' అని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు.

''పరమ పవిత్రంగా భావించే తిరుమల వెంకటేశ్వరస్వామికి భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. తలనీలాల్లో కూడా అంతర్జాతీయ మాఫియా మన దేశం నుండి మయన్నార్ కు పంపుతుంటే అస్సాం పోలీసులు పట్టుకుంది వాస్తవం కాదా.? సెంటిమెంటల్ గా వుండే వెంట్రుకలను మాఫియా ఏ విధంగా తరలిస్తుందో లింకులు కూడా ఏపీలో ఉన్నాయి'' అన్నారు.

''రూ.9 వేల కోట్లు విలువ చేసే హెరాయిన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి విజయవాడ నడిబొడ్డున వున్న ఆశి ట్రేడింగ్ కంపెనీ దిగుమతి చేసుకుంది. దేశ చరిత్రలో అతిపెద్ద హెరాయిన్ పట్టుకున్న సంఘటన ఇది. ఇదొక్కటే కాదు ఇప్పటికి 22 కంటెయినర్లలో రూ.72 వేల కోట్లు విలువైన హెరాయిన్ ఏపీకి వచ్చిందని కొన్ని కథనాలు కూడా వచ్చాయి. తాలిబన్ టు తాడేపల్లికి వున్న సంబంధం ఏంటి.?  వేల కోట్ల హెరాయిన్ ఆఫ్గన్ నుండి విజయవాడకు ఎలా వచ్చింది.? విజయవాడ నుండి ఎక్కడకు తరలివెళ్లింది, దాని వల్ల ఎవరు లబ్ధిపొందారు?'' అంటూ ప్రశ్నించారు. 

read more  ఆ ఎన్నికల్లోనూ మేం ఓడితే... టిడిపిని శాశ్వతంగా మూసేస్తాం: బుద్దా వెంకన్న సవాల్ (వీడియో)

''సామాన్యుడు ఈ పనులు చేయలేరు. ఇంత పెద్ద ఎత్తున హెరాయిన్ వచ్చినప్పుడు దాన్ని వివిధ ప్రాంతాలకు తరలించి, అమ్మకంలో ఎవరి సహకారం వుందో తేలాలి. దీని వెనుక కథనాల ప్రకారం కొందరు పోలీస్ అధికారులు సహాయం, కొంతమంది ప్రభుత్వంలోని పెద్దల సహకారం వుందని చెప్తున్నారు. ఇన్ని వేల కోట్ల హెరాయిన్ తాలిబన్ టు తాడేపల్లి తీసుకొచ్చి ప్రజల మాన, ప్రాణాలతో ఏవిధంగా ఆడుకుంటున్నారో చూస్తున్నాం. గత రెండేళ్లుగా టాల్కమ్ పౌడర్ పేరుతో 22 కంటెయినర్లు మన రాష్ట్రానికి వచ్చినట్లు, రూ.72 వేల కోట్ల విలువ అంటే ఎంత పెద్ద విషయమో అర్థమవుతోంది. దీని వెనుకున్న బిగ్ బాస్ ఎవరు.? ఇది సాధారణ వ్యక్తులు చేయాలంటే సాధ్య పడదు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు వుంటే తప్పితే ఇది సాధ్యపడే అంశం కాదు'' అని ఆరోపించారు. 

''గంజాయి విచ్చల విడిగా గ్రామాల్లో బహరంగంగా అమ్ముతున్నారు. ప్రభుత్వం చర్యలు ఈ అమ్మకాలను ప్రోత్సహించేలా ఉన్నాయి. విజయవాడలో గంజాయికి సంబందించిన గ్యాంగ్ వార్ జరిగింది. గుట్కాను అధికార పార్టీ ఎమ్మెల్యే గోడౌన్ లో తయారు చేస్తుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. గట్కా, గంజాయి వంటి వాటిల్లో  ప్రమేయముందనడానికి ఇటువంటివి కళ్లకు కనబడుతున్నాయి. వాటిని నియంత్రించకుండా పోలీసులు ప్రతిపక్షంపై కేసులు పెట్టి, వేధించడానికి పరిమితవుతున్నారు. పోలీసులు మాఫియాకు నిలయమైన వ్యక్తులను, సూత్రదారులపై ఎలాంటి చర్యలు తీసుకున్న సందర్భంలేదు'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

''గుట్కాలు, మాఫియాలు, అక్రమాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు.? రాష్ట్రంలో యువత మత్తులో వుండటానిక చాలా కారణాలున్నాయి. ఎందరో తల్లిదండ్రులు ఆవేదనతో ఉన్నారు. ఏపీ మాఫియాకు అడ్డాగా మారిందనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి.? ఈ ప్రభుత్వం వచ్చాక మారుమూల గ్రామాల్లో ఎంతో మంది జీవితాలు చిద్రమైనాయి. ప్రజల బలహీనతతో వ్యాపారం చేయడం దుర్మార్గం. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీకి సేవలు చేసి తొత్తులుగా పరిమితమయ్యారు. సంఘ విద్రోహ శక్తులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. డీజీపీ కూర్చుని పెద్ద స్టేట్ మెంట్లు ఇవ్వడం కాదు. ఎక్కడో హైదరాబాద్ లో వుండే మత్తు పదార్థాలు గ్రామాల్లోకి వస్తున్నాయంటే దాని వెనకున్న పెద్దలెవరో తెలియాలి. ప్రభుత్వ పెద్దల వ్యవహారం చూస్తుంటే కాదేదీ అనర్హం అన్నట్లు సంపాదనకు ప్రతిదాన్ని ఉపయోగిస్తున్నారు. మత్తు పదార్థాలు, గంజాయి, ఎర్రచందనాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే స్థితికి వచ్చారంటే పరిస్థితి అర్థం చేసెకోవచ్చు'' అని మండిపడ్డారు. 

''రూ.72 వేల కోట్ల విలువైన హెరాయిన్ వచ్చిందంటే దాని వెనుకున్న పెద్దలు ఎవరో తేలాలి. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా ఇలాంటివి జరుగుతున్నాయంటే సందేహం లేదు. ఏపీ అభివృద్ధికి చిహ్నంగా కాకుండా అరాచకాలు, మాఫియాకు అడ్డాగా మారింది. అంతర్జాతీయ సమాజం కూడా ఏపీ తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. తాలిబన్ నుండి తాడేపల్లికి ఈ హెరాయిన్ వచ్చిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏవిధంగా వున్నాయో అద్దం పడుతోంది. దీనిపై కేంద్రం సమగ్ర విచారణ జరిపించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం చెందాయని కేంద్ర రిపోర్టులు చూస్తే అర్థమవుతోంది'' అన్నారు.

''మహిళల వేధింపులో రాష్ట్రం రెండవ స్థానంలో వుంది. గుట్కా, మట్కా, మాఫియాలో ఏపీ చిరునామాగా మారింది. యురేనియం పట్టుకున్నారంటే దాని మూలాలు పులివెందులకు ఉన్నాయంటే ఆలోచన చేయాలి. యురేనియం రక్షణకు సంబంధించినది. బాంబులు తయారు చేయడానికి ఉపయోగించే దాన్ని కలకత్తా వరకు వెల్లిందంటే జగన్ సమాధానం చెప్పాలి'' అని డిమాండ్ చేశారు. 

''సీతానగరం వద్ద దళిత యువతని అత్యాచారం చేశారు. హాయ్ ల్యాండ్ రోడ్డులో మహిళను వివస్త్రను చేస్తే  రక్షణ కోరితే అందులో వైసీపీ వ్యక్తి వుండబట్టి ఆ కేసు ఎటు వెల్లిందో చెప్పలేని పరిస్థితి. గుంటూరులో రమ్య హత్య జరిగింది. ఏ ముఖ్యమంత్రి అయినా బాధితుల దగ్గరకు వెళ్లి పరామర్శించారు తప్పితే బాధితులను ఇంటికి పిలిపించుకుని పరామర్శించిన ఘటనలు లేవు. ఇది రాచరిక విధానం. డబ్బులిస్తే చాలన్న దృక్పదంలో ప్రభుత్వం వుండటం దురదృష్టకరం'' అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల మండిపడ్డారు. 


 

  

Follow Us:
Download App:
  • android
  • ios