రెచ్చగొట్టినా తొడలు కొట్టలేదు, మీసం తిప్పలేదు: బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులపై సజ్జల రియాక్షన్ ఇదీ...
ఉమ్మడి నీటి పారుదల ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. ఎవరెంత రెచ్చగొట్టినా కూడ సీఎం జగన్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించి విజయం సాధించారన్నారు. న్యాయం పక్షాన ఉన్నందునే కేంద్రం గెజిట్ విడుదల చేసిందన్నారు.
అమరావతి: న్యాయం మా పక్షాన ఉంది, అందుకే కేంద్రం బోర్డుల పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తీసుకు వచ్చిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.శుక్రవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. న్యాయం తమ పక్కనే ఉందని ఈ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తేలిందన్నారు. న్యాయం తమ పక్షాన ఉన్నందునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొందని ఆయన అభిప్రాయపడ్డారు.
also read:బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు: స్వాగతించిన బీజేపీ ఎంపీ జీవీఎల్
రాష్ట్ర విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయించి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభమయ్యేది కాదన్నారు. ఆనాడు చంద్రబాబునాయుడు సర్కార్ ఈ విషయమై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను అడ్డగోలుగా తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకొని తమ రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టిందని ఆయన ఆరోపించారు. విద్యుత్ ఉత్ప.త్తి కారణంగా తెలంగాణ రైతులు కూడ నష్టపోయే పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు.
తెలంగాణ వ్యవహరిస్తున్న అన్యాయపు పోకడల వల్లే పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.అనుమతులు లేకుండా ఒక్క ప్రాజెక్టు కూడ కట్టబోమని ఆయన తేల్చి చెప్పారు. తాము నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు యుద్ద ప్రాతిపదికన అనుమతులు తీసుకొంటామని ఆయన చెప్పారుఎవరెంత రెచ్చగొట్టినా తొడలు కొట్టడం, మీసాలు తిప్పలేదన్నారు.. తెలంగాణ దూకుడుగా వ్యవహరించినా సీఎం జగన్ రాజ్యాంగబద్దంగా ఒత్తిడి తెచ్చి విజయం సాధించారన్నారు.