హైద్రాబాద్ మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను గుర్తించినట్టుగా ఎల్ బీ నగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పారు.
హైదరాబాద్: మీర్ పేట బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని ఎల్ బీ నగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పారు.మంగళవారం నాడు ఎల్ బీ నగర్ డీసీపీ హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. మీర్ పేట ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
బాలికపై ముగ్గురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసేందుకు ఏడు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా డీసీపీ చెప్పారు. నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయన్నారు. ఈ ఆధారాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. బాధితురాలు క్షేమంగా ఉందని ఆమె వివరించారు. బాధితురాలికి మెడికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని డీసీపీ చెప్పారు. బాలికపై అత్యాచారం చేసిన వారిని గంజాయి బ్యాచ్ గా అనుమానిస్తున్నట్టుగా డీసీపీ చెప్పారు.
మీర్ పేటలో బాధితురాలి ఇంటికి వెళ్లి సోదరుడి ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలు సోదరులతో కలిసి మీర్ పేట నందనవనంలో ఉంటుంది.
బాధితురాలి తండ్రి మరో వివాహం చేసుకోవడంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాధితురాలు సోదరులతో కలిసి నందనవనంలోని ఇంట్లో నివాసం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించిన నిందితులు ఉదయం పూటే ఇంట్లోకి వచ్చి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనను నిరసిస్తూ ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
also read:హైద్రాబాద్ మీర్‌పేట నందనవనంలో బాలికపై గ్యాంగ్ రేప్: బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన...అరెస్ట్
ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇంటిలోకి వచ్చి మరీ బాలికపై అత్యాచారం చేసిన ఘటనపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. నందనవనం గంజాయికి అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.గంజాయి, మద్యం విక్రయాలను అరికట్టాలని కోరుతున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు,.