మాదాపూర్ డ్రగ్స్ కేసును పోలీసులు లోతుగా విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇది కేవలం డ్రగ్స్ పార్టీ మాత్రమే కాదు వ్యభిచార దందా కూడా అని తాజాగా బయటపడింది.
హైదరాబాద్: ఎక్కడో సిటీ బయట పార్మ్ హౌస్, రిసార్ట్ లోనో కాదు... ఏకంగా తెలంగాణ నగరం నడిబొడ్డన రేవ్ పార్టీ నిర్వహణ కలకలం రేపింది. అయితే ఈ రేవ్ పార్టీ, డ్రగ్స్ వ్యవహారంపై విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇది కేవలం రేవ్ పార్టీ మాత్రమే కాదు ఈ ముసుగులో వ్యభిచార దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సినిమా అవకాశాల పేరిట అమ్మాయిలను ఈ వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ మాదాపూర్ లోని విఠల్ రావ్ నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసారు. అపార్ట్ మెంట్ లోని ఓ ప్లాట్ కొందరు సినీ ప్రముఖులు, డిల్లీకి చెందిన అమ్మాయిలను పోలీసులు గుర్తించారు. ప్లాట్ లో డ్రగ్స్ ను కూడా పోలీసులు గుర్తించారు. పలు తెలుగు సినిమాలకు ఫైనాన్షియర్ గా వ్యవహరించిన వెంకట్ రేవ్ పార్టీ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
మూవీ పైనాన్షియర్ వెంకట్ తో పాటు పట్టుబడిన బాలాజీ గతంలో వ్యభిచారం నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఈ ఇద్దరు వ్యభిచారం కేసులో రెండుసార్లు పట్టుబడ్డారని... అందుకు సంబంధించిన కేసులు వీరిపైన వున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కోణంలో విచారణ జరిపిన పోలీసులు తాజాగా ఇద్దరు అమ్మాయిలను కూడా వ్యభిచారం కోసమే తీసుకువచ్చినట్లు గుర్తించారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి ఈ ఇద్దరు అమ్మాయిలను తీసుకువచ్చి గత రెండు రోజులుగా ఇదే అపార్ట్ మెంట్ లో వుంచినట్లు సమాచారం. ఈ అమ్మాయిలతో గడిపేందుకే మిగతావారు అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.
Read More మాదాపూర్ డ్రగ్స్ కేసు: సినీ ఫైనాన్షియర్ వెంకట్ సహా ఐదుగురు అరెస్ట్
డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న వెంకట్ గోవా నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇలా గంజాయితో పాటు వివిధ రకాల డ్రగ్స్ తో సినీ రంగానికి చెందినవారితో పాటు ఇతర ప్రముఖులకు వెంకట్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడని బయటపడింది. తాజా మాదాపూర్ దాడిలో 15 గ్రాముల ఎండిఎంఏ, 30 ఎల్ఎస్టి పిల్స్ తో పాటు గంజాయి ప్యాకెట్లు కూడా పోలీసులకు చిక్కాయి.
గతంలో తెలుగు సినిమా ప్రముఖులు చాలామంది డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని విచారణకు కూడా హాజరైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సినీ పరిశ్రమకు చెందినవారు డ్రగ్స్, వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తులో ఒక్కోటిగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. వెంకట్ డ్రగ్స్ సప్లై చేసే కస్టమర్లలో సినీ ప్రముఖులు చాలామందే వుండవచ్చనే అనుమానాలున్నాయి.