టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం విషయంలో దాఖలైన పిల్ లో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించారా? లేదా? అనేది మూడు నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకం మీద మొట్టికాయలు వేసింది. వీరి నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించారా? లేదా? అనే విషయం పునః పరిశీలించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత దశలో టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రశ్న అవసరం లేదని అభిప్రాయపడింది హైకోర్టు. కాకపోతే సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించారా? లేదా? అనే విషయం మీద మూడు నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 108 రద్దు చేయలేమని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ ఆరుగురి నియామకానికి సంబంధించిన విషయం ప్రభుత్వం చేసే తాజా కసరత్తుకు లోబడి ఉంటుందని తెలిపింది. 2021 మే 19న రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ సభ్యులను నియమిస్తూ జీవో జారీ చేసింది.
ధరణిని రద్దు చేయం, కేసీఆర్ పథకాలు వుంటాయి : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అయితే, టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం ఎలాంటి ఎంపిక ప్రక్రియ నిర్వహించ లేదని.. ఇది సరైన పద్ధతి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2021 మే లోనే వీరి నియామకం మీద హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ వినాయక రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నియామకమైన వారిలో ధన్ సింగ్, బండి లింగారెడ్డి, సుమిత్ర ఆనంద్ తనోబా, కారం రవీందర్ రెడ్డి, అరవిల్లి చంద్రశేఖర రావు, ఆర్ సత్యనారాయణ.. అనే ఆరుగురు సభ్యుల నియామకం సరిగాలేదని పేర్కొన్నారు. టిఎస్పిఎస్సి నిబంధనల మేరకు వీరు అర్హులు కాదంటూ ఆ పిల్ లో తెలిపారు.
ఈ పిల్ మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం 80 పేజీల కీలకతీర్పును వెలువరించింది. ఈ ఆరుగురిని నియమించిన తీరును తప్పు పట్టింది హైకోర్టు. కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్, సభ్యుల పదవులకు... రాజ్యాంగంలోని అధికరణ 316 ప్రకారం ఎలాంటి అర్హతలు, విధానాన్ని పేర్కొనలేదని…కానీ, ఆ పదవులకు తగ్గట్టుగా వారి అర్హత, సామర్థ్యం ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది.
ఇలాంటి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో నియామకాలు చేపట్టే ముందు.. ఆ సభ్యుల పూర్వాపరాలను విచారించాలని.. నిశితంగా పరిశీలన జరపాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. రాజ్యాంగంలోని అధికరణ 316 ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను నియామకం చేసే అధికారం గవర్నర్ కు ఉంది. అలాగని నియామక విధానం లేకపోవడం వల్ల ప్రభుత్వం తన ఇష్టం వచ్చిన వారిని నియమించే విచక్షణాధికారం లేదని, అలా ఎంపిక చేయడం సరికాదని తెలిపింది.
పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సభ్యులపై వ్యక్తిగతంగా ఎవరికి అభ్యంతరాలు లేవన్నారు. కాకపోతే నియమకాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయన్నారు. నియమితులైన సభ్యులలో.. రమావత్ థన్ సింగ్ జిహెచ్ఎంసిలో ఈఎన్ సీగా రిటైర్ అయ్యారని, లింగారెడ్డి ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారని అన్నారు. ఇక సుమిత్ర ఆనంద్ జడ్పీ స్కూల్లో తెలుగు టీచర్, ఏ చంద్రశేఖర రావు ఆయుర్వేదిక్ డాక్టర్.. రవీందర్ రెడ్డి రిటైర్డ్ డిప్యూటీ తహసిల్దార్, ఆర్ సత్యనారాయణ ఎమ్మెల్సీగా సేవలు చేశారని చెప్పారు. రాష్ట్ర సివిల్ సర్వీసెస్ లో నియామకమయ్యే అభ్యర్థులు నిబంధనల ప్రకారం ఫస్ట్ క్లాస్ గెజిటెడ్ పోస్టుల్లో పనిచేసిన వారే అయి ఉండాలన్నారు.