తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు: ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశం

By narsimha lode  |  First Published Dec 16, 2022, 12:58 PM IST

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.  ఈ నెల  19వ తేదీన  విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు. 


హైదరాబాద్: తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డికి  ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలని రోహిత్ రెడ్డిని ఆ నోటీసులో పేర్కొన్నారు. బెంగుళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఇటీవల పదే పదే చెబుతున్నారు.  ఈ తరుణంలో  పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ కావడం  చర్చకు దారి తీసింది.  ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారని పైటెల్ రోహిత్ రెడ్డి  నిర్ధారించారు.  అయితే  నోటీసులను చూడాల్సి ఉందన్నారు. ఏ కేసులో తనకు నోటీసులు ఇచ్చారో తెలియదని రోహిత్ రెడ్డి తెలిపారు.తన బిజినెస్, ఐటీ రిటర్న్స్, కుటుంబ సభ్యుల వివరాలు అడిగారని పైలెట్ రోహిత్ రెడ్డి చెప్పారు.

ఈ ఏడాది అక్టోబర్  26వ తేదీన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలను గురి చేస్తూ  ముగ్గురు పోలీసులకు పట్టుబడ్డారు. రామచంద్రభారతి,  సింహయాజీ,  నందకుమార్ లను పోలీసులు అరెస్ట్  చేశారు. ఇటీవలనే వీరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  

Latest Videos

మొయినాబాద్  ఫాం హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారు.తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ హస్తం ఉందని  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.  

ఈ కేసు విచారణ సిట్ తో కాకుండా సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని  బీజేపీ సహా పలువురు డిమాండ్  చేశారు. ఈ  విషయమై  తెలంగాణ హైకోర్టులో  పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై   ఇవాళ చివరి వాదనలు జరిగే అవకాశం ఉంది. 

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు దేశ వ్యాప్తంగా  చర్చకు దారి తీసింది.ఈ విషయంలో  పైలెట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తమను ప్రలోభాలకు గురి చేస్తున్న వారిని  ట్రాప్ చేసి పోలీసులకు పట్టించారు.ఈ విషయమై ఎప్పటికప్పుడు  బీఆర్ఎస్ నాయకత్వానికి  సమాచారం అందించారు రోహిత్ రెడ్డి. పార్టీ నాయకత్వం సూచన మేరకు  నిందితులను పోలీసులకు అప్పగించేలా ప్లాన్ చేశారు రోహిత్ రెడ్డి. ఈ విషయమై  ఆడియో, వీడియో సంభాషణలను  తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే.

also read:ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : బీఎల్ సంతోష్, జగ్గుస్వామి సిట్ నోటీసులపై స్టే పొడిగింపు

మరో వైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్  కు  ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న విచారణకు రావాలని  ఆ నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు.  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కూడా  విచారణకు రావాలని కోరారు.


 

click me!