ఆసియా ఖండంలో.. ఆ మాటకు వస్తే అతిపెద్ద ఉత్పాదక కేంద్రంగా మారిన ‘డ్రాగన్’కు గట్టి ఎదురుదెబ్బ తగలనున్నది. కరోనా నేపథ్యంలో ఆపిల్ నెక్ట్స్ ప్రొడక్షన్ కేంద్రం ఇండియా నిలువనున్నది. అంటే చైనా నుంచి ప్రొడక్షన్ యూనిట్ల తరలింపునకు ‘ఆపిల్’ కసరత్తు చేస్తున్నది. కేంద్రం ప్రకటించిన పీఎల్‌ఐ, ‘సోర్సింగ్' సడలింపుల ద్వారా లబ్ధి పొందాలని యోచిస్తోంది. ‘ఆపిల్’కు ఎదురయ్యే ఇతర అవరోధాల తొలిగింపునకు కేంద్రం సానుకూలత వ్యక్తం అవుతున్నది.
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు దీర్ఘకాలం నుంచి ఎదురుచూస్తున్న అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఆపిల్ ఇప్పుడు ఆ అంశంపై దృష్టిసారించింది. భారత్‌లో ఇప్పటివరకు సొంత స్టోర్‌ను ప్రారంభించలేకపోయిన ఆపిల్.. ప్రస్తుతం చైనాలోని తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో కనీసం ఐదోవంతు భాగాన్ని భారత్‌కు తరలించేందుకు కసరత్తు చేస్తున్నది.
దేశంలో మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీదారులతోపాటు ఎగుమతిదారుల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం ద్వారా లబ్ధి పొందాలని ఆపిల్ ఆశిస్తున్నది. లోకల్ సోర్సింగ్ నిబంధనల్లో కేంద్రం ఇచ్చిన సడలింపుల ద్వారా కూడా లబ్ధి పొందాలని ఆపిల్ ఆకాంక్షిస్తున్నట్టు సమాచారం.
ఈ విషయమై ఆపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఇప్పటికే పలు దఫాలు చర్చించారు. ఇది కరోనా వైరస్ నేర్పిన గుణపాఠం కానున్నది. కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లయిన చైనా నుంచి తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో ఐదో వంతు భాగాన్ని భారత్‌కు తరలించడానికి ప్రయత్నిస్తున్నది.
ప్రస్తుతం తమ స్మార్ట్‌ఫోన్లతోపాటు ఇతర గ్యాడ్జెట్ల తయారీ కాంట్రాక్టులను ఫాక్స్‌కాన్, విస్ట్రన్ లాంటి సంస్థలకు ఇస్తున్న ఆపిల్.. భారత్‌లో దాదాపు 4 వేల కోట్ల డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను తయారుచేసేందుకు ఈ కాంట్రాక్టర్లను ఉపయోగించుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆ సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు.
అయితే పీఎల్‌ఐ పథకంలో కొన్ని అవరోధాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని ఆపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. పీఎల్‌ఐ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఏ కంపెనీ అయినా 2020 నుంచి 2025 మధ్యకాలంలో దశలవారీగా కనీసం వెయ్యి కోట్ల డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను తయారు చేయాలి.
పీఎల్ఐ పథకానికి ఎంపికైన కంపెనీ తమ వార్షిక లక్ష్యాలను తప్పక అధిగమించాలి. ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఈ పథకానికి ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను ప్రకటించనున్నది. ఈ మార్గదర్శకాలు జారీ అయిన వెంటనే ఆపిల్‌తోపాటు శామ్‌సంగ్, వివో, ఒప్పో లాంటి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కూడా పీఎల్‌ఐ పథకానికి దరఖాస్తు చేసుకొనే అవకాశమున్నది.
also read డ్యూయల్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరాలతో వివో కొత్త స్మార్ట్ ఫోన్
ఆపిల్ ఇప్పటికే భారత్‌లో ఐఫోన్-7, ఐఫోన్-ఎక్స్‌ఆర్ మోడళ్లను తయారు చేస్తున్నది. గతంలో ఐఫోన్-ఎస్‌ఈ, ఐఫోన్-6ఎస్ మోడళ్లను కూడా భారత్‌లో తయారు చేసినా ఆపిల్ తమ అంతర్జాతీయ ఉత్పత్తుల జాబితా నుంచి ఆ రెండు మోడళ్లను తొలగించింది.
గత త్రైమాసికం చివరి నాటికి భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో ఆపిల్ 62.7 శాతం వాటాను కలిగి ఉన్నట్టు ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ కొద్ది రోజుల క్రితం వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో రీసెల్లర్ల ద్వారా అమ్మకాలు జరుపుతున్న ఆపిల్.. ఇప్పటివరకూ ఇక్కడ సొంత స్టోర్లను ప్రారంభించలేకపోయింది.
వచ్చే ఏడాది భారత్‌లో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ గతనెల తమ పెట్టుబడిదారులకు తెలిపారు. లోకల్ సోర్సింగ్ నిబంధనలను సడలిస్తున్నట్టు ప్రకటించగానే భారత ప్రభుత్వానికి ఆపిల్ ధన్యవాదాలు తెలిపింది. భారత్‌లో తమ తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించే రోజు కోసం ఎదురుచూస్తున్నట్టు ఆపిల్ పేర్కొన్నది.
ప్రస్తుతం భారత్‌లో ఆపిల్ ఏటా దాదాపు 150 కోట్ల డాలర్ల విలువైన ఐఫోన్లను అమ్ముతున్నది. వీటిలో మూడో వంతు కంటే తక్కువ మాత్రమే స్థానికంగా తయారవుతున్నాయి. అయితే చైనాలోని తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టిన అతిపెద్ద సంస్థల్లో ఆపిల్ ఒకటి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ చైనాలో దాదాపు 22 వేల కోట్ల డాలర్ల విలువైన వస్తువులను ఉత్పత్తి చేసింది.
ఐఫోన్-ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయంగా అందుబాటులోకి తేవడంతోపాటు భారత్‌లోనూ అమ్ముతామని ఆపిల్ ఇటీవల వెల్లడించింది. అంతేకాకుండా తమ ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించడంతోపాటు ‘హోంపాడ్' స్మార్ట్ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని ఆ సంస్థ ప్రకటించింది.
ఆపిల్ రాబోయే ఐదేళ్లలో సుమారు 40 బిలియన్ డాలర్లు విలువైన ఉత్తులను తీసుకురానుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే, ఐఫోన్ తయారీదారు భారతదేశపు అతిపెద్ద ఎగుమతిదారుగా మారవచ్చని నిపుణులు అంటున్నారు. గత ఏడాది చివర్లో భారత ప్రభుత్వం స్థానిక సోర్సింగ్ నిబంధనలపై ఇచ్చిన సడలింపులపై ఆపిల్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం గమనార్హం.