పారాలింపిక్స్‌లో భారత్ జోరు... హై జంప్‌లో రెండు మెడల్స్, మరియప్పన్ తంగవేలుకి రజతం...

By Chinthakindhi RamuFirst Published Aug 31, 2021, 5:30 PM IST
Highlights

మెన్స్ హై జంప్ టీ63 ఈవెంట్‌లో పోటీపడిన భారత అథ్లెట్ మరియప్పన్ తంగవేలు‌కి రజతం, శరద్ కుమార్‌‌కి కాంస్య పతకం... టోక్యో పారాలింపిక్స్‌లో 10కి చేరిన భారత పతకాల సంఖ్య...

పారాలింపిక్స్ 2020లో భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. మొన్న మూడు పతకాలు, నిన్న నాలుగుపతకాలు భారత్ ఖాతాలో చేరగా... నేడు మరో మూడు పతకాలు సాధించారు భారత పారా అథ్లెట్లు.. 

మెన్స్ హై జంప్ టీ63 ఈవెంట్‌లో పోటీపడిన భారత అథ్లెట్ మరియప్పన్ తంగవేలు, రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు. అదే ఈవెంట్‌లో పోటీపడిన శరద్ కుమార్‌ కాంస్య పతకం సాధించాడు. వీటితో కలిపి పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య రికార్డు స్థాయిలో 10కి చేరింది.

మరియప్పన్‌కి ఇదో పారాలింపిక్స్ మెడల్. రియోలో జరిగిన 2016 పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మరియప్పన్, టోక్యోలో భారత పతకాన్ని చేపట్టి భారత బృందాన్ని నడిపించాల్సింది. అయితే మరియప్పన్‌తో ప్రయాణించిన ఓ వ్యక్తి, కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న ఈ అథ్లెట్... క్వారంటైన్ ముగించుకున్న తర్వాత రజతంతో మెరిశాడు.

అంతకుముందు మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో భారత్‌కి చెందిన సింగ్‌రాజ్ కాంస్య పతకం గెలిచాడు. 39 ఏళ్ల సింగ్‌రాజ్ ఫైనల్‌లో 216.8 పాయింట్లు సాధించి, మూడో స్థానంలో నిలిచాడు. 
 
పారాలింపిక్స్‌లో భారత వుమెన్ షూటర్ ఆవనీ లేఖరా స్వర్ణం సాధించగా... జావెలిన్ త్రో ఈవెంట్‌లో ప్రపంచరికార్డు క్రియేట్ చేసిన సుమిత్ అంటిల్ భారత్‌కి రెండో గోల్డ్ మెడల్ అందించాడు.  రెండు స్వర్ణాలు, 5 రజతాలు, మూడు కాంస్య పతకాలతో 30వ స్థానంలో ఉంది టీమిండియా.

click me!