ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న పాత ప్రేమికులు అకస్మాత్తుగా కలిస్తే ఎలా ఉంటుంది.. వారి మధ్య సంభాషణ ఎలా సాగుతుంది. వారి మధ్య ప్రేమానురాగాలు, వారి మధ్య అనుబంధం ఎలా వ్యక్తమవుతుందో చెప్పే ప్రేమ కథ ఇది
“ఎందుకిలా అయ్యావు?” అడిగిందామె. ఈ ప్రశ్న వేసినప్పుడు ఆమెలోని దయనంతా దోసిళ్లతో తన మీదకుమ్మరించినట్లనిపించింది అతనికి.
“ఎలా అయ్యాను?” ప్రశ్నకు ప్రశ్నే జవాబు.
“నిన్ను నువ్వు పట్టించుకుంటున్నావా?” అడిగిందామె. గొంతులో జీర తేనెలా. ఆమెనే చూస్తూ నించున్నాడు అతను. మాట్లాడలేదు.
“ఎందుకంత నిర్లక్ష్యం నీ మీద నీకు?” అని గద్దించింది. అతని మీద అదే ఆజమాయిషీ.
“నువ్వేం మారలేదు” అన్నాడతను.
ఆమె నవ్వింది. ఆ నవ్వులో అప్పటి జీవం లేదు. “నేను మారలేదా?” అనే ప్రశ్న వుంది ఆ నవ్వులో. ఆమెను చూడగానే ఎక్కడో జారవిడుచుకున్న పువ్వు మళ్లీ కంట పడినంత ఆనందమేసిందతనికి. చేతులతో స్పృశించవచ్చునా అని సందేహించాడు. ఆమెనే అతని చేయిని అందుకుని మెత్తగా నొక్కి వదిలేసింది. శరీరమంతా జీవం పోసుకున్న అనుభూతి. వేయి ఏనుగుల బలం వచ్చినంత ఆత్మానందం. ఆమెకీ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకున్నాడు..
ఇద్దరూ ఉస్మానియా యూనివర్శిటీ రోడ్డు మీద నిలబడ్డారు. ఎవరెవరో వారిని దాటిపోతున్నారు. వారిరువురికి ఈ లోకం స్పృహ ఉన్నట్లు లేదు. ఈ కళ్లలోనూ ఓ వింత మెరుపు.
“నా ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదు' అందామె. నిన్నోసారి యూనివర్శిటీ లో పిల్చిన పేరుతో పిలువొచ్చా?" అని అడిగాడు ఆమె ప్రశ్నకు జవాబివ్వకుండా.
“దానికేం.. ?” అందామె.
“దేవీ! నువ్వు ఆనందంతో లేవనే విషయం తెలుస్తూనే వుంది. నేనెట్లో వుంటాను?” అన్నాడతను. ఆమె పేరు శ్రీదేవి. అతను ఆమెను 'దేవీ' అని పిలిచేవాడు. యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు అతనికి జీవితం మీద ఎంత ఆశ వుండేదో, విప్లవం మీదా అంతే ఆశ వుండేది. తన జీవితాన్ని తన ఇష్ట ప్రకారం తీర్చి దిద్దుకుంటానని, తనదో ఆదర్శవంతమైన జీవితం అవుతుందని అతను కలలు కన్నాడు. దేశంలో సూర్యుడు ఉదయించినంత సహజంగా విప్లవం వచ్చి తీరుతుందని నమ్మాడు. తన జీవితం ఆనందమయం కావడానికి శ్రీదేవి జీవితాంతం తోడుగా వుండడానికి విడదీయరాని సంబంధం వుందనే అతను నమ్మాడు. శ్రీదేవి తనది కాకుండా పోతుందని అతను ఏనాడూ ఊహించలేదు. ఎన్నికలు వచ్చాయంటే “కాలేజీ కుర్రవాడ! కులాసాగ తిరిగేటోడ, విలాసాల మాట మరువరో విద్యార్థి, విప్లవాల బాట నడవరో, విద్యార్థి” అని వంద గొంతులతో తనూ గొంతు కలిపేవాడు. అడవిలో వెన్నెల మైదాన ప్రాంతంలో విరబూస్తుందని గట్టిగా విశ్వసించేవాడు. ఎక్కడో తీగ తెగింది. తాను 'దారి తప్పాడు. తాను ఒక్కడిని దారి తప్పినంత మాత్రాన విప్లవం రాకుండా పోతుందా? మరి ఎందుకు రాలేదు?
“ఏమిటి వేణూ! ఆలోచిస్తున్నావ్?” అని అడిగింది శ్రీదేవి.
ఉలిక్కిపడి “ఏం లేదు. అలా పార్క్ లో కూర్చుందామా కాసేపు... నీకు అభ్యంతరం లేకపోతేనే” “పద” అంది.
ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర నుంచి యూనివర్శిటీ గార్టెన్ వైపు నడక సాగించారు. ఆ రోడ్డు మీద ఇద్దరు కలిసి ఎన్నిసార్లు నడిచారో? విడిపోతామని ఆ రోజే తెలిసి వుంటే ఎన్ని సార్లు ఇలా నడిచారో అతను లెక్కపెట్టుకుని వుండేవాడే.
“యూనివర్శిటీ చాలా మారింది కదూ!” అంది.
“మనం మారలేదూ?!” అన్నాడు వేణు.. “ఏం మారా ఆ మారాం ?" అని అడిగింది. తనకు తెలియకనే అడుగుతోందా అని అనుకున్నాడతను. తమలో వచ్చిన మార్పును ఆమె గుర్తించలేదా? గుర్తించలేదని అనుకోవడానికి ఏమీ లేదు. కావాలనే ఆ ప్రశ్న వేసి.. అర్థమైపోయిందతనికి,
“నీతో ఎప్పుడూ ఇంతే... నీ ఆలోచనలో సువ్వు ఉండిపోతావ్. నీ మనస్సులో ఏముందో కనుక్కొని నీ ఆలోచనలకు అనుగుణంగా సడుచుకోవాలి” అంది.
అతను నవ్వాడు.
“నవ్వెందుకొస్తోంది?” అంది ఉడికిపోతూ. మళ్లీ అప్పటి శ్రీదేవిని చూసినట్లనిపించిందతనికి.
జేబులోంచి సిగరెట్టు తీసి ముట్టించబోయాడు.
“ఇంకా సిగరెట్లు మానలేదా?” అని అడిగింది. ఆమె ముఖంలోకి ఒకసారి చూసి విషాదంగా నవ్వాడు. ఆ నవ్వులో నువ్వు లేకపోయిన తర్వాత... అనే అర్థం పుంది.
“సిగరెట్టు ఎందుకు తాగుతావంటే నువ్వు కవిత్వం పంక్తులేవో చెప్పేవాడివి. అవి గుర్తున్నాయా?” అంది.
“హసనానికి రాణివి నీవై. వ్యసనానికి బానిస నేనై" చెప్పాడతను.
“ఇంకా గుర్తుందే!” అంది.
“విప్లవ గేయాలు గుర్తు లేవు గాని ఇవి గుర్తున్నాయి" చెప్పాడతను సిగరెట్టు దమ్ము లాగి పొగ వదులుతూ.
“నిజంగానే విప్లవం వస్తుందంటావా, వేణూ?” అని అడిగింది.
“నువ్వు నా దగ్గరికి వస్తావా?” అని అడిగాడు. ఆమె మాట్లాడలేదు. లా కాలేజీ దగ్గరకు వచ్చారు.
“అప్పుడు యూనివర్శిటీలో అడుగు తీసి అడుగు వేస్తుంటే ప్రపంచాన్ని జయించినట్లనిపించేది” అన్నాడతను.
“వేణూ! ఎందుకంత నిరాశ నీలో?” అని అడిగింది. “నీకు గుర్తుందా? రేవతీదేవి పోయెట్రీ చదవమని నేను పోరు పెట్టేవాడ్ని “ఓ కవిత కూడా ఎప్పుడూ వినిపించేవాడివి. ఏమిటా కవిత?"
“దిగులు
దిగులు దిగులుగా దిగులు
ఎందుకా
ఎందుకో చెప్పే వీలుంటే
దిగులెందుకు?”
“నీ దిగులు చెప్పలేనిదంటావా?”
“నీలో దిగులు లేదా?” అడిగాడు. ఆమె మాట్లాడలేదు. వేణు చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఏదో చల్లని తెమ్మెర ఒంటినంతా ప్రేమతో నిమిరినట్లు అనిపించింది అతనికి.
“ఎప్పటికీ ఇలాగే వుంటే బాగుండును” అని తనలో తానే గొణుక్కున్నట్లు అన్నాడు.
“ఏమిటి వేణూ! అంతగా ఇదైపోతావ్?” అన్నది బాధగా శ్రీదేవి. ఇద్దరూ పార్క్ లో అడుగు పెట్టారు. నీడనిచ్చే చెట్టు చూసుకుని కూర్చున్నారు. శ్రీదేవి కూర్చున్న తీరు ఆమె అనీజీని పట్టిస్తోంది.
“ఇలా కూర్చోవడం ఇష్టం లేకపోతే వెళ్లిపోదాం” అన్నాడతను. “ఛా, ఎంత మాట...” అంటూ సర్దుకుని కూర్చుంది.
“నా కలలేవీ ఫలించడం లేదు, దేవీ! అందుకే ఈ నిరాశ. పైగా దేని మీదా విశ్వాసం కుదరడం లేదు. విప్లవాన్ని అభిమానించినప్పుడు, నిన్ను ప్రేమించినప్పుడు నాకీ నిరాశ లేదు. యూనివర్శిటీ చూశావా, ఎంత కళావిహీనంగా వుందో? ఒకప్పుడు కదం తొక్కుతున్నట్లుండేది” అన్నాడు.
“అంతా మనస్సులోనే వుందేమో..." అందామె.
“నిజమే. మన మనస్సును బట్టి కూడా దృశ్యాలు మారుతుంటాయి. కానీ నాకెందుకో యూనివర్శిటీ సుప్తావస్థలోకి వెళ్లడానికి మన పాత్రనే ఎక్కువగా పుందేమో అనిపిస్తుంది”
“ఇదేమిటి, కొత్తగా మాట్లాడుతున్నావు?” అని అడిగింది.
ఇంతలో అటు రాజేష్ వచ్చాడు. అతనో విద్యార్థి సంఘానికి నాయకుడిగా పని చేసేవాడు. ఉస్మానియాలో లెక్చరర్గా చేరి ప్రొఫెసర్ అయ్యాడు. వారిద్దరినీ చూసి నవ్వాడు. “బాగున్నారా?” అంటూ పలకరించి వెళ్లిపోయాడు. కాకి ఒకటి కావు కావుమని అరిచింది.
“ఇదే టాగోర్ ఆడిటోరియంలో శ్రీశ్రీ సభ జరిగింది. గుర్తుందా? విద్యార్థుల వెల్లువ ఆ రోజు” అన్నాడు వేణు.
“నువ్వింకా మర్చిపోలేదా?” అని అడిగింది.
“సరే, ఇప్పుడవన్నీ ఎందుకు గానీ.. నువ్వేం చేస్తున్నావు? జీవితం ఎలా వుంది?” అని అడిగాడు.
చీర కొంగును కుడి చూపుడు వేలుకు చుడుతూ కిందికి చూస్తూ “జీవితానికేం బాగానే వుంది. భర్త, ఇద్దరు పిల్లలు. వారికి అన్నీ సమకూరుస్తూ వంటింటి కుందేలు పాత్రలో నేను” అంది.
“అలా బాగుందా జీవితం?”
“బాగుందా లేదా అనే ఆలోచన రానీయకపోతే బాగానే వుంటుంది. ఆలోచన వచ్చిందంటే ఎక్కడ లేని నిరాశ నిస్పృహ”.
ఆ పచ్చని కలలు.. పచ్చనివేనా కలలు...? ఎర్రవి కూడా.. ఏమై పోయాయి? ఇప్పుడు కలలు కనడానికి కూడా ఏమీ లేదు. మనసంతా పరుచుకున్న బీడు. ఒక నీటి చెలిమ పడదు. ఎర్రటి కలలు ఫలించాక పచ్చటి స్వప్నాలు పండుతాయని ఆ రోజుల్లో తనకెంత నమ్మకం! అంతా అయిపోయింది. ఇంకా అయిపోలేదని చెప్పేవాళ్ల మీద అనుమానం, అవిశ్వాసం, కావాలని అబద్దాలు చెప్పుతున్నారని తెలిసిపోతున్న జ్ఞానం. దేన్నయినా విశ్వసించాలంటే కొంత అజ్ఞానం కూడా వుండాలి. వరుసగా ఆ హత్యలే జరగకపోతే... ఆయుధాలే యూనివర్శిటీలోకి అడుగు పెట్టకపోతే.. వరుసగా ఒక హత్య తర్వాత మరో హత్య.. కళ్ల ముందటే రంగు వెలిసిపోయిన యూనివర్శిటీ. ఇప్పటికీ దాన్నే పట్టుకుని వెళ్లాడుతున్నవారు విద్యార్థి సంఘం సభ్యత్వం పదింతలు పెరిగిందంటున్నారు.
“నీతో ఇదే తంటా. పక్కన ఓ మనిషి వుందని మర్చిపోయి ఆలోచనలో పడిపోతావు” అంది.
“అతను చెప్పిందాంట్లో నిజం వుందని నాకనిపించలేదు. ఉతికి పారేశాను, సభ్యత్వం పెరిగిందంటాడు. అది ఉద్యమం పేరిందనడానికి తార్కామట. అయితే ఉద్యమం అప్పటంత ఉధృతంగా లేదట. నేను ఉజేరుకుంటానా? ఉతికి పారేశా. ఉద్యమం వృత్తిగా మారాక ఉద్యమం ఫలితాలుసాధించడం వట్టి మాట అని స్టేజీ మీదనే చెప్పేశా” అన్నాడు.
“ఏమిటి వేణూ! నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నాతో ఓ పది నిమిషాలు హాయిగా మాట్లాడొచ్చు కదా!” అంది శ్రీదేవి.
“నువ్వు చాలా అందంగా వున్నావు దేవీ! యూనివర్శిటీలో ఉన్నప్పటి కన్నా ఇప్పుడు అందంగా వున్నావు” అని పకపకా నవ్వాడు.
“ఏమిటా నవ్వు?” చిరుకోపం ప్రదర్శించింది. “కోపమొచ్చిందా?” అని అడిగాడు.
“కోపం రాక... నువ్వు చాలా అందంగా వున్నావని ఆ రోజుల్లో ఏనాడైనా అన్నావా?”
“నాకెందుకో అలా చెప్పాలనిపించేది కాదు. అలా చెప్పడం వల్ల ప్రేమ కలుషితం అవుతుందని అనిపించేది. పైగా అలా చెప్పాల్సిన అవసరం కనిపించేది కాదు. నువ్వు నన్ను ఇష్టపడ్డావు. నన్నెందుకు ఇష్టపడ్డావో నాకేనాడు నువ్వు చెప్పలేదు. నేనూ అంతే.. అలా చెప్పాలనే ఆలోచనేదైనా వుండేదా?”
“ఏమో!”
“నాతో అలా చెప్పించుకోవాలని నువ్వు అనుకునేదానివా?” అని అడిగాడు.
“నీ చేతి స్పర్శనే ఆ విషయం చెప్పేది” “అయినా ఎప్పుడైనా నిన్ను స్పృశించానా?”
“జంకుతూ జంకుతూ చేతిని స్పృశించేవాడివి. లేదంటే నీ శరీరం నాకు తాకేలా నిలబడేవాడివి” అంది.
“నీతి పేరుతో మీరు గిరి గీసుకున్నారు ఆ రోజుల్లో అని ఇప్పటివాళ్లు అంటున్నారు. బలమైన శారీరక వాంఛేదో కలిగితే బలవంతంగా నిగ్రహించు కున్నట్లు కూడా నాకు గుర్తు లేదు” అన్నాడు.
“ఎందుకా మాటలు? ఆ రోజుల్లో అట్లా ఆలోచించాల్సిన అవసం మేముంది? ఆ రోజుల్లో మనం రెక్కలున్న పక్షులం కాదా?" అంది. ఒక్క మాటలో ఎంత బాగా చెప్పింది అనుకున్నాడు. ఇప్పుడా రెక్కలు తడిసిపోయాయా? వాటంతటవే విరిగిపోయాయా? ఎవరైనా విరిచేశారా? చేజేతులా విరిచే కున్నామా? ఇవి జవాబు దొరికే ప్రశ్నలు కావనిపించింది వేణుకు.
“వెళ్దామా?” అని అడిగింది.
“తొందరేమిటి?” అని అడిగాడు.
“నువ్వు ఎదురుగా వుంటే ఇక్కడే వుండిపోతానేమో అని భయం” అని గట్టిగా నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. ఆమె లేచి చీర దులుపుకుంది. అతనూ లేచాడు. నడక సాగించారు.
పక్కప్రక్కనే నడుస్తున్నారు. ఎవరేం మాట్లాడలేదు. - ఆమె బస్సెక్కి వెళ్లిపోయింది. అతనలా ఆ బస్సువైపే చాలా సేపు చూసి తన గదికి వెళ్లిపోయాడు.
వెన్నెల మెట్లు దిగుతూ ఆమె ఎదురు పడింది. అతను దిక్కు తెలియక అక్కడ నిలబడిపోయాడు.
“నాతో రావా” అంది. అతను ఆలోచనలో పడ్డాడు. “ఏమిటా ఆలోచన?” అని అడిగి చేయి అందించింది. “నీ చేయి మైల పడుతుందేమో... ”
ఆమె మాట్లాడకుండా అలాగే నిలబడిపోయింది. చల్లని గాలికి ఆమె ముంగురులు ఆకాశంలో దోబూచులాడుతున్నాయి. ఆమె ధరించిన చీర మీద నక్షత్రాలు. ఆమె నుదుటి మీద చంద్రబింబం.ఆ చంద్రబింబం మీద ఎర్రెర్రని మరకలు.. కరిగిపోతూ చంద్రుడు... పాల వెన్నెల నురగలు కారుతాయేమోనని దోసిలి పటాడు. ఎర్రటి నెత్తురు ధారలు దోసిలిలో. ఉలిక్కిపడి లేచాడు వేణు. ఇక నిద్ర పట్టదు. బహుశా అతనికి నిద్ర పట్టదు.
ఇవి కూడా చదవండి