ప్రజా ప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: ప్రజా ప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులను త్వరగా విచారించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు గురువారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను కూడ సుప్రీంకోర్టు హైకోర్టులకు విడుదల చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన ప్రజా ప్రతినిధి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.కేసుల సత్వర పరిష్కారం కోసం వెబ్ సైట్ ను సిద్దం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.హైకోర్టు చీఫ్ జస్టిస్ ల నేతృత్వంలో వెబ్ సైట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. తీవ్రమైన నేరం విషయంలో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు సూచించింది.
ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విషయమై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈ విషయమై పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ ను సుప్రీంకోర్టు అభినందించింది. అయితే ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణలో జాప్యం చేయవద్దని హైకోర్టులకు ఉన్నత న్యాయస్థానం సూచించింది.
ఆర్టికల్ 227 ప్రకారం సబార్డినేట్ న్యాయవ్యవస్థపై పర్యవేక్షణ అధికారాన్ని హైకోర్టులకు అప్పగించారు. అటువంటి పద్దతులను రూపొందించడానికి లేదా కేసులను సమర్ధవంతంగా పర్యవేక్షించడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సముచితమని భావిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విషయంలో విచారణ, పర్యవేక్షణ కోసం సుప్రీంకోర్టు ఏడు అంశాలతో కూడిన మార్గదర్శకాలను రాష్ట్రాల హైకోర్టులకు జారీ చేసింది.
ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను విచారించేందుకు ఆయా రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ,చీఫ్ జస్టిస్ కేటాయించిన బెంచ్ విచారణ చేయవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ కేసులను తర్వగా విచారణ చేయడానికి అవసరమైన సూచనలను హైకోర్టులకు చేసింది సుప్రీంకోర్టు.
మరణశిక్ష, జీవితఖైదు విధించాల్సిన కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.ఆ తర్వాత ఐదేళ్ల కంటే ఎక్కువ శిక్షపడే కేసులకు ప్రాధాన్యతక్రమంలో తీసుకోవాలని సుప్రీంకోర్టు హైకోర్టులకు పంపిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇతర కేసులను ఆ తర్వాత విచారించాలని సుప్రీంకోర్టు కోరింది.ఈ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన కోర్టులకు సౌకర్యాలు కల్పించాలని కూడ సూచించింది.