ఆర్‌ఎస్‌ఎస్ నేతల ఫొటోలు ఉంచుకోవడం ఉగ్రవాద చర్య కాదు.. - మద్రాస్ హైకోర్టు

By Asianet News  |  First Published Oct 27, 2023, 1:30 PM IST

ఆర్ఎస్ఎస్ నాయకుల ఫొటోలు ఉంచుకోవడమే ఉగ్రవాద చర్య కాదని మద్రాస్ హైకోర్టు చెప్పింది. గతేడాది పీఎఫ్ఐకు చెందిన పలువురు సభ్యులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. అయితే తమకు బెయిల్ కావాలని కోరుతూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల ఫొటోలు ఉంచుకోవడం ఉగ్రవాద చర్య కాదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. యూఏపీఏ (UAPA) కేసులో ఎనిమిది మంది పీఎఫ్‌ఐ సభ్యులకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పీఎఫ్‌ఐ (నిషేధిత సంస్థ)కి చెందిన ఈ 8 మంది సభ్యులు దేశవ్యాప్తంగా తీవ్రవాద కుట్రకు పాల్పడ్డారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆరోపిస్తూ, వారిపై అభియోగాలు మోపింది. అయితే ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిందితులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 

‘బార్ అండ్ బెంచ్’ కథనం ప్రకారం.. ఈ పిటిషన్ పై జస్టిస్‌ ఎస్‌ఎస్‌ సుందర్‌, జస్టిస్‌ సుందర్‌ మోహన్‌లతో కూడిన డివిజన్‌ ​​బెంచ్‌ విచారణ చేపట్టింది. అప్పీలుదారులు ఉగ్రవాద చర్యలకు నిధులు సేకరించడంలో నిమగ్నమై ఉన్నారని ఎన్ఐఏ ఆరోపించిందని, అయితే వారికి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలతో నేరుగా సంబంధం ఉన్నట్లు రికార్డులో ఏమీ లేదని బెంచ్ పేర్కొంది. కాగా.. ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, ఇతర హిందూ సంస్థలకు చెందిన నాయకుల మార్క్ చేసిన ఫొటోలు, సహా పలు పత్రాలు లభించాయని, ఆ నేతలు హిట్‌లిస్ట్‌లో ఉన్నారని తేలిందని ఎన్‌ఐఏ కోర్టుకు తెలిపింది.

Possessing photos of RSS leaders not terrorist act: Madras High Court grants alleged PFI members bail in UAPA case

Read story here: https://t.co/M4LYsZaXLI pic.twitter.com/DcuhR7bfSL

— Bar & Bench (@barandbench)

Latest Videos

అయితే దీనికి కోర్టు స్పందిస్తూ.. “ఆర్‌ఎస్‌ఎస్ లేదా ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు. నాయకుల ఫొటోలు కూడా నిర్దిష్ట చిహ్నాలతో మార్కింగ్ చేయబడ్డాయి. అందులో గుర్తించిన వ్యక్తులను పీఎఫ్‌ఐ 'హిట్ లిస్ట్'లో ఉన్నట్లుగా మార్కింగ్ సూచిస్తోంది. ఓ వ్యక్తి స్పష్టమైన ఊహ ద్వారా దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. ప్రమాదం ఉందని నమ్మవచ్చు. అయితే కేవలం ఈ ఫొటోలను కలిగి ఉండటాన్ని ఉగ్రవాద చర్యగా పరిగణించలేము.’’ అని పేర్కొంది. 

విజన్ డాక్యుమెంట్ ఆధారంగా 2047 నాటికి భారత్ లో ఇస్లామిక్ ప్రభుత్వ స్థాపనకు కృషి చేయాలని పీఎఫ్ఐ లక్ష్యంగా పెట్టుకుందని ఎన్ఐఏ వాదించింది. అయితే దీనికి హైకోర్టు బదులిస్తూ.. పిటిషనర్ల కార్యకలాపాలను ఎన్ఐఏ కళ్లతో చూసినప్పుడు, వారి ప్రతి చర్య చట్టవిరుద్ధంగా అనిపించవచ్చునని పేర్కొంది. కానీ అది వాస్తవంగా అంగీకరించలేమని తెలిపింది.

అప్పీలుదారులను విజన్ డాక్యుమెంట్ కు అనుసంధానం చేసే మెటీరియల్ ఏదీ లేనందున, ప్రతి తీవ్రమైన ఆరోపణ ఊహాగానాల ఆధారంగా సంభావ్యతపై ఆధారపడి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. మరో మాటలో చెప్పాలంటే, ఏర్పడిన అభిప్రాయం ప్రత్యక్ష రుజువు, సాక్ష్యం లేదని తెలిపింది. అప్పీలుదారుల్లో కొందరు కత్తులు, కత్తులు ఉపయోగించి ఆయుధ శిక్షణ తీసుకున్నట్లు సాక్షుల వాంగ్మూలం మినహా, ఏదైనా ఉగ్రవాద చర్యలో లేదా ఏదైనా ఉగ్రవాద ముఠాలో సభ్యునిగా ప్రమేయం ఉన్నట్లు చూపించడానికి  ఇతర ఆధారాలు లేవని పేర్కొంది.

కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తో పాటు భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి పీఎఫ్ఐకి చెందిన పలువురు సభ్యులు కుట్ర పన్నుతున్నారని కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిందని ఎన్ఐఏ గత ఏడాది సెప్టెంబర్ లో పిటిషనర్లను అరెస్టు చేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రత్యేక కోర్టు పిటిషనర్లకు బెయిల్ నిరాకరించడంతో వారు అప్పీల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది టి.మోహన్, న్యాయవాదులు ఎ.రాజా మహ్మద్, ఐ.అబ్దుల్ బాసిత్ వాదనలు వినిపించారు. ఎన్ఐఏ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఏఆర్ఎల్ సుందరేశన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎన్ఐఏ కేసులు) ఆర్ కార్తికేయన్ వాదనలు వినిపించారు.
 

click me!