కాంగ్రెస్ పార్టీ, భారత్ జోడో యాత్రకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆ మైక్రో బ్లాగింగ్ సంస్థను బెంగళూరు కోర్టు ఆదేశించింది. భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్ 2 సినిమా పాటలను ఉపయోగించారని కేసు నమోదైంది. దీని విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
కాంగ్రెస్ పార్టీ, భారత్ జోడో యాత్రల ట్విట్టర్ అకౌంట్లను తక్షణమే తాత్కాలికంగా బ్లాక్ చేయాలని బెంగళూరులోని కోర్టు ట్విట్టర్‌ను ఆదేశించింది. ఆ పార్టీ అధినాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర సందర్భంగా కేజీఎఫ్-2 సినిమాలోని పాటలను ప్లే చేసినందుకు ఓ సంగీత సంస్థ కాంగ్రెస్‌పై కాపీరైట్ కేసు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
గత నెలలో కర్ణాటక అంతటా కొనసాగిన భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్ -2 సినిమాకు సంబంధించిన పాటలను ఉపయోగించారని ఆరోపిస్తూ ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ నిర్వాహకుడు ఎం నవీన్ కుమార్ యశ్వంత్‌పుర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో గత శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో రాహుల్ గాంధీతో పాటు జైరాం రమేశ్, సుప్రియాలపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి.. 25 మందికి గాయాలు
జైరాం రమేశ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో భారత్ జోడో యాత్రకు సంబంధించిన రెండు వీడియోలో తమ పాటను పోస్టు చేశారని ఆ ఫిర్యాదులో నవీన్ కుమార్ పేర్కొన్నారు. ఈ వీడియోల్లో తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కేజీఎఫ్ 2 సినిమా పాపులర్ సాంగ్స్ ను వినయోగించారని తెలిపారు. తనకు చెందిన మ్యూజిక్ కంపెనీలో ఈ పాపులర్ పాటల రికార్డింగ్ జరిగిందని, ఈ పాటలపై పూర్తి హక్కులు తమకే ఉంటాయని ఫిర్యాదులో ఆయన పేర్కొన్ారు. ఈ పాటలు కేజీఎఫ్ చాప్టర్ 2 హిందీ వెర్షన్‌కు సంబంధించిన పాటలు అని చెప్పారు. తమ కంపెనీకి చెందిన మ్యూజిక్‌ను కావాలనే కుట్రపూరితంగా దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో నవీన్ కుమార్ తెలిపారు.
కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ హక్కులను పొందడానికి కంపెనీ.. మూవీ మేకర్స్ కు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించిందని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ తన రాజకీయ ఎజెండా, మార్కెటింగ్ ప్రయోజనాల కోసం ఎలాంటి లైసెన్స్ లేకుండా భారత్ జోడో యాత్ర ప్రచారంలో సౌండ్‌ట్రాక్‌ను ఉపయోగించిందని తెలిపారు. యాత్ర ప్రచారంలో భాగంగా తమ సినిమాలోని ‘సముందర్ మే లెహర్’ని వాడుకున్నారని చెప్పారు.
ఈ ఫిర్యాదుపై రాహుల్ గాంధీ, ఎంపీ జైరాం రమేశ్, కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫాం చైర్‌పర్సన్ సుప్రియా శ్రీనెట్‌లపై ఐపీసీ సెక్షన్‌లు 403 (నిజాయితీ లేని ఆస్థి దుర్వినియోగం), 465 (ఫోర్జరీ), 120 బీ (నేరపూరిత కుట్ర), ఏ కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాపీరైట్ చట్టం, 1957లోని సెక్షన్ 63 కింద కేసు నమోదు అయ్యింది.
కాగా.. కోర్టు తీర్పుపై కాంగ్రెస్ స్పందించింది. కోర్టు కార్యకలాపాల విషయం తమకు తెలియదని , ఆర్డర్ కాపీ తమ వద్ద లేదని ఆ పార్టీ ట్వీట్ చేసింది. ‘‘ఐఎన్ సీ బీజేవై ఎస్ఎం హ్యాండిల్స్‌కు వ్యతిరేకంగా బెంగుళూరు కోర్టు నుంచి ప్రతికూల ఆర్డర్ వచ్చిందని మేము సోషల్ మీడియాలో చదివాము. కానీ ఈ విషయం మాకు నేరుగా తెలియరాలేదు. మాకు ఆర్డర్ కాపీ రాలేదు. మేము దీనిని చట్టపరంగా పరిష్కరించుకుంటాం ’’ అని పేర్కొంది.
We have read on social media about an adverse order from a Bengaluru court against INC & BJY SM handles.
We were neither made aware of nor present at court proceedings. No copy of the order has been received.
We are pursuing all the legal remedies at our disposal.
ఏమిటీ కాపీ రైట్.. ?
కాపీ రైట్ అంటే మేథో సంపత్తికి యజమానికి అందే చట్టపరమైన హక్కు. ఎవరైనా కొత్తగా ఏదైనా తయారు చేసినప్పుడు, వారికి దానిపై పూర్తి హక్కులు ఉంటాయి. ఈ హక్కు పుస్తకాలు, సినిమాలు, పాటలు, నాటకాలు, ట్రేడ్ మార్కులు మొదలైన వాటికి వర్తిస్తుంది. పుస్తకాల రచనలను పరిశీలిస్తే.. ఒక రచయితకు అతడి పుస్తకంపై జీవిత కాలం, అలాగే అతడు మరణించిన 50 శాతం వరకు కాపీరైట్స్ ఉంటాయి. అలా వివిధ ఉత్పత్తులకు వివిధ రకాలుగా కాపీ రైట్స్ ఉంటాయి. కాపీరైట్ చట్టం 1957లో రచయితల రచనలను రక్షించడానికి రూపొందించారు.
కాపీరైట్ చట్టం 1957 సెక్షన్ 63 ప్రకారం..ఎవరైనా కాపీరైట్స్ ఉల్లంఘనలకు పాల్పడితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుండి రూ. 3 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాగే కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిన నిందితుడి మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ను ఎలాంటి వారెంటూ లేకుండా పోలీసులు స్వాధీనం చేసుకోవచ్చు.