పార్లమెంటు సమావేశాల్లో భద్రతా వైఫల్య ఘటనకు సంబంధించి విపక్ష ఎంపీలు తీవ్ర నిరసనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ ఘటనపై ప్రకటన చేయాలని పట్టుబడుతున్నాయి. దీంతో ఉభయ సభల నుంచి పెద్ద మొత్తంలో ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. లోక్ సభ నుంచి 33 మంది ప్రతిపక్ష ఎంపీలు, రాజ్యసభ నుంచి 45 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.
పార్లమెంటులో భద్రతా వైఫల్య ఘటనపై ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. భద్రతా వైఫల్య ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు, పోడియం వద్దకు వెళ్లి నిరసనలు చేయడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ వారిపై చర్యలు తీసుకున్నారు. లోక్ సభ నుంచి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు చెందిన సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా 33 మందిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో 30 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా.. మరో ముగ్గురు ఎంపీలను ప్రివిలేజ్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. ఇది వరకే లోక్ సభలో 13 మందిపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు లోక్ సభలో సస్పెన్షన్ వేటుకు గురైన ఎంపీల సంఖ్య 46కు చేరింది.
ఇదే తీరు రాజ్యసభలోనూ కనిపించింది. రాజ్యసభలోనూ విపక్ష ఎంపీలు నిరనలకు దిగారు. వారిపైనా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ యాక్షన్ తీసుకున్నారు. 45 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇందులో కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలపైనా ధన్‌ఖడ్ వేటు వేశారు. అయితే... ఇందులో 34 మదిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. మరో 11 మంది ఎంపీలను మాత్రం ప్రివిలేజెస్ కమిటీ నివేదిక అందే వరకు సస్పెండ్ చేశారు. ఆ నివేదిక తర్వాత వారిపై చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ నిర్ణయం తీసుకుంటారు.
undefined
Also Read: Congress: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ.. పీఏసీ మీటింగ్‌లో సంచలన తీర్మానం
ఇది వరకే టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్ ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రాజ్యసభలోనూ మొత్తంగా 46 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఉభయ సభల్లో కలిపి మొత్తంగా 92 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడటం గమనార్హం.