జయలక్ష్మి నాగరాజ్ కవిత్వ సంపుటి తొలి సంతకంపై వినాయకం ప్రకాష్ రివ్యూ రాశారు. తెలుగు సాహిత్యంలోని కవిత్వంలో ఆమె కవిత్వం ఎలా ప్రత్యేకమైందో ఆయన వివరించారు.
అక్షరాలు కూడా మాట్లాడుతాయి , మన మనసుకి హాయినిస్తాయి, ఆవేదన నిండిన మనస్సుకు స్వాంతన ఇస్తాయి, కష్టాల మేఘాలు కమ్ముకున్నప్పుడు దైర్యంగా నడవడానికి చేయూతనిస్తాయి.. ఇలా ఉత్తమ కవి అక్షరాలు ప్రతీ కోణంలో పాఠకుని హృదయాన్ని చేరివివిధ భావాలు ప్రకటిస్తాయి..కానీ ఇలా సంపూర్ణ కవిత్వం చాలా అరుదు గా మనం చూడగలము కానీ మొదటి ప్రయత్నం లొనే *శ్రీమతి బుర్ర విజయలక్ష్మి నాగరాజు గారు* తన *తొలిసంతకం* కవితా సంపుటి ద్వారా విభిన్నమైన రీతిలో తన భావాలు అందముగా కవిత్వీకరించి శెభాష్ అనిపించుకున్నారు .
తన విజయాల సారధి గా భర్త నాగరాజు గారిని ఆరాధిస్తూ రాసిన కవిత *నా విజయసారధి* ఇందులో
మసకబారి పోయిన కోరికలు
తీతువు పిట్టలై రొద పెడుతుంటే
అణచబడిన ఆశయాలు గాల్లో దీపాలై మిణుకుమంటుంటే
బంధమూ బాధ్యతా తానై తన భర్త ఓదార్పు హస్తమై జీవము పోశారని భర్త పై తనకున్న మమకారాన్ని వివరించారు. పుస్తకం చివరిలో
"రెప్పలు తెరచిన గడియ నుంచి
రెప్పలు మూసి
చుక్కల తీరంలో చేరే లిప్తపాటులో
ఈ తోలుతిత్తి చేసే బ్రతుకు చిత్రాలు
బహు చిత్రమైనవే కదా!!!..అనే అద్భుతమైన పదాల ప్రవాహంతో రాసిన జీవిత సత్యపు కవిత *ఎంతటి విచిత్రమో కదా* కవిత పాఠకునికి చక్కటి అనుభూతి ఇస్తుంది.
ప్రతీ కవిత దేనికదే ప్రత్యేకంగా ఉంది కన్నప్రేమ, నేనింతే, ఎక్కడున్నావు?, తప్పెవరిది, అతడు, గాంధీ బొమ్మ సాక్షి గా..నేల రాలిన సింధూరం..ఇలా ఎన్నో కవితలు చాలా చక్కగా ఉన్నాయి, కవితలు ఆవిష్కరించిన విధానం ఆదర్శంగా ఉంది, ముఖ్యంగా కవితలలో అక్షరాల మధ్య అల్లిక, సమన్వయం, భావవ్యక్తీకరణ, ప్రారంభము ముగింపు మొదలైన విషయాలు అన్ని పుస్తకం అంచనాలు పెంచాయి.
Also Read: ఎన్ గోపి వృద్ధోపనిషత్ అందరి హృద్యోపనిషత్
నేడు ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీలను ఎండగడుతూ "కాలే కడుపులకు , మండే గుండెలకు సబ్సిడీలు కావాలి కానీ అవి కారాదు ఉన్నవాడికి అజీర్ణపు తేన్పులు" అంటూ తన కవిత *సబ్సిడీలు* ద్వారా చక్కగా సూటిగా ప్రభుత్వాలకు చురకలు అంటించారు.
నేడు ఆడపిల్లలపై అరాచకాలను తన కవిత *జాగ్రత్త సుమా!* ద్వారా ఖండిస్తూ
"తప్పు చేసిన వాడి తల
నడి బజారులో తెగ నరకకుండా
ఇంకా ఎన్నాళ్లీ ఉపేక్ష
నాకెందుకు లే అని ఎవరో వస్తారు అని
ఎన్నాళ్ళు నిద్ర నటిస్తావ్ "అంటూ .. వ్యవస్థను ,సమాజాన్ని ప్రశించారు కవయిత్రి దీని ద్వారా ఆమె లోని సామాజిక కోణం మనం అర్థము చేసుకోవచ్చు.
"ఎండిన ఎదపై
తొలకరి తుంపరల బహుమతి
పుడమికి పచ్చల పతకమై మెరిసే గరిక పూల హారతి " అంటూ రాసిన *తొలకరి బహుమతి* కవిత గమ్మత్తుగా ఉంది.
ఉన్నది ఒకటే జిందగీ అనే సందేశము ఇస్తూ మాటల తూట్లు వద్దు అని కవయిత్రి పేర్చిన అక్షరాల మాల బాగుంది.
స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలు గుర్తుకు తెస్తూ *నిజమైన స్వాతంత్ర్య దినోత్సవం* అనే కవిత ద్వారా నేడు ఓట్ల కొనుగోలు, మత కులాల కంపు , సమాజంలో స్వార్థం పెరిగింది అంటూ వందేమాతరం నేడు వరుస మారి వందే...మాతరం, మాతరం అంటూ స్వార్థపు రాగాలు వస్తున్నాయి అన్నారు ..
Also Read: చైతన్య స్ఫూర్తి కెరటాలు ఈ రాలిన చుక్కలు
భద్రతా నియమాలను పాటించాలని , మద్యం, వేగం, నిర్లక్ష్యం, ఫోన్ వాడుతూ వాహనాలు నడపడానికి ప్రయత్నం చేయద్దు అని ఇంట్లో కుటుంబం ఉందని గుర్తింపు చేసుకోవాల్సిన అవసరాన్ని "భద్రత నియమాలు భవితకు సోఫానాలు "కవిత ద్వారా వివరించారు.
*తొలి సంతకం* లోని కవితలు అన్నీ చాలా చక్కగా ఉన్నవి మళ్ళి మళ్ళీ చదివింపజేస్తాయి.. పుస్తకం లో ప్రతీ కవిత ఒక సరికొత్త సందేశాన్ని ఇస్తుంది.
- వినాయకం ప్రకాష్