ఎన్ గోపి వృద్ధోపనిషత్ అందరి హృద్యోపనిషత్

ఆచార్య ఎన్ గోపిగారి ఈ“వృద్ధోపనిషత్” oldage poems చదివే ప్రతి ఒక్కరూ  innerfeelings లో మునకలు వేసితీరుతారు. అవసరం కూడా. అందరూ చదవాల్సిన కవిత్వమిది. 

Telugu Literature: Niharini on Dr N Gopi poetry

 Old is Gold అంటారెందుకని? పాతవి అంతటి విలువైనవని . విలువల వలువలు పూర్తిగా ఒలిచేస్తున్న  ఈ విశృంఖల అత్యాధునిక జీవితాలను చూసి, కలతచెంది కలమెత్తారు ఆచార్య N. గోపిగారు. వారి కలం అనుభవాల నుండి , “వృద్ధాప్యం చాలా విలువైనదని నా ఉద్దేశ్యం . ఇది జీవన సారాంశదశ. దీనిలో పరిణతప్రజ్ఞ,దిషణాపటుత్వం ,బౌద్ధిక శక్తి కలగలిసి  వుంటాయి” అంటూ వచ్చిన  అద్భుత మైన నిర్వచనమిది. ఎంతమందిని చూసి ఉంటారు ,ఎన్ని హృదాయావేదనలను వినిఉంటారు ! అందులోంచి వచ్చిన ప్రౌఢమైన భాష , ప్రౌఢమైన భావం ఇది. ఈ కవితా సంపుటి లోని ఒక్కో రసగుళిక ఒక్కో ఆలోచనతో మదిని కలత పెట్టించేలా ఉన్న కవిత్వమిది. అసాంఘిక శక్తుల కుయుక్తులను , అమాయకుల ఈతిబాధలను కని కవితలుగా కన్నీరు గార్చిన కవి కలం ఇప్పుడు “వృద్ధోపనిషత్” గా వృద్ధుల పక్షాన గళమెత్తింది. 

వ్యక్తి , సంఘజీవి కదా ! సామాజికునిగా ఈ సమాజంలో ఎదుగుతున్నాడు ! మరి భవిత దిగ్దర్శనం చేసుకోలేకనా ఇంత నిర్లక్ష్యంగా , ఇంత అమానవీయంగా ప్రవర్తిసూ ముసలివాళ్ల ను ఇబ్బందులకు గురిచేసేది ? కాదు! కాదు! అన్నీ తెలుసు . అంతా తెలుసు. అయినా వర్తమానం పై అమితమైన ఇష్టం, ఆశ. వీటి పరిధిలోంచి బయటికి రాక, ఆ పరిధిలోనికి మరెవ్వరినీ రానీయక కుంచించుకు పోయే మనస్తత్వాలవ్వి, బుద్ధులవ్వి. యవ్వనోద్రేకపు రోజుల మనిషి కాదు , ఆగక దొర్లే కాలం వయసును తన వెంట తీసుకుపోతుందని మరుస్తాడు . “కేవలః కేవలం “ ప్రస్తుతానికి మురుస్తుంటాడు. వృద్ధుల విషయం పై దృష్టి పెట్టడు. రేపు తనకూ వస్తుందని తెలిసీ , ముదిమితో ప్రకృతిసిద్ధంగా వచ్చే శారీరక ఇబ్బందులతో బాధపడుతుంటే విసుగును ప్రదర్శిస్తారు . ముసలివాళ్ల ఈ మనసుకష్టాల్ని అద్దంలో చూపినట్టు వ్రాశారు డా।। గోపి గారు. పుస్తకం వట్టుకుంటే ఆసాంతం చదివిస్తుంది , చదివాక గగుర్పాటును కలిగిస్తుంది , ఆలోచనల్లో పడేస్తుంది. 
    “వృద్ధుడంటే / ముసలివాడనికాదు/
వృద్ధిపొందినవాడని “ అని ప్రారంభ కవిత తోనే ఆలోచనల ప్రాకారంలోకి తీసుకెళ్తారు. 
 “ మసకబారిన మన వెలుగులో
  కొత్తప్రదేశాలు మొలుస్తాయేమో చూద్దాం” అంటూ పెద్దవాళ్ళ గురించి తెలుసుకునే పెద్దదర్వాజ గడపదాటేందుకు ఉత్సాహపరుస్తారు. 
‘ సీనియర్ సిటిజన్స్’ కవితలో 
“ ఎఫ్.డీ. ల కోసం / కిటికీకి చూపులు బిగించి/ పడిపోకుండా నిల్చంటారు”
అంటూ పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో పడిగాపులు పడే జీవుల్ని మన కళ్ళ ముందట్లా పడేస్తారు, మన లోలోని కిటికీలకు చూపులుబిగిస్తూ! “అయ్యో ! మనసులోకి చేదవేసి లాగుతున్న గతాగతాలు” అనీ అంటూ ఓ దృశ్యాన్నట్లా పడేస్తారు. లుప్తమైపోతున్న మానవత పైనే కవి గురి అంతా! 
  ‘ మూడు ప్రపంచాలు’ అనే కవితలో బాల్య యౌవనవృద్ధాప్యాల కథనం చేస్తారు. “ ఒక బంగారు వన్నె” గా మెరుస్తుందని బాల్యాన్ని , “ కలల్లోకి వచ్చే కన్నె “ గా యవ్వనాన్ని , “ చల్లారిన పాల గిన్నె” గా వృద్ధాప్యాన్ని వర్ణిస్తారు . మన దృష్టి అంతా ముసలితనం పైనే కదా! కాస్త

క్కువసేపు కాచితే అడుగంటి పోవడం , మంట ఎక్కువ పెడితే పొంగి పోవడం ,కొద్దిగంత మజ్జిగ చుక్క వేస్తే పెరుగయిపోవడమనే పాల గుణాన్ని వృద్ధాప్యానికి ఆపాదించారు. పెరుగు చేసేందుకు జాగ్రత్తగా పాలను కాచాలి, ఆ పెరుగ్ మళ్ళీ కొత్త పెరుగు కావడానికి ‘తోడు’ అవుతుంది కడుపు వేడిమినీ చల్లారుస్తుంది . అందుకే గోపిగారు “అనుభవాల తేజస్సు “ అని ఈ కవితను ముగించారు. 

జ్ఞాపకాలను సుదూర  మేఘాలతో పోలుస్తూ, ‘వృద్ధాప్య ప్రవేశం ‘ అనే కవిత లో “ దొంగలాగా చొరబడుతుంది” అంటారు. తమ ఇంట్లోకి దొంగ రావాలనో , తమ ఒంట్లోకి ముసలితనం రావాలని ఎవరూ కోరుకోరు. అయినా వృద్ధాప్య ప్రవేశం అట్లా అయిపోతుంది. అప్పుడు నడక , చూపు, ఉచ్ఛారణ వంటివన్నీ క్రమంగా సన్నగిల్లి పోతాయి . కానీ తప్పదు. అందుకే “దీనితో పేచీ పడద్దు” అంటారు కవి.
       “దిగంతరేఖ
         కొంత మసకబారుతుంది
         సంవత్సరాలు 
          ఆకుల్లా రాలిపోతుంటాయి.
           మిత్రులు చనిపోతూ
స్మృతి నక్షత్రాలౌతారు” - అంటారు . ఇదీ! గోపీగారి కవిత్వమంటే ! ఎంతో దృశ్యాదృశ్య అనుభవం తో రాసిన పంక్తులివ్వి! భావపరంపరలతో కలుపబడిన హృదయ చమరింతలివ్వి! ఇంతబాగా గోపీగారే రాయగలరు అనిపించేంతగా ఉన్న పంక్తులివ్వి! వయస్సు షష్ఠ్యబ్ధి గీత దాటి, కలంశక్తి అర్ధశతాబ్దపు మెట్లనెక్కి , పరిశీలనతతో పరిపక్వతతో
కనిపించే కవిత్వమిది. “ మనుగడకూ , మరణానికీ మధ్య / స్పష్టమైన గీతలు చెరిగి పోతాయి “ అని చెప్తూనే , అస్పష్టతను వీడాలి అనే ఒక ‘కాషన్’ నూ ఇస్తారు గోపిగారు. 
   ‘ ఒంటరితనం’ అనే కవితలో “ ఆకు లను లెక్కిస్తూ లెక్క తప్పటం/ ..... ఇవాళ టివన్నీ నిన్నలో కనపడకపోవటం ...../ చనిపోయిన సహచరి ఫోటోలోంచి జాలిగా పలకరించటం....” ఇవన్నీ చెప్తూ   ఒంటరితనం వృద్ధాప్యానికి పూచే పిచ్చిపవ్వు” అంటారు. ఒక సన్నటి నీటి తెర పాఠకుల కళ్ళను కప్పేస్తుంది తప్పక! 

 “ అరె బాబూ! / చెంబులో నీళ్ళు అయిపోయినై/ కొంచెం నింపి పోరా” అంటూ ప్రారంభించిన ఈ కవితలో నీళ్ళు కావాలని కొడుకునూ, కోడలిన , మనుమడినీ, పనివాడినీ అడుగుతుంది ఒక వృద్ధాప్యం.” కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలుతుంది “ అంటూ ముసలితనం మాట వినని పరిస్థితులను చెప్తూ హృదయ శూన్యాన్ని ఆవిష్కరిస్తారు. చివరకిచ్చే ముక్తాయింపు కోసం పాఠకులు ఆతురత చెందుతారు. జీవన నాటకం చివరి అంకం దృశ్యమిది. “ఎవరునింపారోగాని, అతని కళ్ళనిండ నీళ్ళు” అంటూ మనోవేదిక తెరను దింపుతారు గోపిగారు. గుండె ప్రాంగణమంతాభయంకరమైన స్థబ్దతతో బరువెక్కపోతుంది . ఇదీ కవిత్వం అంటే! బాధించాలి, బోధించాలి, భయపెట్టాలి, భద్రతనివ్వాలి. మనుషుల డొల్లతనాన్ని బయటపెట్టాలి. ఇట్లా గోపిగారి కవిత్వం చేస్తుంది. 

కన్నతల్లి అవడం యాదృచ్ఛికమే అయినా, ఐచ్చిక మే అయినా, ముసలి తల్లి గా అయ్యాక పరిస్థితులేంటో అందరికీ తెలుస్తుంది. “ అమ్మ ఒక మనిషి ‘ కవితలో , “నిన్ను కనడం యాక్సిడెంటే కావచ్చు / తార్కికంగా నీ ప్రమేయం అసలే లేకపోవచ్చు “ అంటూ కాసేపు సంతానం ప్రక్కన నిలబడుతారు కవిగా! అయిన
చిన్నప్పుడు అమ్మనాది అమ్మనాది అని కొట్లాడుకున్న పిల్ల లు వాళ్ళే పెద్దయ్యాక అమ్మనీది అమ్మనీది అనీ పంచుకుంటారు. అమ్మ ముసలిదయ్యాక విసుగుతో నువ్వు చేసిన తప్పులను ఎప్పుడైనా నెమరువేసుకుంటేచాలు. 

“రేపటి అపరాధ భావం 
  నిన్ను మెలిపెడుతుంటే మాత్రం 
  ఓదార్చడానికి  ఆమె ఉండదు” అంటూ హెచ్చరిస్తారు. తర్కవితర్కాల మర్మాన్ని ఒక జాగ్రత్తలో పడేస్తారు. ఏమో రేపు నీకు ఇదే గతి పట్టవచ్చన్న నిజాన్ని , అదే అబద్ధంగా చేసి చూపించరు. అసహ్యభావాల, కసిరింతల , చీదరింపుల నుండి నిన్ను పక్కకు లాగి , మరో దృశ్యాన్ని చూపబోయేముందు ‘ అమ్మ ఒక మనిషి’  అని గుర్తుంచుకుంటే చాలని ఉద్భోధిస్తారు . ‘ ఆమె కూడా ‘ అను శీర్షికతో రాసిన కవితలో 
   

“ నేను ఈ మధ్యనే
    కాస్తసిగ్గుపడటం నేర్చుకుంటున్నాను.
   ఆమెకు సాయం చెయ్యాలని
    సంకల్పించుకుంటున్నాను. 
    సాయమంటే మరేమోకాదు 
     నా పనులు నేను చేసుకుంటున్నాను
     నాకు సమస్యలుగాన కనిపించేవి 
      ఆమెకు చీపురుపుల్లలు “ 
ఇంతగా తేటతెల్లం చేస్తూ, ఇంతగా సూటిగా కవితాత్మకంగా చెప్పిన కవులు లేరేమో అనడం అతిశయోక్తి కాదేమో!

అనాదిగా పనుల విభజనలలోని తేడాలన్నీ పాఠకుల ఊహల్లోకి వచ్చేలా , కొత్తసూచనలూ , ప్రతిపాదనలూ చేశారు.
‘ వృద్ధాశ్రమం ‘ కవితలో 
       “వృద్ధాశ్రమం లో 
    మంచాలు పాతవే ,వచ్చిపొయ్యేవాళ్ళే
మారుతుంటారు” అంటారు. ఒళ్ళు జలదరిస్తుంది. నేడు సమాజంలోవృద్ధాశ్రమాలు పెరగడం  ఒక దుష్పరిణామం.కానీ.... కానీ...... కానీ..... ఈ’కానీ’ అనేది ఎప్పటికీ తెగని విధంగా ! ఆగని విధంగా ఉంటుంది . ఔను! వాటివల్ల అనాధ లే కాదు అందరున్నవారూ వారివారి చివరి రోజుల్లో మాటలతో చంపబడకుండా , మరణించేవరకూ బ్రతుకీడుస్తూ మనగలుగుతున్నారు, ఈ ఆశ్రమాల వల్ల! ఇది నగ్నసత్యం !! 

‘హాస్పిటల్ లో కవిత్వముండదు’ అనే కవితలో గోపిగారు, “ ముదిమి ఒక పగడాల దీవి” , “ ఊపిరిముందు సుడిగాలంత” అని అనడంలో అంతర్భావం ఎంతో గొప్పగా ఉన్నది. అద్భుతమైన పద చిత్రిక పట్టారు. ‘నిర్భయగీతి’ కవితలో చావును మిత్రుని గా చెప్తారు. మనసున్న మనుషుల మానసిక మూలుగులను మైకుల్లో చెప్తారు. బాహాటంగా వినిపిస్తారు. “ నా స్వప్నాలింకా తడిసినట్టు లేదు....... “ , “ఓ  మిత్రమా కాస్త ఓపిక పట్టు” అని మన అందరి తరఫున మృత్యువుతో వాదోపవాదాలు చేస్తూ ,  ఫ్రెండ్ రిక్వస్ట్ నూ పంపిస్తారు. 
 పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. కానీ, మహానుభావుల మరణం సమాజానికి తీరని లోటు అవుతుంది. ‘మరణం లేని మరణం’ కవితలో “ భూగోళం అతని  వెనుక పరిభ్రమిస్తూ వీడ్కోలు సన్నాహాలు చేస్తున్నది” అని అనిర్వచనీయ అనుభూతిలో పడేస్తారు. ‘ముసలమ్మ’ కవితలో “సూర్యణ్ణి లేపుతుంది.........” , అతని కిరణాలను పేనుతుంది....”అంటారు. శ్రామికుల జీవితాలు ప్రతిబింబించవు గానీ ,”రాజకీయపోస్టర్లు”అంటించడాన్ని వ్యంగ్యంగా చెప్తూనే , “ఇప్పుడు ఆమె వాటిపై పిడకలు కొడ్తుంది” అంటూ పల్లెటూర్ల దృశ్యాలు కళ్ళముందుకు తెస్తారు. ఇందులో ముసలివాళ్ల బాధలేగాదు, మునిమనుమలతో మాడ్రన్ తాతల, మామ్మల ముచ్చట్లూ కవిత్వీకరించారు. 

ఏ అవస్థ లేకుండా మరణించడం వృద్ధులకు ఒక వరం. వరం అనేది కవి ఎట్లా చెబుతారో చూద్దాం- “మార్నింగ్ వాక్ కు తీసుకెళ్లే  మిత్రునిలా రావాలి” అని మరణాన్ని ఉపమానిస్తారు . “లోకంలోని దుఃఖమంతా శిఖరాలను చుట్టుకున్నట్టు పొగమంచు -“ అంటూ రూపనిరూపణదృశ్య చిత్రాలతో మనిషి బ్రతుకును సరితూచారు. Morning mist is beautiful like beautiful thoughts అంటాము. విశ్వాసంతో నిలిచే ఆలోచనలు strong mountains అయితే కొండల్లో ప్రవహించే సెలయేర్లూ కూడా ఇటువంటి ప్రతీకలు అవుతాయి. ఇది కవి రచనలో “మార్మిక లోకపు ప్రతిధ్వనులుగా పంచేంద్రియాల్లోకి ప్రవహిస్తాయి” అంటారు. ఈ విధమైన ఆధ్యాత్మిక భావాల్ని  అంతఃకరణ  శుద్ధితో పాఠకులు గ్రహించేలా అనంతమైన భావ సముచ్ఛయాలను ఈ కవితాసంపుటి లో కుప్పబోశారు గోపిగారు.  

“ శోభిత కోటీరాలు, అనుభూతుల క్షణికలు, శుభ్ర సుందర వాటికలు, వైశ్విక పుష్పాలు, రసరమ్య పేటికలు, అనురాగరాగిణి, జిగీష ప్రబలింత, చిత్తవైకల్యం, అద్భుత కాలచరాలు, సంచిత ఐతిహాసిక ప్రకాశం, ప్రాచీన కృతి, పురోవాటిక, సూక్తిముక్తావళి” వంటి పదగుంపనలతో ఉన్నదీ సంపుటి. ఈ మాటలమూటలు , ఈ పద ప్రయోగాలు భాషాభిమానులకు షడ్రసోపేతం . ఆచార్య ఎన్ గోపిగారి ఈ“వృద్ధోపనిషత్” oldage poems చదివే ప్రతి ఒక్కరూ  innerfeelings లో మునకలు వేసితీరుతారు. అవసరం కూడా. అందరూ చదవాల్సిన కవిత్వమిది. 

_- డా।। కొండపల్లి నీహారిణి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios