కాసుల రవి కుమార్ కవిత్వం ముగింపు లేని వాక్యంపై బండారి రాజ్ కుమార్ సమీక్ష రాశారు. కాసుల రవికుమార్ తెలుగులో విరివిగా కవిత్వం రాస్తున్నారు.
సందమామను సూసుకుంట అమ్మ పోసే అట్టు లెక్క వుందే అనుకుంట ఆవురావురని కండ్లతోటే మింగి కడుపుసల్ల జేసుకున్న పసితనం మాది.రోజంతా పనిచేసిన అయ్య రాతిరికిన్ని నూకలు తెచ్చిత్తనే సాపమీద బొర్రకుంట పండుకునే బాల్యం మాది.బీడీలకు మూతులొత్తందే దారికర్సులకు ఎల్లని రోజుల్ల ..కాళ్లుసాపుకుంటానికే జాగలేని ఇంట్ల ముగ్గురుపిల్లల్ని సవురిచ్చిన అమ్మ పాయిరం జూడాలె.తోడబుట్టకపోయినా అన్నదమ్ముల్లెక్కనే పెరిగినోల్లం కదా..ఎన్కమర్ల ఏం లేకపోయినా సదువునుజూశే ముర్శినోల్లం కదా..సదువుకున్నోడెవడు బాగుపడ్డర్రా..అని ఎవలన్నంటె మేం ఇద్దరమే ముందున్నోల్లం..ఏమీలేనితనాన్ని జూశి పరాశికాలాడినోల్లందర్నీ ముక్కుమీద ఏలేసుకునేలా జేశిన గడుసుపోరగాల్లం కదా..మాక్కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ.
గిప్పుడు మా రవన్న "ముగింపులేని వాక్యం"లా మీ ముందు కవిత్వమై పారుతున్నడు.తమ్మున్ని కదా..తేటగున్న నీళ్లను దోసిట్లదీసుకుని మొఖమ్మీద గుప్పిచ్చి సల్లుకుంట.దమ్మార గట్టగట్ట కడుపునిండ తాగుత.గాతలేశిన పెయిమీద సంబురంగ నాల్గుశెంబులు పోసుకుంట
కవి కావడం ఏముంది?కవిగా బత్కాలనుకోవడంలోనే మిగిలిన జీవితముంది.రవిగా పుట్టినోడు కవిగా బతికిన క్షణాల్ని తల్సుకుంటాండంటెనే నరనరాన జీర్ణించుకుపోతున్న కవితత్వమేదో ఒంటబడుతున్నట్టనిపిస్తుంది.అత్యంత ఆత్మీయమైన సాయితగాళ్ళమైనందుకు కట్టెపుల్లనిర్శినంత కటువుగానో..పుల్లతేనెను నాల్కెమీద అద్దినంత తియ్యగానో .. ఎట్లజెప్పినా స్వీకరించే గొప్పమనసున్నోడు గనుకనే భుజంతట్టో..మొట్టికాయలేశో..కావలిచ్చుకునో..కడుపులబెట్టుకునో ఓ నాలుగు ముచ్చట్లైతే పంచుకుంట.నెనరులేని వాక్యానికి కొనసాగింపు వుండదని మందలిస్తూ "ముగింపు లేని వాక్యం " ఎక్కడెక్కడ మెరిశిందో సూద్దం.
ముగింపులేని వాక్యమై పారుతున్న ఏటినీళ్లల్ల గులకరాళ్లలా పర్సుకున్న 48 కవితల దొంతర పారదర్శకంగా కనిపించడం సూడొచ్చు.ఇప్పుడిప్పుడే పారుతున్న నీటిలోని గులకరాళ్లు.. కొన్ని నున్నగ ,ఇంకొన్ని గరుగ్గా ఒకటో రెండో జిగేల్ మని మెరుస్తూ వుండడం సహజమే.నీటితాకిడికి ఎంత ఒరుసుకుపోతే అంత అందంగా కనబడే గులకరాయి "గచ్చకాయ"అయి మన సేతుల్ల అపురూపంగ నాట్యమాడినట్టు అనిపించడం ఒక అద్భుతమైన అనుభూతి.
"బతుకుదెరువు కోసం
గుండెకాయలాంటి పల్లెతల్లిని వదిలి పదేళ్లు
ప్రాణమిత్రుడి బిడ్డ పుట్టినరోజంటే పోయిన!
ఒక్కొక్కల్ని పట్టి పట్టి చూసి
శిథిలమైన నా ఆనవాళ్లను పునర్నిర్మించుకుంటున్నా..
అంతలోనే ఓ ముసలవ్వ అడిగింది
బిడ్డా..నువ్వు?
పక్కనున్న విజయత్తమ్మ గుర్తుపట్టి చెప్పింది
మన సరళక్క కొడుకు అని"
(సరళక్క కొడుకు, పుట:49)
తనుపలవరించని ఏ వాక్యాన్ని కవిత్వం చేయాలనుకోలేదు.చానా ఏండ్లకు ఆత్మీయుల్ని కలిసినపుడు ఒక్కలన్న గుర్తుపట్టి ఫలానా..అన్నప్పుడు "బాల్యం ఒక్కసారి గిర్రున తిరిగి కండ్లముందుకుదెచ్చి కూసోబెడుతది.'పట్టి పట్టి చూడడం','శిథిలమైన ఆనవాళ్లను పునర్నిర్మించుకోవడం'తో ఆ సందర్భాన్ని ఊహించుకోవచ్చు.(ఐతే ఒక్క ముచ్చట పాఠకుల కోసం...ఈ కవితలో "విజయత్తమ్మ" మా అమ్మ.సరళక్క కొడుకే కాసుల రవికుమార్ )
"సక్కగ సదివే పిల్లకు
పద్నాలుగేండ్లకే పెళ్లి చేసిండ్లు
చిన్న వయసులో ముగ్గురు పిల్లలు
బీడీలు సుట్టి బిడ్డల్ని సదివించింది
ఆ అవ్వ చెప్పుకుంటపోతనే ఉన్నది!
సరళక్క కొడుకు...
నా ఆలోచనలు అక్కన్నే ఆగినయి"
చిన్నప్పుడే పెండ్లిచేయడం,పిల్లలు ,కుటుంబ భారం,బతుకుదెరువుకు ఏదోపని చేయడం అప్పటి సామాజిక స్థితిగతుల్ని వాచ్యమై చెప్పిన తీరు కనిపిత్తది.
"ఇంతలోనే పక్కింటి శారద పిన్ని..
ఇంకా గుర్తుపట్టనట్టున్నది
బిడ్దా..నువ్వు? అన్నది
ఇన్ని రోజులు నేను ఇదనీ,అదనీ,ఏదోనని చెప్పేటోన్ని
ఇదంతా మా అమ్మ కాలి పాదాలకున్న
ధూళితో సమానమని అనుచంటూనే..
గర్వంగా చెప్పిన.."సరళక్క కొడుకునని!"
ఇదీ ముగింపు.ఒక్కపాలి కవిత మొత్తాన్ని పరిశీలిస్తే చాలా సాధారణంగా,తేలికగా,సులువుగా అనిపించే వాక్యాల వెనుక మోయలేనంత బరువు,చెప్పలేనంత ప్రేమ,నేనెవర్ని?,నా మూలాలేంటి? ఇంత సదువు..నౌకరీ..సౌకర్యవంతమైన జీవితం.. ఎవలు పెట్టిన బిక్ష? ఒక అంతర్మథనం.సరళక్క కొడుకునని గర్వంగా చెప్పుకున్నప్పుడే రవి..కవి అయిండు.మనకున్న అహం ఎక్కడ బద్ధలైతదో..అప్పుడే మనుషులమైతం.ఆ మనిషి మాత్రమే నిజమైన 'కవి' కాగల అర్హత సంపాదిత్తడు.
Also Read: ఖుల్లం ఖుల్లా"గా కవిత్వమవడం అతని నైజం...
"సరళక్క కొడుకు" కవితలో ఎత్తుగడ,కొనసాగింపు,ముగింపు గమనిస్తే కవిగా ప్రాథమికదశలో తన్నుకులాడుకుంటున్న రవికుమార్ కథనాత్మకశైలిలో..సంభాషణల్ని చెప్పుకుంటూ..కవిత నడిపిన తీరు చూస్తే ముచ్చటేత్తది.కథలో పాత్రలు మాట్లాడుతయి.అప్పుడప్పుడూ రచయిత కథలో లీనమై గతాన్ని నెమరువేసుకుంటడు.కథలోని ఏదో ఒక పాత్ర గతం నుంచి వర్తమానానికి బదిలీజేత్తది.చివరికి రచయితే ఒక ముగింపునిత్తడు.'నేను'తో మొదలై 'నేను'తో ముగిసిపోయే కథలా వాస్తవాన్ని కవిత్వం చేయాలనుకున్న క్రమంలో బతుకునంతా వొంపి ,ఒక జీవిత సత్యమేదో తెలుసుకున్నట్టు ఆధ్యంతం ఆకట్టుకుంటది.
కవి నిరంకుశుడు.కాదనలేం.ఈ నడ్మ ఒకరిద్దరి కవిత్వం సదివినప్పుడు..సిన్నప్పుడు "సీత..గీత..పీత..రోత.."అని రాసుకున్న ప్రాస పదాలే నయమనిపించింది.ఒక దశల కవుల మీద ..కవిత్వం మీద రోత పుట్టేలా చేసింది.తీవ్రమైన ఆలోచనల్లో పడేసి కంటి మీద కునుకు లేకుండ చేసింది.కవి కావాలనుకునే బలమైన కోరిక వల్ల..కవి అనే ట్యాగ్ తగిలించుకోవడం కోసమో..ఏది రాసినా కవిత్వమౌతుందనే పిచ్చి భ్రమలో బతికే హైటెక్ కవుల మీద ఒక జాలి చూపు విసిరి..మనమూ పిచ్చివాళ్లలా నవ్వుకోవడం తప్పిచ్చి చేసేదేమీ లేదు.
ప్రతికవికీ కవిత్వమంటే ఇదీ..అని రాసుకున్న మేనిఫెస్టో ఒకటి తప్పకుండ వుంటది.అక్కడ కవి లోచూపు ఆవిష్కృతమైతది.తన నాడీ పట్టుకుని చూసె అవకాశం దొరుకుతది.కొత్తగా రాస్తున్న కవి కవితావస్తువుల్ని ఎక్కన్నుంచి ఏరుకుంటడు?ఎట్ల తోడుకుంటడు?కవి ఎవల పక్షం? కవిత్వమంటే..తనకు తాను ఇచ్చుకుంటున్న నిర్వచనం ఏంటి? ఇవన్నీ ఇండ్ల దొరుకుతయి.
"కవిత్వమంటే
ఒక వ్యాపకమో
ఒక పుస్తకమో లేక
ఒక అవార్డో కాదు
అది ఒక యజ్ఞం
ఒక వ్యక్తి పడే వేదన!
కవిత్వమంటే
నచ్చిన నాయకుణ్ణి మెచ్చుకునుడో
డబ్బు సంపాదనో లేక
పది మంది పొగుడుడో కాదు
అది ఒక జ్వాల
రాసే వ్యక్తిని నిత్యం దహించివేస్తుంది
నాయకుల కళ్ళు తెరిపించమని
ప్రజల పక్షాన ప్రశ్నించమని!
కవిత్వమనేది
నిత్య పరిశ్రమ
నిలదీసే ఒక గొంతు!
చైతన్యం కోసం
స్వచ్ఛందంగా పనిచేసే
శ్రామికుడే కవి!"
(కవిత్వమంటే..,పుట:70)
ఈడ దొరికిండు కవి.కవిత్వమంటె యజ్ఞమని..జ్వాల అని..నిత్యపరిశ్రమ అని..నిలదీసే గొంతు అని..వ్యక్తి పడే వేదన ఆవేదన అని..చెప్పుకున్నడు కవి.ఇదంతా కాసుల రవికుమార్ దృష్టికోణం."చైతన్యం కోసం స్వచ్ఛందంగా పనిచేసే శ్రామికుడే కవి"అని నిర్ధారించిండు.ఇప్పుడు ఇక్కడ కొద్దిగాగి మాట్లాడుకుందం.ఇనెటోడైతే ఎన్నైనా జెప్తం.ఇననోనికి ఏంజెప్తం?చెప్తే విననోన్ని చెడంగ జూడాలె"అంటం.ఇప్పుడిప్పుడే కవిత్వం రాస్తున్నవాళ్లను ,అపురూపంగా అడుగులేస్తున్న వాళ్లను పట్టుకుని ఏకిపారేయాలని అనుకుంటమా..బలపం పట్టుకుని పలకమీద అక్షరాల్ని దిద్దుకుంటున్న వాన్ని "మహాకావ్యం"కాదిదని విమర్శించగలమా?
రవన్న పుస్తకమైతే ఏశిండుగదా..గిప్పుడన్ని లొసుగులు..అన్ని రాజకీయాలు తెల్సుకుంటడు.ఏది ఏందని పసిగడుతడు.తననుతాను పుటంబెట్టుకుని అక్కెరకొచ్చే పనిముట్టయితడు."సాధనమున పనులు సమకూరు ధరలోన"అన్నట్టు సాధన చేస్తే కవిత్వం చిక్కబడుతది.దానికి కావాల్సిన ముడిసరుకు ఎట్లాగు వుంది కాబట్టి ఇగురంగ మెసిలితె ఇత్తునానికి తడితాకిచ్చినట్టె.మొలకొత్తది..మొక్కైతది..చెట్టైతది.ఇత్తునం నాసిరకమైతే ఎంత తడిపినా పుచ్చిబుర్రలైతయి.కవిత్వం నిరంతర ప్రక్రియ.అధ్యయనం చేస్తూ వుండడమే ఇత్తునానికి తడితగలడమంటే!
Also Read: శ్రీరామోజు హరగోపాల్ కవిత: సంజీవి..
మూడేండ్ల కిందట్నే "కొత్త సూర్యుడు ఉదయించాడు"పేరుతో ఫేసుబుక్ "కవిసంగమం"లో ప్రత్యక్షమైనప్పటికీ "అమ్మో కవిసమ్మేళనం"కవితతో వెలుగులోకి వచ్చిండు మన కాసుల రవికుమార్ . ఈ కవిత సదివి భుజాలు తడుముకున్న చాలామంది కవిమిత్రుల్ని దగ్గరినుంచి సూశిన అనుభవముంది.అందులో సీనియర్ కవులుండటం నేను గమనించిన.నాకు దెల్శి కొంతమంది పక్కతడుపుకున్నోల్లు సుత వున్నరు.అబ్బా..గిదేదో గట్టిగింజే..అనిపించింది కొందరికి.ఆ ఊపులో రాసిన కవిత్వమంతా ఇందులో లేనప్పటికీ,ఉంటే ఇంకొంచెం బాగుండేదని మాత్రం అనిపించింది.ఓ పాలి కవిసమ్మేళనంకెళ్లి సూశొద్దమా..అమ్మో అనిపించక మానదు.ఇంకెవలన్న వావ్వో..వాయ్యో..అన్నా అంటరు.(అందుకే పూర్తి కవిత మీకోసం...ఇంకేమీ మాట్లాడలేక)
"కొన్ని కవి సమ్మేళనాలకు పోతె అనిపిస్తది
ఓ నలుగురు మనుషుల ఫోటోలు
తెల్లారి పేపర్ల పడడానికి
నలభై మందిని జోకర్లను చేసుడే
కవి సమ్మేళనమని!
వక్తకు పది నిమిషాలంటే
కొంతమంది గంటకు తగ్గరు
వచ్చిన కవులేమో నిమిషంల
కవిత చదువాలె
చిత్రం గాకపోతె..!
సమావేశ అధ్యక్షుడుంటడు
అవసరమున్నా లేకున్నా తాపకు పది నిమిషాలు మాట్లాడుతడు
ఓ మంచి కవిత సగం చదువంగనే
మైకుల టప్ టప్ మని సప్పుడు చేస్తడు
చేతిలున్న మైక్ తోటి తలకాయ మీద
ఒక్కటి కొట్టబుద్దైతది!
కవి సమ్మేళనంల పాల్గొందమని
ఓ కవి మిత్రుడు వంద కిలోమీటర్ల దూరం నుండి
రెండు వందల రూపాయలు బస్ చార్జీ పెట్టుకొని వస్తే
రెండు నిమిషాలు కేటాయించకపోతిరి
మళ్ళ కనపడ్తె ఒట్టు!
మొన్నటికి మొన్న ఓ మిత్రుడు
'వానజల్లు' అనే కవిత చదువడానికి వచ్చిండు
అతని కవితాక్షరాల జల్లులు కురవడం పూర్తవకముందే
పిడుగులు పడ్డట్టు చేసిండ్లు
కరెంట్ షాక్ కొట్టినట్టయ్యిండా కవి!
కొన్ని చోట్ల శతకవి సమ్మేళనం
ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది
సర్టిఫికేట్ కోసం ఒకాయన సంకలసందుల నుంచి పోతడు
శాలువాల కోసం కుస్తీలు
షీల్డుల కోసం టగ్ ఆఫ్ వార్ లు...హవ్వ!
ఇండ్ల మహా మొండి కవులుంటరు
రిపీట్ చెయ్యొద్దని చెప్పినా
మూడు నాలుగు పేజీల కవిత చదువొద్దని చెప్పినా
అంశానికి సంబంధించినవి మాత్రమే చదువాలని చెప్పినా
వాళ్ళు వినరు వాళ్ళది వాళ్ళే
హాలంతా గోల గోల
వారి గోల వారిదే!
గామధ్య బృ'హట్' కవి సమ్మేళనం జరిగింది
చిన్నహాళ్ల నూటయాభై మంది కవులను
లోపలికిపంపి తలుపులు పెట్టిళ్ళు
ఇగ సూడు గోస
అటు గుంజుకునుడు, ఇటు గుంజుకునుడు
పద్మవ్యూహంల చిక్కుకున్న అభిమన్యుడి లెక్కైంది నా బతుకు...
చివరికి మైక్ దొరకబట్టుకొని
నా పేరు ర...
అనంగనే శాలువ కప్పిండ్లు
నా కవితా శీర్షిక క...
అనంగనే షీల్డు చేతిల పెట్టిండ్లు
ఒక్క నెట్టుడు నెడితే
ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం గేటుకాడ పడ్డ!
కవి సమ్మేళనం ఎట్ల జరిగిందని
ఇంటికొచ్చినంక మా ఆవిడ అడిగింది
మీసం తిప్పుతూ
ఒకింత గర్వంతో చెప్పిన
'కవి గౌరవం' దక్కిందని!"
రాస్తూ..రాస్తూ ఎప్పుడో ఒకప్పుడు సొంతశైలిని అలవర్సుకుంటడు ఏ కవైనా..! రవికుమార్ విషయానికొత్తే ఆంగ్ల సాహిత్యం ...వ్యక్తిత్వ వికాస పుస్తకాలు విరివిగా సదివిన..సదువుతున్న అనుభవముంది.ఇప్పుడది కవిత్వం రాస్తున్న సమయంలో అప్పుడప్పుడూ పనికొత్తాంది.తీసుకునే వస్తువు మారుతాంది. "పెద్దనోట్లరద్దు",మన జీవితాల్లో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు.ఇప్పటికీ దాని ప్రభావం కనబడుతనే వుంది.ఏ.టి.యం పేరుతో మంచి కవిత రాసిండు.హాస్యం..వ్యంగ్యం కలగలిపి మాంఛి రసవత్తరమైన కవిత్వాన్ని రంగరించిండు.ఈ కవితను సదివినప్పుడు అన్న కవిత్వం కంటే కథ బాగా రక్తికట్టించగలడనిపించింది.పాఠకుల్ని ఇన్వాల్వ్ చేయడం అందరికీ సాధ్యం కాని పని.
"కొత్త సినిమా రిలీజైనట్టున్నరు జనాలు" అన్నది మొదటి వాక్యం.ఏ.టి.యం ల కాడ పరిస్థితిని చెప్పడానికి వాడినట్టనిపించింది.
1) ఏ.టి.యం ల దగ్గర చలివేంద్రాలు
అందుబాటులో అంబులెన్సులు ఉంచాలంది ఓ మేడం
చెమటలు తుడుచుకుంటూ
2)చాప చెద్దరి తెచ్చుకున్న బాగుండు
ఓ ముసలాయన పశ్చాత్తాపం
3)ఇంతకుముందు ఓట్లు వేసేటప్పుడే నిలబడేది
ఇప్పుడు ఓట్లు వేసినంక కూడా నిలబడాల్సి వస్తోంది
అదీ మన అభివృద్ధి..వాపోయాడు ఒకాయన.
4)ఏసీ పనిచేయకపోయేసరికి మంటమీదున్నడు ఓసారు
చలికాలంల సక్కగ పనిచేస్తయి
ఎండాకాలంలోనే ఏం రోగమో వీటికి..అసహనంతో అన్నడు
క్యూలో నిల్సున్న వ్యక్తుల అవస్థలు పై వాక్యాల్లో మనల్ని మరింత దగ్గరజేత్తయి.మనల్ని మనకు అద్దంల సూపెడుతయి.
"టక్ టక్ టక్
కిర్ కిర్ కిర్
పట్ పట్ పట్ మని సప్పుడవుకుంట
మెల్లగ డబ్బులొత్తాంటే
కామన్వెల్త్ గేమ్సుల గోల్డ్ మెడల్ కొట్టినట్టు
వెలిగిపోతానయి ముఖాలు"
అందరికీ సుపరిచితమైన ధ్వనులు.వాటిని కవిత్వం చేస్తున్నప్పుడు పాఠకులు పొందే అనుభూతి అంతా ఇంతా కాదు.మరి కవి వంతు వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లుంటదో పాపం ..అనిపించేలా ముగింపునివ్వడం వాస్తవాన్ని కండ్లముందు ఆవిష్కరించుకున్నట్లే వుంది.అయితే మనమే క్యులో నిలబడ్డట్టు..మనమే అన్ని అవస్థలు పడ్డట్టు..ఒక బాధగాదు అనిపించేలా ఆ నొప్పిని పాఠకుడు అనుభవించేలా చేయడం ఈకవితలోని గొప్పతనం.
"ఫషో టైంకు నిలబడితే
సెకండ్ షో టైం అయింది నావంతు వచ్చేసరికి"
ఎత్తుగడకు న్యాయం చేసిన కవితా వాక్యాలివి.అనవసరంగ వాడినట్టు ఏ వాక్యమూ అనిపించదు.
"కార్డు పెడుతాంటె క్లాప్స్ కొట్టి కంగ్రాట్స్ చెప్పిండ్లు
పిన్ కొడుతాంటె ఏదో సాధిస్తున్నానన్న ఫీలింగ్
ఎమౌంట్ కొట్టంగనే ఎవరెస్ట్ ఎక్కినంత సంబురం
పద్మశ్రీ తీసుకునే రేంజ్ ల పైసలచ్చేకాడ చేతులు పెట్టిన
కండ్లలో ఓ మెరుపు..ఆనందం!
కిర్ర్ ..ర్ర్ ..ర్ర్ ..!
'సారీ,క్యాష్ ఇజ్ నాట్ అవైలబుల్
ప్లీజ్ ట్రై ఎట్ నియర్ బై ఏటీఎం!' "
నాకైతే ఎక్కన్నో కాలిందిబూతులొత్తానై.మనవరకు రావంగనే అప్పుడే అయిపోతే ..ప్రతీ సందర్భంలోనూ రచ్చ రచ్చే.దబ్బిడి దిబ్బిడే.ఒక్కోసారి ఎక్కడలేని బి.పి వత్తది.మనిషైతే సప్ప సప్ప నాల్గందుకుందును.నాకైతే ఇట్నే అనిపిత్తది.మీకెట్లుంటదో పాపం.
ఇందులో ఇంకా చాలా కవితలున్నయి ప్రస్తావించడానికి..కానీ నా ఉత్సాహాన్ని కాసేపు ఉగ్గబట్టుకుని..ఇంకొన్ని ముచ్చట్లుజెప్పి ముగిత్త.
మొత్తం కవితల్ని పరిశీలిస్తే విభిన్నమైన వస్తువులు,దేనికదే రూపొందించుకున్న శిల్పం,నిర్మాణం కనపడ్తయి.కవికున్న అత్యుత్సాహం వల్ల రాసిన ప్రతీదీ పుస్తకంలో వుండాలనుకోవడంవల్లనేమో ఒక్కోపారి పూర్తిపరిణతి చెందని కవితలు కవిని డామినేట్ చేసి,ప్రేమతోనో,బెదిరించో పుస్తకంలో కొచ్చి అచ్చులో మురిసి తమ ప్రతాపాన్ని పాఠకులపై చూపెడుతయి.దీనికి ఏ కవీ అతీతుడైతే కాదు.పంటికింద రాయిలా తాకే కొన్ని కవితల్ని నిర్ధాక్షిణ్యంగా..నిర్మోహమాటంగా తీసేస్తే మంచిది.ఇంకొంతకాలం మనసుగుమ్మిలో మాగబెడ్తే మంచింది.నెలతక్కువ పిల్లలని ఎద్ధేవా చెసే అవకాశం ఇంకెవలకూఇవ్వకుంటే మంచింది.సిన్నప్పుడు నా డెక్కన్లన్నీ రవన్న దొబ్బిండనే కోపంతోనో..కసితోనో చెప్తున్న మాటలైతే కావివి.చిన్నపిల్లగాండ్లు లొల్లిబెట్టుకుని మన పోరడు పక్కింటిపోరన్ని రాయిబెట్టికొడితే తల్కాయపల్గిందనుకో..పక్కింటోడచ్చి మనపోరన్ని కొట్టకముందే..తిట్టకముందే..మనమే ఓ నాల్గు సప్పరిత్తె మంచిదిగదా..గందుకే!
కొస్సకు ఓ మాట..
"రవిగా బతికిన ఈజీవితంలో
కవిగా బతికిన రోజులే అద్భుతం"అని చెప్పుకున్న కవికి పునాది గట్టిగుండాలె గదా..కవిగా బతికిన రోజులన్నీ అద్భుతంగా వుండాలంటే కొంత సద్విమర్శను సహృదయంతో స్వీకరించాల్సిందే..తప్పదు.ఇంకొక మాట..నాయకత్వ లక్షణాలు పుష్కలంగా వున్న ఈకవి కవిత్వ రాజకీయాల్లో గ్రూపులుకట్టే..ముఠాలుగట్టే కుకవుల పక్షాన నిలబడకుండా పైలంగ వుండుకుంట తననుతాను ముగింపులేని వాక్యంలా కొనసాగించుకునేలా తీర్చిదిద్దుకుంటాడని ఆశిస్తూ..పాయిరంగ ఈ నాల్గు అచ్చింతలు.
- బండారి రాజ్ కుమార్