మార్చిలో మొబైల్ ఫోన్లకు రానున్న కష్టాలు...ఇదీ కరోనా వైరస్ ప్రభావమేన?

By Sandra Ashok Kumar  |  First Published Feb 12, 2020, 12:18 PM IST

కరోనా వైరస్ ప్రభావంతో మొబైల్‌ ఫోన్ల పరిశ్రమ విలవిల్లాడుతున్నది. భారతదేశంలో తయారు చేసే స్మార్ట్ ఫోన్లన్నీ చైనాలో తయారయ్యే విడి భాగాలపైనే ఆధారపడి ఉన్నాయి. వచ్చేనెలలో దేశీయంగా ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. 


న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమను కరోనా వైరస్‌ భయాలు వెంటాడుతున్నాయి. చైనాలో విజృంభిస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి దెబ్బకు ఆ దేశంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు మూతబడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్పాదక రంగం స్తంభించిపోయింది. 

కరోనా వైరస్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాల సరఫరాను ప్రభావితం చేస్తున్నది. దీంతో మూతబడ్డ ఫ్యాక్టరీలు ఎప్పుడు తెరుచుకుంటాయా? సరఫరా ఎప్పుడు మెరుగవుతుందా?.. అని భారతీయ స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీ ఎదురుచూస్తున్నది. 

Latest Videos

‘పరిశ్రమపై కరోనా ప్రభావం కనిపిస్తున్నది. కొన్ని ఉత్పత్తులు, మోడళ్లపై కరోనా దెబ్బ స్పష్టంగా కనిపిస్తున్నది’ అని భారతీయ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రు తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, చైనా నుంచే స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాలు అత్యధికంగా భారతీయ మార్కెట్‌కు వస్తాయని, దీంతో కరోనా ప్రభావం తప్పక ఉంటుందని చెప్పారు.

also read ఒకటికన్నా ఎక్కువ పాన్​కార్డులు ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలీ...లేదంటే..?

భారతీయ మొబైల్‌ మార్కెట్‌లో చైనా సంస్థలదే ఆధిపత్యం. షియోమీ, ఒప్పో, వివో, రియల్‌మీ, పోకో ఇలా ప్రస్తుతం మార్కెట్‌లో అత్యధిక అమ్మకాలను సాధిస్తున్న సంస్థలన్నీ చైనావే. 

చైనా స్మార్ట్ ఫోన్ల ధాటికి శామ్‌సంగ్‌, సోనీ, ఎల్‌జీ, నోకియా ఇలాంటి ప్రధాన సంస్థలెన్నో వెనుకబడ్డాయి. తక్కువ ధరతోపాటు ఎక్కువ ఫీచర్లు ఈ రెండే చైనా స్మార్ట్ ఫోన్ల తయారీసంస్థల మంత్రం. అందుకే కొనుగోలుదారులు చైనా ఫోన్లకు ఇట్టే ఆకర్షితులవుతున్నారు.

అయితే కరోనా దెబ్బకు చైనా పరిశ్రమలు కుప్పకూలాయి. దీంతో అక్కడి తయారీ దాదాపు నిలిచిపోయింది. ఫలితంగా భారతీయ మార్కెట్‌లోకీ కొత్త స్మార్ట్‌ఫోన్ల రాక తగ్గిపోయింది. ఇప్పుడు ఉన్న మోడల్ ఫోన్ల తయారీ కూడా గగనమైపోతున్నదని నిపుణులు అంటున్నారు. 

మరోవైపు తాజా పరిస్థితులపై, ముఖ్యంగా సరఫరాపై షియోమీ, ఒప్పో, వివో, రియల్‌మీ, పోకోలను ప్రశ్నించగా.. సమాధానం రాలేదు. కాగా, చైనా స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాల తయారీ దిగ్గజ సంస్థ ఒకటి తమ ప్లాంట్లలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కొంతమందితోనే పాక్షికంగా ఈ తయారీ మొదలైందని సమాచారం.

ఈ నెల 24 నుంచి 27 వరకు బార్సిలోనాలో జరుగనున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (ఎండబ్ల్యూసీ)కూ కరోనా దెబ్బ తగులనున్నది. ఎరిక్సన్‌, అమెజాన్‌, సోనీ, ఇంటెల్‌, వివో తదితర సంస్థలు ఎండబ్ల్యూసీ నుంచి తప్పుకున్నాయి.

నిజానికి ఏటా ఈ సమావేశాలకు లక్షకుపైగానే ప్రతినిధులు ప్రపంచ దేశాల నుంచి హాజరవుతారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. చైనాలో కరోనా వైరస్‌ వల్ల ఇప్పటిదాకా 1,016 మంది చనిపోగా, మరో 42,638 మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. విదేశాల్లోనూ ఈ వైరస్‌ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

మరో వారం గడిస్తేగాని మొబైల్‌ పరిశ్రమపై కరోనా వైరస్‌ చూపే ప్రభావం ఎంతో తెలుస్తుంది. దేశీయంగా సెల్ ఫోన్లు అసెంబ్లింగ్‌ చేస్తున్నప్పటికీ విడిభాగాలపై మాత్రం అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. 

బిగ్‌"సి’ వ్యవస్థాపక చైర్మన్‌ బాలు చౌదరీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఇలాగే కొనసాగితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ కొరత 20 శాతం నుంచి 30 శాతం వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. చైనాలో సెలవుల నేపథ్యంలో అడ్వాన్స్‌గా పరికరాలను తయారు చేయడం వల్ల ఇప్పటి వరకైతే కొరత లేదు’ అని తెలిపారు. 

also read  సుందర్ పిచాయ్ కి వరుస షాక్​లు... గూగుల్​కు ఏమైంది?

‘మొబైల్‌ తయారీలో కీలక విడిభాగాలైన ఎల్‌సీడీ డిస్‌ప్లే, ప్యానెళ్లు, స్పీకరుల, ఫింగర్‌ప్రింట్‌లు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో వీటిలో ఏ ఒక్కటి లేకపోయిన మొబైల్‌ తయారుకాదు. దీంతో చేసేదేమి లేకపోవడంతో దేశీయ తయారీ సంస్థలు తమ ప్లాంట్లను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని సెల్‌కాన్‌ సీఎండీ వై గురు తెలిపారు.

’శామ్‌సంగ్‌కు పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ, ఇతర సంస్థలైన ఒప్పో, వివో, వన్‌ప్లస్‌, షియోమీ మాత్రం తీవ్ర ఇబ్బందులెదుర్కొవాల్సి ఉంటుంది’ అని సెల్‌కాన్‌ సీఎండీ వై గురు తెలిపారు.

హ్యపీ మొబైల్‌  సీఎండీ క్రుష్ణ పవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మొబైళ్లకు కొరత లేకున్నా వచ్చే నెలలో మాత్రం కొరత అధికంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ నెల చివరి వరకు స్టాక్‌ ఉండటం సానుకూల అంశం’ అని అన్నారు.

‘కరోనా వైరస్‌ బట్టబయలైన చైనా పారిశ్రామిక క్లస్టర్‌లోనే మొబైల్‌ ఎల్‌సీడీ విడిభాగాలు తయారుకావడం ఈ ప్రభావం ఎలా ఉంటుందో ముందే చెప్పడం కష్టం. ఈ వైరస్‌ దెబ్బతో మొబైళ్లకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది తప్పా ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు’ హ్యపీ మొబైల్‌  సీఎండీ కృష్ణ పవన్‌ చెప్పారు.

click me!