ఈ వారంలోనే ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీం..?! 3 లక్షల కోట్ల రుణాలు..

By Sandra Ashok Kumar  |  First Published May 18, 2020, 12:14 PM IST

దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల రుణ పరపతి స్కీం ఈ వారంలోనే ప్రారంభం కానున్నది. ప్రభుత్వ అనుమతి రాగానే బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేయనున్నాయి. 


న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు రుణ పరపతి త్వరలోనే ప్రారంభం కానున్నది. కరోనా సంక్షోభంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి కేంద్రం ప్రకటించిన భారీ ఆర్థిక ఉద్దీపనలో భాగంగా రూ.20 లక్షల కోట్ల పథకంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల రుణ హామీ పథకం వచ్చే వారంలోనే ఆచరణీయం అయ్యే ఆస్కారం ఉంది. 

కొవిడ్‌-19 ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ఎంఎస్ఎంఈలకు 9.25 శాతం వడ్డీ రేటుకే రూ.3 లక్షల కోట్ల విలువ గల హామీరహిత రుణాలు బ్యాంకులు అందించనున్నట్టు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ రుణాల కాలపరిమితి 4 సంవత్సరాలు ఉంటుంది. 

Latest Videos

undefined

ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన రుణం అసలు చెల్లింపుపై 12 నెలల మారటోరియం వర్తిస్తుంది. ఈ స్కీమ్‌ కింద రుణం పొందేందుకు తుది గడువు అక్టోబరు 31గా ప్రకటించారు. ప్రస్తుతం ఎంఎస్ఎంఈ రుణాలపై 9.5 శాతం వడ్డీ రేటు అమలులో ఉంది. అలాగే ఎన్బీఎఫ్సీలు అందించే రుణాలకు మాత్రం వడ్డీరేటు 14 శాతం ఉంటుందన్నారు.

also read రిలయన్స్‌ జియో మరో సెన్సేషన్: 20 శాతం వాటాల విక్రయం...

ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వచ్చే వారంలో బ్యాంకులు ఈ స్కీమ్‌ ప్రారంభించవచ్చంటున్నారు. ప్రామాణికమైన ఖాతాల ప్రకారం రూ.100 కోట్ల టర్నోవర్‌, రూ.25 కోట్ల రుణభారం ఉన్న కంపెనీలకు ఈ రాయితీ రుణం పొందే అర్హత ఉంటుంది. 

దేశంలో మొత్తం 45 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. జీడీపీలో 28 శాతం, ఎగుమతుల్లో 40 శాతం పైబడి వాటా ఎంఎస్ఎంఈలదే. అవి 11 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 

వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నవి ఎంఎస్ఎంఈలే. తాజాగా ప్రకటించిన ఉద్దీపన కింద రుణం పొందేందుకు అవి ఎలాంటి సొంత హామీ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆ రుణాలకు కేంద్ర ప్రభుత్వమే హామీగా నిలుస్తుందని  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం కంపెనీల చట్టంలో మార్పులు తీసుకొస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కార్పొరేట్‌ రంగంలో డిజిటలైజేషన్‌కు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు తెలిపారు. బోర్డు మీటింగ్‌లను వర్చువల్‌గా నిర్వహించుకోవచ్చని తెలిపారు. 

click me!