చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తీరనున్న కష్టాలు... రెపో రేటుకే ఆర్‌బీఐ రుణాలు..

By Sandra Ashok Kumar  |  First Published Apr 20, 2020, 12:44 PM IST

ఆర్బీఐ తాజాగా ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై పారిశ్రామిక వర్గాల నుంచి ప్రశంసలు వెలువడుతున్నాయి. మరిన్ని రుణాలు పొందేందుకు వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా ఆర్బీఐ ప్రకటించిన రూ.లక్ష కోట్ల ప్యాకేజీలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు లబ్ధి పొందుతాయని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.
 


ముంబై: చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఈ)కు కష్టాలు తీరనున్నాయి. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటించిన రెండో విడత నిర్దేశిత దీర్ఘకాలిక రెపో ఆపరేషన్‌ (టీఎల్‌టీఆర్‌ఓ) దేశంలోని ఎంఎస్‌ఈలకు కలిసి రానున్నది. 

టీఎల్టీఆర్ఓ కింద ఆర్బీఐ బ్యాంకులకు రూ.50వేల కోట్లు సమకూరుస్తుంది. మరో రూ.50 వేల కోట్లు నాబార్డు, సిడ్బీ, ఎన్‌హెచ్‌బీ వంటి రీ ఫైనాన్స్‌ సంస్థలకు సమకూరుస్తుంది. ఈ రుణాల కాలపరిమితి మూడేళ్లు. రెపో రేటుకే ఆర్‌బీఐ ఈ రుణాలు అందిస్తుంది. 

Latest Videos

బ్యాంకులకు అందే రూ.50వేల కోట్ల టీఎల్‌టీఆర్‌ఓ నిధుల్లో కనీసం సగం నిధులను పెద్దగా పరపతి రేటింగ్‌ లేని ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్‌ఐ), గృహ ఫైనాన్స్‌ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సీ) రుణ పత్రాల్లో బ్యాంకులు మదుపు చేయాలి. లేకపోతే ఆర్బీఐ మిగిలిన నిధులపై రివర్స్‌ రెపో రేటు కంటే రెండు శాతం అధిక వడ్డీ రేటు వసూలు చేస్తుంది.

2018 సెప్టెంబర్ నెలలో ఐఎల్ఎఫ్ఎస్ సంస్థలో భారీ అవకతవకలు బయటపడిన తర్వాత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ద్రవ్య లభ్యత తగ్గిపోయింది. తాజా ఆర్బీఐ ఉద్దీపన చర్యలతో ఎన్బీఎఫ్సీ సంస్థలకు ఊరట లభించనున్నది. 

ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి ప్రభుత్వం నగదు లభ్యతకు చర్యలు చేపట్టినందు వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరనున్నది. అందుకే తాజాగా ఆర్బీఐ రూ.లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించడానికి మొగ్గు చూపినట్లు సమాచారం. 

also read సినిమాలు, షికార్లకంటే..ఆరోగ్యం, నిత్యావసరాలకే వారి ఎక్కువ ప్రాధాన్యతా...తాజా సర్వే వెల్లడి..

కాగా, ఫిబ్రవరి 6, మార్చి 27న ప్రకటించిన ఉద్దీపనలతో పోలిస్తే, తాజా ఉద్దీపన ప్యాకేజీ ఎన్బీఎఫ్సీలకు, ఎంఎఫ్ఐలకు లబ్ధి చేకూరుతుందని పలు ఆర్థిక సంస్థలు తెలిపాయి. ఆర్బీఐ తాజా ఆర్థిక ప్యాకేజీని తాము స్వాగతిస్తున్నట్లు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, ఎంఫిన్, ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ తదితర సంస్థలు పేర్కొన్నాయి.

ఎన్బీఎఫ్సీల విషయంలో ఆర్‌బీఐ ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందా? లేదా? అనే దానిపై మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ అనుమానం వ్యక్తం చేసింది. బ్యాంకుల నుంచి అందే ఈ నిధులను ఎన్బీఎఫ్సీలు.. ఎంఎస్ఈలకు రుణాలుగా ఇచ్చేందుకు బదులు తమ ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ఉపయోగించే అవకాశమే ఎక్కువని తెలిపింది.

అయితే, రుణ వసూళ్లలో మూడు నెలల మారటోరియం పాటించాలన్న ఆర్బీఐ ఆదేశాలు బ్యాంకుల లాభాలకు రూ.35,000 కోట్ల మేర గండి కొట్టే అవకాశం ఉందని అంచనా. ఇలా మారటోరియం పాటించే రుణాలకు బ్యాంకులు అదనంగా మరో 10 శాతం కేటాయింపులు జరపాలని ఆర్‌బీఐ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల లాభాలకు రూ.35,000 కోట్ల మేర గండిపడుతుందని అంచనా వేస్తున్నట్లు  బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ అనే సంస్థ వెల్లడించింది.
 

click me!