రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ... నేడు వెల్లడించనున్న ‘నిర్మల’మ్మ

By Sandra Ashok Kumar  |  First Published May 13, 2020, 1:07 PM IST

ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ ప్రాజెక్టు పేరుతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రూ.20 లక్షల కోట్ల అంచనాతో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వివరాలను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం సాయంత్రం ప్రకటించనున్నారు. మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ప్యాకేజీ వెల్లడించిన సంగతి తెలిసిందే.


న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా  కొన్ని వారాలుగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రూ.20 లక్షల కోట్ల విలువైన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దీని పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు వెల్లడించనున్నారు. 

భారతదేశంలో కరోనా ప్రభావం చూపకముందే దేశీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతున్నది. వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు పేర్కొన్న ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడైతే దాని ప్రభావం ఎంత ఉంటుందన్న సంగతి ఆర్థిక నిపుణులు నిర్ధారించనున్నారు. 

Latest Videos

ఇప్పటికే ఆర్థిక వేత్తల సారథ్యంలో పని చేస్తున్న పలు రేటింగ్ సంస్థలు దేశీయ ఆర్థిక ప్రగతి పడిపోతుందని, జీడీపీ పతనమవుతుందని అంచనా వేశాయి. కరోనాతో ఆర్థిక మాంద్యం పొంచి ఉందని హెచ్చరించాయి. రూ.20 లక్షల కోట్లు అంటే దేశ జీడీపీలో 10 శాతం అన్నమాట. ఈ ప్యాకేజీలో ఆర్బీఐ ఇంతకుముందు ప్రకటించిన రూ.1.74 లక్షల కోట్ల సహాయ నిధి కూడా ఉంది. 

సంస్కరణలతో కూడిన ఉద్దీపన ప్యాకేజీని అందుబాటులోకి తేనున్నట్లు, మొత్తం ఆర్థిక వ్యవస్థనే పునర్వ్యవస్థీకరిస్తామని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.  ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో హాకర్ మొదలు వీధి వ్యాపారి, వ్యాపారి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ, నిజాయితీ పరులైన మధ్య తరగతి వర్గాలు, మాన్యుఫాక్చరర్లు అందరికీ లబ్ధి చేకూరుతుందని ట్వీట్ చేశారు. 

also read ప్యాకేజీపై అసంత్రుప్తి: భారత్‌కు లాభిస్తుందని చెప్పలేం.. అభిజిత్ కుండబద్ధలు

ఇదిలా ఉంటే గత రెండు నెలల కాలంలో సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), వ్యవసాయ, కార్పొరేట్ రంగాలలోని సంస్థలకు ప్రభుత్వ రంగ బ్యాంకు‌లు (పీఎస్‌బీ) సుమారు రూ. 6 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలానే మార్చి 1 నుంచి మే 8, 2020 మధ్య నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఈ బ్యాంకుల నుంచి రూ.1.18 లక్షల కోట్లు పొందాయని మంత్రి వెల్లడించారు. 

‘ఎంఎస్‌ఎంఈ, రిటైల్, వ్యవసాయం, కార్పోరేట్ రంగాలకు చెందిన సుమారుగా 46.47 లక్షల ఖాతాలకు మార్చి ఒకటో తేదీ నుంచి ఈ నెల 8వ తేదీ వరకు పీఎస్‌బీలు రూ.5.95 లక్షల కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రూ.1.18 లక్షల కోట్ల విలువైన ఆర్థిక నిధులు ఎన్‌బీఎఫ్‌సీలకు అందించాయి’’ అని సీతారమన్ ట్విటర్లో తెలిపారు. 

మార్చి 25న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన్పటి నుంచి పీఎస్‌బీలు వర్కింగ్ క్యాపిటల్ పరిమితుల ఆధారంగా తమ వద్ద ఉన్న ఫండ్ నుంచి 10 శాతం అదనపు రుణ మంజూరుకు ముందుకు వచ్చాయి. మార్చి 20 నుంచి మే 8 మధ్య ఎమర్జెన్సీ లైన్‌ ఆఫ్ క్రెడిట్‌కు అర్హత ఉన్న 97 శాతం పరిశ్రమలు రుణాల కోసం పీఎస్‌బీలను సంప్రదించగా.... మూలధన అభివృద్ధి పనితీరు ఆధారంగా వాటికి రూ.65,879 కోట్ల విలువైన రుణాలు మంజూరు చేసినట్లు సీతారామన్‌ తెలిపారు. 

కరోనా నియంత్రణలో భాగంగా తొలి దశలో మార్చి 25న కేంద్రం 21 రోజుల లాక్‌డౌన్‌ విధించింది. అయితే వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దశల వారిగా లాక్‌డౌన్‌ పొడిగిస్తూ పలు రంగాలకు చెందిన పరిశ్రమలు తిరిగి ఉత్పత్తిని ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చింది. 
 

click me!