దేశార్థికాభివృద్ధి రేటును పరుగులెత్తించాలంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలే బెస్టని సిబిల్ అండ్ సిడ్బీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం నిగ్గు తేల్చింది. మొండి బాకీల సమస్య చాలా తక్కువ అని స్పష్టం చేసింది. మరోవైపు అన్ని వర్గాల పరిశ్రమలకు మేలు చేసేలా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడానికి ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికశాఖ తుది కసరత్తు చేస్తున్నాయి.
ముంబై: కరోనా విలయంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ మరింత చతికిల పడింది. నిబంధనలు కొద్దిగా సవరించినా.. చాలా కంపెనీల గేట్లు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. లాక్‌డౌన్ ముగిశాకైనా పరిస్థితి కుదుట పడుతుందా అన్న నమ్మకం కుదరడం లేదు.
దీంతో ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలు ఎక్కించడం ఎలా? అని విధాన నిర్ణేతలు, ప్రభుత్వం తలలు పట్టుకుంటున్నాయి. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ (మైక్రో) తరహా కంపెనీలపై ప్రత్యేక దృష్టి పెట్టడమే ఇందుకు మార్గమని భారత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ), సిబిల్ సంస్థలు ఒక నివేదికలో పేర్కొన్నాయి.
రూ.కోటి కంటే తక్కువ రుణ పరిమితి ఉన్న సూక్ష్మ కంపెనీలను ఇందుకు ప్రాతిపదికగా తీసుకోవాలని సిడ్బీ-సిబిల్ నివేదిక పేర్కొన్నది. ఇతర సంస్థలు తీసుకున్న అప్పులతో పోలిస్తే ఆస్తులు ఎక్కువగా ఉండడం, పెద్దగా మొండి బకాయిల (ఎన్‌పీఏ) భయం లేకపోవడమూ ఈ కంపెనీల ప్రత్యేకత అని ఈ నివేదిక తెలిపింది.
జీఎస్టీ గందరగోళంతోపాటు ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంక్షోభం తర్వాత ఏర్పడిన నిధుల కొరత సమస్యనూ ఈ కంపెనీలు సమర్ధవంతంగా ఎదుర్కొన్న విషయాన్ని సిడ్బీ-సిబిల్ నివేదిక గుర్తుచేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ సంస్థల రుణ అవసరాలు తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిడ్బీ సీఎండీ మహ్మద్ ముస్తాఫా కోరారు.
also read కరోనా ఎఫెక్ట్ : కోటక్ మహీంద్ర ఉద్యోగుల వేతనాలలో కోత...
పెద్ద, మధ్య తరహా కంపెనీలతో పోలిస్తే రుణాల చెల్లింపుల్లో ఈ సంస్థల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని సిడ్బీ-సిబిల్ నివేదిక ప్రశంసించింది. గతేడాది డిసెంబర్ నెలాఖరు నాటికి పెద్ద కంపెనీలకు ఇచ్చిన రుణాల్లో 19.1 శాతం, మధ్య తరహా కంపెనీలకు ఇచ్చిన రుణాల్లో 18.7 శాతం మొండి బాకీలుమారాయి.
సూక్ష్మ సంస్థల విషయానికి వచ్చేసరికి ఇది 11.3 శాతం మాత్రమే మొండి బాకీలుగా పరిమితం అయ్యాయి. సంస్థాగతంగా చూసినా ప్రస్తుత ఆర్థిక కష్టాల నుంచి త్వరగా బయటపడే సత్తా ఈ కంపెనీలకే ఎక్కువ అని సిబిల్ ఎండీ, సీఈఓ రాజేశ్ కుమార్ స్పష్టం చేశారు.
చతికిల పడిన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీని రూపొందిస్తోంది. ఈ ప్యాకేజీ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలతోపాటు కరోనాతో దెబ్బతిన్న అన్ని రంగాలను ఆదుకునేలా ఉంటుందని సమాచారం.
ప్రధాన మంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్యాకేజీకి తుది మెరుగులు దిద్దుతున్నాయి. దీనిపై చర్చించేందుకు ప్రధాని మోదీ ఇప్పటికే కీలక శాఖల మంత్రులతో చర్చలు జరిపారు. ఈ ప్యాకేజీ ద్రవ్య లోటు పెద్దగా పెంచకుండా ఉండాలని ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. లేకపోతే దేశ పరపతి రేటింగ్‌కు కోత పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ ప్యాకేజీని అత్యంత పకడ్బందీగా రూపొందిస్తున్నట్టు సమాచారం.