న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-రిటైల్ సంస్థల అమ్మకాల్లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, ఫర్నిచర్, గృహోపకరణాలు లాంటి ఉత్పత్తులదే సింహభాగం. ఈ కంపెనీలకు 90 శాతానికి పైగా ఆదాయం వీటి నుంచే వస్తుందని ఓ అంచనా.
కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉండటంతో కేవలం అత్యవసర వస్తువులను మాత్రమే అమ్మేందుకు అనుమతి ఉంది. పైవన్నీ అత్యవసరం కాని వస్తువుల విభాగం కిందకు వస్తుండటంతో వాటిని అమ్మే వీల్లేదు.
పైగా చాలా వస్తువులను నాన్ ఎస్సెన్షియల్ విభాగంలోకి చేర్చడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థల అమ్మకాలు భారీగా పడిపోయి, వాటి ఆదాయాలపైనా ఈ ప్రభావం పడింది. దేశంలోని దిగ్గజ ఈ-కామర్స్ సంస్థల పరిస్థితే ఇలా ఉంది.
ఇక లెన్స్‌కార్ట్, ఫస్ట్‌క్రై, నైకా లాంటి చిన్న సంస్థల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు 14వ తేదీ తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగించి, అత్యవసరం కాని వస్తువుల అమ్మకాలపై ఆంక్షలు ఇలాగే కొనసాగితే ఈ సంస్థలకు ఏప్రిల్ నెల పీడకలను మిగిల్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.
లాక్‌డౌన్ కారణంగా ఈ మూడు వారాల్లో పడిన ప్రతికూల ప్రభావం నుంచి కోలుకునేందుకు ఈ-కామర్స్ సంస్థలకు కనీసం మూడు నెలలైనా సమయం పడుతుందని ఫోస్టర్ రీసెర్చ్‌కు చెందిన ఓ అనలిస్ట్ వెల్లడించారు.
‘కఠిన లాక్‌డౌన్ వల్ల భారత్‌లో వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచ మదుపర్లు, వ్యాపారులు, ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా సాంకేతికత రంగంలో. అందువల్ల వ్యాపారులు ఊపిరి పీల్చుకోవాలంటే కొన్ని నియమాలను సడలించాల్సిన అవసరం ఉంద’ని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆన్‌లైన్ విభాగ కార్యకలాపాలను క్రమక్రమంగా పునరుద్ధరిస్తే.. సకాలంలో వినియోగదార్లకు వస్తువులను చేరవేసేందుకు తయారీ సంస్థలు, దిగుమతిదార్లు, కార్మిక మంత్రిత్వ శాఖ, ఇతర వ్యవస్థలతో కలిసి ఇవి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. వివిధ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా, సమీప విక్రయ కేంద్రాల సాయంతో సరఫరాకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
also read
ఐటీ’కీ కష్టకాలమే: సుదీర్ఘ కాలం లాక్ డౌన్‌తో ఉద్యోగాల కోత ఖాయమే!
ఉద్యోగాలు, వేతనాల కోతకు అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరం కాని వస్తువులకు గిరాకీ పరిమితంగానే ఉండొచ్చని, దీపావళి సమయంలో పుంజుకోవచ్చని ఫోస్టర్ రీసెర్చ్ విశ్లేషకుడు సతీశ్ మీనా తెలిపారు. అయితే లాక్‌డౌన్ తర్వాత కూడా కొన్ని రోజులు ప్రజలు భౌతిక దూరం పాటించే అవకాశం ఉండటంతో ఆన్‌లైన్ కొనుగోళ్ల వైపే వాళ్లు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు.
అందువల్ల ఈ సంస్థల కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభమైతే.. ఈ ఏడాది ఈ-కామర్స్ పరిశ్రమ 9-10% వృద్ధితో 35 బిలియన్ డాలర్లకు చేరొచ్చని ఫోస్టర్ రీసెర్చ్ విశ్లేషకుడు సతీశ్ మీనా అంచనా వేశారు. మరోవైపు అత్యవసర వస్తువుల అమ్మకాలకు లాక్‌డౌన్ పరిణామం కలిసివచ్చినప్పటికీ కేవలం 3 శాతం మాత్రమే వృద్ధి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఈ-కామర్స్ సంస్థల కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి అనుమతించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎంఏఐ) కోరింది.
2020లో స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి అంచనాను 7-8% మేర కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తగ్గించడంతో ఈ అభ్యర్థన చేసింది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల గిరాకీ ఇప్పుడప్పుడే పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదని కూడా కౌంటర్ పాయింట్ హెచ్చరించింది.
ఇక అత్యవసర వస్తువులను సరఫరా చేసే సంస్థల పరిస్థితి మరోలా ఉంది. సిబ్బంది కొరత, తగినంత సామర్థ్యాలు లేకపోవడంతో బిగ్‌బాస్కెట్, గ్రోఫెర్స్, 1ఎంజీ, ఫార్మ్‌ఈజీ లాంటి సంస్థలు ఆర్డర్లను వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
నిర్దిష్ట సమయంలోగా సరఫరా చేయడంలోనూ ఆయా సంస్థలు అవరోధాలు ఎదుర్కొంటున్నాయి. సరఫరా అవరోధాలు, సిబ్బంది కొరత కారణంగా సాధారణ స్థాయి కంటే కూడా 40 శాతం తక్కువగానే రోజువారీ అమ్మకాలు, ఉత్పత్తి నమోదైందని ఈ వారం ప్రారంభంలో హిందుస్థాన్ యునిలీవర్ కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.