న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఇంటిలోనే ఉంటున్న ప్రతి ఒక్కరూ వాట్సాప్‌ ద్వారా తమ వారికి దగ్గర అవుతున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో మాములు కాల్స్‌ కంటే వాట్సాప్‌ కాల్స్‌నే ఎక్కువ మంది వినియోగిస్తున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి.

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్‌‌ మరో కొత్త ఫీచర్‌తో రాబోతుంది. అదే వాట్సాప్‌ లోన్‌. వాట్సాప్ తన అర్హులైన యూజర్లందరికీ రుణాలు ఇస్తూ వారి అవసరాలు తీర్చాలని నిర్ణయించింది. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెల మొదట్లో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సంగతి పేర్కొంది. 

ఇప్పుడు భారతీయులందరికి లోన్‌ ఇ‍వ్వడానికి వాట్సాప్‌ సిద్ధం అయ్యింది. ఇప్పటికే పేమెంట్స్‌ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్న వాట్సాప్‌ త్వరలో భారతదేశంలో వాట్సాప్‌ వాడుతూ అర్హులైన వారందరికి అవసరాల కోసం డబ్బును అప్పుగా ఇవ్వడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

వాట్సాప్‌ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ తన ఫైనాన్షియల్‌ సర్వీసులను మరింత విస్తరించాలని భావిస్తుండటంతో క్రెడిట్‌ సర్వీస్‌ను భారత్‌లో ప్రారంభించనున్నది. ఈ విషయమై ఫేస్‌బుక్‌ ఇప్పటికే నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతులు కూడా పొందింది.ఈ ఫీచర్‌ మనకి పేమెంట్ల ఆప్షన్‌లోనూ కనబడుతుంది. 

ప్రస్తుతం తొలిదశలోనే ఉన్న ఈ ఫీచర్‌ త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నది.
అయితే, కంపెనీ బ్యాంకింగ్ వ్యాపారం చేయకుండా చట్టబద్ధమైన అడ్డంకులు ఉండడం వల్ల ప్రస్తుతం ఉన్న బ్యాంకులతో భాగస్వామ్యం ఏర్పరచుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది.

2018లో వాట్సాప్ 10 లక్షల మంది వినియోగదారులతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారిత సేవలు ప్రారంభించింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నియంత్రణ పరిమితుల వల్ల ఆగిపోయింది.

గత సంవత్సరం చివరి నాటికి సేవలను ప్రారంభించాలని భావించింది. కానీ, అధికారుల నుంచి అనుమతి పొందడంలో విఫలమైంది. తదుపరి దశలో కోటి మంది యూజర్లకు వాట్సాప్ చెల్లింపులు చేస్తామని ఫిబ్రవరిలో వాట్సాప్ పేర్కొంది. 

అయితే, ఈ నెల ప్రారంభంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫేస్‌బుక్ ఇండియా హెడ్ అజిత్ మోహన్ మాట్లాడుతూ చెల్లింపుల యూజర్‌ బేస్‌గా ఇంకా పది లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో 40 కోట్లకు పైగా వినియోగదారులను వాట్సాప్ కలిగి ఉంది.

డిజిటల్ చెల్లింపుల రంగంలో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేలకు ప్రత్యర్థిగా వాట్సాప్ నిలిచేందుకు గొప్ప అవకాశం ఉంది. రేటింగ్స్ సంస్థ క్రెడిట్ సూయిస్ ప్రకారం.. భారతీయ డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ 2023 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.