ప్రతి ఒక్కరిలో కరోనా పలు భయాలను రేకెత్తించింది. ప్రతి దేశాన్ని ఆర్థిక మాంద్యం కలవరపెడుతున్నది. వెంటాడుతున్న నిరుద్యోగానికి తోడు వివిధ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలుఇబ్బందికరంగా మారాయి. దీనికి అదనంగా సీజనల్ మార్పులతో అంటు రోగాలు వణికిస్తున్నాయని కరోనా నేపథ్యంలో రూపొందించిన డబ్ల్యూఈఎఫ్ అధ్యయనం నివేదించింది.
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ అతలాకుతలం చేసింది. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక రంగాలను ఈ మహమ్మారి స్తంభింపజేసింది. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలన్నీ బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయి.
కరోనా కారణంగా మాంద్యం, నిరుద్యోగం, రక్షణాత్మక విధానాల భయం వివిధ దేశాలను పట్టుకున్నది. సీజనల్ మార్పులతో అంటు రోగాలు విజృంభిస్తాయేమోనని ఆందోళనలూ ప్రపంచ దేశాలను ఇప్పుడు పట్టి పీడిస్తున్నాయి.
undefined
కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలకు దీర్ఘకాలిక మాంద్యం, అధిక నిరుద్యోగం, పెరిగిన రక్షణాత్మక విధానాల భయం పట్టుకున్నది. సీజనల్ మార్పులు మరో మహమ్మారిని సృష్టిస్తాయా? అన్న ఆందోళన కనిపిస్తున్నది.
ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్) తాజా అధ్యయనం.. ప్రపంచ దేశాల్లో నెలకొన్న ప్రధాన ఆందోళనల్ని బయటపెట్టింది. వచ్చే ఏడాదిన్నర కాలం ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అసంతృప్తులతోనే కొనసాగవచ్చని డబ్ల్యూఈఎఫ్ అంచనా వేసింది.
అయితే ప్రపంచ దేశాధినేతలు, వ్యాపారులు, విధానకర్తలు కలిసి కృషిచేస్తే ఈ విపత్తు నుంచి బయటపడే వీలుందని ‘కరోనా రిస్క్స్ ఔట్‌లుక్' పేరుతో విడుదల చేసిన అధ్యయనంలో డబ్ల్యూఈఎఫ్ అభిప్రాయపడింది. ఈ అధ్యయనంలో దాదాపు 350 మంది సీనియర్ రిస్క్ ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు.
also read అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది.. కానీ 2021 నాటికి..
రాబోయే 18 నెలల్లో ప్రపంచాన్ని, వ్యాపారాలను ప్రభావితం చేసే అతిపెద్ద ఆందోళనలపై అడిగిన ప్రశ్నలకు వీరు జవాబిచ్చారు. వ్యాపారాలు స్తంభించి తీసుకున్న అప్పుల్ని చెల్లించలేక దివాలా తీస్తామా? అన్న భయాలు చాలా సంస్థలు, పరిశ్రమల్లో కనిపిస్తున్నాయని అధ్యయనంలో పాల్గొన్న మెజారిటీ నిపుణులు తెలిపారు.
లాక్‌డౌన్‌తో అన్ని వ్యాపార, పరిశ్రమలు వ్యయ నియంత్రణ చర్యలను పాటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా కంపెనీలు ఉద్యోగ కోతలకు దిగుతున్న సంగతీ తెలిసిందే. ఈ కారణంగా నిరుద్యోగ సమస్య చాలా దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నదని నిపుణులు పేర్కొన్నారు.
ఇక అమెరికా సహా ఎన్నో దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంభించడం యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే వణికిస్తున్నదని పలువురు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ఆర్థిక మాంద్యం మరింత ముదిరే వీలుందనీ హెచ్చరిస్తున్నారు.
కరోనా దెబ్బకు భవిష్యత్తు అంతా అయోమయంగా మారింది. ప్రభుత్వ లక్ష్యాలు తలకిందులు కాగా.. వ్యాపార, పారిశ్రామిక వృద్ధి ఆచూకీ లేకుండా పోయింది. వ్యక్తిగత జీవనంలోనూ అనేక మార్పులు సంభవించాయని డబ్ల్యూఈఎఫ్ అధ్యయనం స్పష్టం చేసింది.
అన్ని దేశాలు రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్నాయని, దీంతో అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు తెలిపారు. ఇక ఎకానమీలో డిజిటల్ విధానాలకు ప్రాధాన్యత పెరుగగా, సైబర్ దాడులు, డాటా మోసం ముప్పుగా పరిణమించాయన్నారు.
కాగా, వాతావరణ సంక్షోభం, భౌగోళిక రాజకీయ సమస్యలు, పెచ్చుమీరే అసమానతలు, లాక్‌డౌన్ నేపథ్యంలో మారిన ప్రజల మానసిక ప్రవర్తనపై జాగ్రత్తగా ఉండాలని ప్రపంచాన్ని డబ్ల్యూఈఎఫ్ హెచ్చరించింది.