ఆ ఉద్దీపనతో నో యూజ్: కరోనా క్రైసిస్ అసాధారణం.. ఆర్బీఐ మాజీ గవర్నర్

By Sandra Ashok Kumar  |  First Published May 11, 2020, 10:27 AM IST

కరోనా మహమ్మారితో తలెత్తిన అసాధారణ సంక్షోభం నుంచి బయట పడేందుకు మరింత ‘ఆర్థిక’ సాయం కావాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు అదుపు తప్పుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 


న్యూఢిల్లీ‌: ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 26న ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌  (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు పెదవి విరిచారు. కరోనాతో చతికిలపడిన ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడానికి ఈ ప్యాకేజీ ఏ మాత్రం సరిపోదన్నారు. 

మంథన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ఒక వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘జీడీపీలో 0.8 శాతానికి సమానమైన ఈ ఉద్దీపన ప్యాకేజీ.. ప్రస్తుత కష్టాల నుంచి గట్టెక్కేందుకు సరిపోతుందా? అంటే సరిపోదనే చెప్పాలి. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తుంటే అది చాలా చిన్నదిగా కనిపిస్తోంది’  అని అన్నారు. 

Latest Videos

undefined

కరోనా ముమ్మాటికీ అసాధారణ సంక్షోభమని దువ్వూరి సుబ్బారావు స్పష్టంచేశారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఖర్చులు పెంచక తప్పదన్నారు. లాక్ డౌన్ వల్ల పేదలతో పాటు పొదుపు మొత్తాలు కూడా ఖర్చయిపోయిన కుటుంబాలకూ జీవన భృతి కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందన్నారు. మార్చి 24 నుంచి విధించిన లాక్‌డౌన్‌తో రోడ్డున పడ్డ పలు కుటుంబాలను ఆదుకోవడమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్‌ అన్నారు. 

కరోనా పేరిట ఎడాపెడా అప్పులు చేయాలన్న ప్రభుత్వాల యోచనను దువ్వూరి సుబ్బారావు వ్యతిరేకించారు. ఒక పరిమితికి మించి ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు సేకరించడం ఏ మాత్రం మంచిది కాదన్నారు. 

also read ఇంధన డిమాండ్‌ ఢమాల్‌: ఏప్రిల్‌లో 46% డౌన్.. ఎల్పీజీ యూసేజ్ 21% అప్​​​​​​​

అలా చేస్తే వడ్డీ రేట్లు పెరిగిపోవడంతో పాటు మరిన్ని అనర్ధాలు తలెత్తే ప్రమాదం ఉందని దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో 2020 -21 ఆర్థిక సంవత్సరం రుణ సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం రూ.7.8 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్ల కు పెంచిన నేపథ్యంలో దువ్వూరి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

పెరగనున్న ద్రవ్య లోటుపైనా ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత (2020-21) ఆర్థిక సంవత్సరానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్య లోటు జీడీపీలో 6.5 శాతం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో ఇది జీడీపీలో 13 నుంచి 14 శాతానికి చేరే అవకాశం ఉందన్నారు. 

ద్రవ్యలోటు 14 శాతానికి చేరడంతో పలు ప్రతికూల పరిస్థితులు తప్పవని దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. కరోనాతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఒత్తిడికి లోనవుతుందన్నారు. అయితే తగ్గుతున్న చమురు ధర, భారీగా పెరగనున్న వ్యవసాయ ఉత్పత్తులు ఆర్థిక వ్యవస్థను కొంతలో కొంత గట్టెక్కిస్తాయని సుబ్బారావు అన్నారు. 

ప్రస్తుతం నెలకొన్న ‘అసాధారణ’ పరిస్థితుల్లో అదనపు నోట్ల ముద్రణ, ద్రవ్య లోటు విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆర్‌బీఐ మరో మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సూచించారు. లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

‘అసాధారణ పరిస్థితుల్లో అదనపు నోట్ల ముద్రణతో ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవు. అలా అని అది పెద్ద విపత్తూ కాదు. కాకపోతే దీన్ని ఒక పరిమిత స్థాయిలోనే ఉపయోగించాలి’ అని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని ప్రాధాన్యతల వారీగా ఖర్చు చేయాలని రాజన్‌ సూచించారు. 

click me!