గత 12 నుంచి 18 నెలలుగా దేశీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగానికి ఇప్పుడు కరోనా సంక్షోభం తెలెత్తింది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు ఆటో పరిశ్రమ ఆర్&డీ వ్యయాల్లో కోత విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు డెలాయిట్ నివేదిక వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల తీవ్రంగా దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ నష్టపోయింది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ఆటోమొబైల్ రంగ పరిశ్రమలు తమ పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డీ)పై వ్యయాలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
లాభదాయతలేని విభాగాలకు స్వస్తి పలకాలని ఆటోమొబైల్ సంస్థలు కూడా భావిస్తున్నట్లు డెలాయిట్ నివేదిక అంచనా వేసింది. ఆర్ అండ్ డీ కార్యక్రమాల్లో తగ్గుదల ఇప్పటివరకూ ప్రత్యామ్నాయ ఇంధన టెక్నాలజీ వినియోగంపై జరిగిన పరిశోధనపై బాగా ప్రభావం చూపొచ్చని నివేదిక వెల్లడించింది.
జీఎస్టీ, ఆర్థిక మందగమనం, బీఎస్-4 నుంచి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలకు మారడం, నగదు లభ్యత వంటి అంశాలతో గత 12 నుంచి 18 నెలలుగా భారత్‌లో ఆటో పరిశ్రమ వృద్ధి బాగా మందగించింది. దేశీయ ఆటో పరిశ్రమ కోలుకోవాలంటే చాలా సమయంపట్టే అవకాశం ఉందని డెలాయిట్ నివేదిక పేర్కొంది.
also read ఇంటర్నెట్ షేకింగ్: మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ‘తామ్‌రాజ్’బైక్
2018-19లో జరిగిన వాహన అమ్మకాలు.. మళ్లీ 2021-22లోనే నమోదయ్యే అవకాశముందని డెల్లాయిట్ నివేదిక తెలిపింది. లాక్‌డౌన్ తర్వాత డీలర్లు తమ వద్ద ఉన్న వాహనాలకు భారీ రాయితీలు ఇచ్చి వదిలించుకునే ప్రణాళికలు కూడా వేయొచ్చని డెలాయిట్ పేర్కొంది.
దేశవ్యాప్తంగా వివిధ మోటారు వాహనాలకు చెందిన డీలర్ల వద్ద రూ.6,300 కోట్ల విలువైన బీఎస్-4 వాహనాలు ఉన్నాయి. వీటికి రాయితీలు ఇచ్చేందుకు తయారీ కంపెనీలు కూడా డీలర్లకు మద్దతిచ్చే అవకాశం ఉన్నదని డెల్లాయిట్ తన నివేదికలో వెల్లడించింది.
కరోనా వల్ల వినియోగదారుల డిమాండ్ తగ్గిపోయి మున్ముందు ఆటోమొబైల్ రంగ రెవెన్యూ, క్యాష్ ప్లోపై ప్రభావం ఉంటుందని డెల్లాయిట్ ఇండియా పార్టనర్, ఆటోమోటివ్ సెక్టార్ అధిపతి రాజీవ్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ సంస్థలు వచ్చే రెండు త్రైమాసికాల నుంచి నాలుగు త్రైమాసికాల వరకు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ అండ్ మొబిలిటీ టెక్నాలజీలపై రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్‌పై నిధులు ఖర్చు చేయకపోవచ్చునన్నారు.