అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా నుంచి బయటకు రావాలని భావించే వివిధ దేశాల సంస్థల పెట్టుబడులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
వాషింగ్టన్ : భారత్‌ను తమ పెట్టుబడులకు కేంద్రంగా చేసుకోవాలనుకునే కంపెనీలను స్వాగతిస్తామని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాంటి కంపెనీలను ఆకర్షించేందుకు త్వరలోనే కార్యాచరణ పథకం రూపొందిస్తామన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికాకు వచ్చిన నిర్మలా సీతారామన్ విలేకరులతో మాట్లాడారు.
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాలోని అనేక బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్‌సీ) ముఖ్యంగా అమెరికా కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను భారత్ వంటి దేశాలకు తరలించాలని యోచిస్తున్నాయి. వియత్నాం ఇప్పటికే ఇందులో కొన్ని ఎంఎన్‌సీలను ఆకర్షించింది.
Amazon offers: :అమెజాన్ దివాలీ సేల్.. 60 శాతం డిస్కౌంట్
ఆయా కంపెనీల విస్తరణకు అవసరమైన సుశిక్షితులైన మానవ వనరులు వియత్నాంలో దొరకడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ ప్రకటన చేయడం విశేషం. ‘ముందు ఒక కార్యాచరణ పథకం రూపొందిస్తాం. దాని ఆధారంగా పెట్టుబడులకు భారత్ ఎంత ఆకర్షణీయమైన దేశమో ఆ కంపెనీలకు వివరిస్తాం’ అని సీతారామన్ చెప్పారు.
చైనాలో ఎలక్ట్రానిక్స్ పరికరాలు, లిథియం అయాన్ బ్యాటరీలు, సెమికండక్టర్ల వంటి కీలక వస్తువుల తయారీలో ఉన్న పలు అమెరికా ఎంఎన్‌సీలు తమ ఉత్పత్తి కేంద్రాలను భారత్‌కు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అనుమతులు పొందడంలో ఇబ్బందులు, పన్నుల భారంతో వెనకంజ వేస్తున్నాయి.
దీంతో కొన్ని కంపెనీలు వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాలను ఎంచుకుంటున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా తయారీ రంగంలోకి వచ్చే కంపెనీలపై పన్ను భారాన్ని ప్రభుత్వం ఇటీవల 15 శాతానికి కుదించింది. విస్తృతమైన భారత దేశీయ మార్కెట్‌తోపాటు ఎగుమతి అవకాశాలు చైనాలోని ఎంఎన్‌సీలను భారత్ వైపు ఆకర్షిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్థిక అసమానతలు, సవాళ్ల నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో ఉమ్మడిగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందుకోసం ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి ఏర్పడుతున్న అడ్డంకులను అధిగమించేందుకు అవసరమైన పరిష్కారాలనూ ఐఎంఎఫ్ సిద్ధం చేయాలని నిర్మలా సీతారామన్ కోరారు. పెట్టుబడుల రాకపోకలతో వర్థమాన దేశాలు ఎదుర్కొనే సమస్యలపైనా ఐఎంఎఫ్ దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుత ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు జీ-20 దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
also readone plus tv: వన్ ప్లస్ టీవీలపై ఆఫర్.. ఆ బ్యాంక్ కార్డు ఉంటే రూ.7000 క్యాష్‌బ్యాక్
త్వరలోనే రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్టు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందుకోసం రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు త్వరలోనే ఒక కొలిక్కి వస్తాయన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ ఆర్థిక మంత్రి మున్‌చిన్‌తో జరిగిన సమావేశంలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్టు చెప్పారు. క్రిప్టోకరెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉంటేనే మంచిదన్నారు.
ప్రస్తుత ఐఎంఎఫ్ కోటా విధానంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌తో సహా అనేక వర్థమాన దేశాల కోటా పెంపునకు ఉద్దేశించిన ప్రతిపాదనకు సరైన మద్దతు లభించకపోవడాన్ని తప్పుపట్టారు. కనీసం వచ్చే ఏడాది జరిగే సమావేశంలోనైనా ఈ ప్రతిపాదనకు మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఐఎంఎఫ్ నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఈ కోటా విధానాన్ని సమీక్షించాలి. చాలా కాలంగా దీనిపై ఎలాంటి సమీక్ష జరగటంలేదు. ఇప్పటికీ ఐఎంఎఫ్ ఓటింగ్‌లో అమెరికాదే పెత్తనం. ప్రస్తుతం ఐఎంఎఫ్ కోటాలో అమెరికాకు 16.52 శాతం వాటా ఉంది. దీంతో అవసరమైనప్పుడు కొన్ని దేశాలకు రుణాలు అందకుండా అమెరికా వీటో చేస్తోంది.