నోట్ల రద్దుకు మూడేళ్లు...రూ.2000 నోటూ రద్దు చేయాలి

By Sandra Ashok KumarFirst Published Nov 9, 2019, 10:07 AM IST
Highlights

నిజంగా నల్లధనాన్ని వెలికి తీసి, నకిలీ కరెన్సీని రూపుమాపాలంటే ప్రస్తుత రూ.2000 నోటునీ రద్దు చేయాలని ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి ఎస్‌.సి.గార్గ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం చేసిన నోట్ల రద్దుకు మూడేళ్లు నిండాయి.  నల్లధనం వెలికితీసి, నకిలీ కరెన్సీని అడ్డుకోవడమే లక్ష్యంగా రూ.500, రూ.1000ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నల్లధనాన్ని వెలికి తీయాలంటే అప్పటి పెద్ద నోట్ల స్థానంలో తెచ్చిన రూ.2000 నోటును కూడా ఇప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గార్గ్‌ పేర్కొన్నారు. 

‘వ్యవస్థలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. రూ.2000 నోట్లను కూడా దాచి ఉంచుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. కానీ, భారత్‌లో మాత్రం అది చాలా నెమ్మదిగా సాగుతోంది’ అని గార్గ్‌ పేర్కొన్నారు.

aslo read నో డౌట్...ఇప్పట్లో భారత్... కోలుకునే అవకాశాల్లేవ్ : మూడీస్ హెచ్చరిక

ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడో వంతు రూ.2000 నోట్లేనని ఎస్సీ గార్గ్ తెలిపారు. వీటిలో చాలా వరకు చెలామణిలోకి రావడం లేదన్నారు. రోజువారీ లావాదేవీలకు ప్రజలకు ఇవి అందుబాటులో ఉండడం లేదన్నారు. ఈ నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకోవడం గానీ, రద్దు గానీ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ప్రస్తుతం ఉన్న రూ.2000నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటే సరిపోతుందని గార్గ్‌ తెలిపారు. ఇదే మేలైన మార్గమని.. దీనివల్ల పెద్దగా ఇబ్బందులు కూడా తలెత్తబోవన్నారు. వాటి స్థానంలో నగదును తిరిగి ఇవ్వొద్దన్నది షరతు పెట్టడం ద్వారా చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లన్నీ వెనక్కి వస్తాయన్నారు.

ఆర్థిక లావాదేవీలకు పలు డిజిటల్‌ సాధనాలు అందుబాటులోకి వచ్చాయని గార్గ్ గుర్తుచేశారు. భారత్‌లో మాత్రం ఇంకా 85శాతం నగదు ఆధారిత చెల్లింపులే జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్ని డిజిటల్‌ చెల్లింపుల దిశగా మార్చే చర్యల్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 

also read  ఎట్టకేలకు ట్రేడ్‌వార్‌కు ఎండ్: సుంకాల విత్ డ్రాకు అమెరికా-చైనా రెడీ

అందుకోసం నగదు చెల్లింపులపై పన్నులు, ఛార్జీలు విధించాలని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గార్గ్ పేర్కొన్నారు. అదే సమయంలో డిజిటల్‌ చెల్లింపుల్ని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా నగదు ఆధారిత చెల్లింపులు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారి ప్రజలు డిజిటల్‌ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనా వేశారు.

ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా నగదు లావాదేవీలకు పూర్తిగా స్వస్తిపలకాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. చైనాలో ఇలాంటి చర్యలే చేపట్టారని.. ప్రస్తుతం ఆ దేశంలో 87శాతం లావాదేవీలు డిజిటల్‌ రూపంలోనే జరుగుతున్నాయని తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ సైతం బ్యాంకింగేతర డిజిటల్‌ చెల్లింపు సాధనాల్ని వ్యవస్థలోకి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలన్నారు.

click me!