ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రిలయన్స్‌ రోడ్లు...ఎక్కడో తెలుసా...

By Sandra Ashok KumarFirst Published Jan 30, 2020, 11:12 AM IST
Highlights

ముకేశ్​ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రోడ్ల నిర్మాణానికి ఓ సరికొత్త ప్రతిపాదనను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​ఏఐ) ముందు ఉంచింది. పునర్వినియోగానికి వీలుకాని ప్లాస్టిక్​తో రోడ్లు నిర్మించే టెక్నాలజీని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​ఏఐ)కి అందించేందుకు సిద్ధమైంది. 

రాయ్‌గఢ్‌: పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వాడకంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్న వేళ.. దేశంలో అతిపెద్ద ప్లాస్టిక్‌ ఉత్పత్తిదారు రిలయన్స్‌ కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది. వాడి పారేసిన వ్యర్థ ప్లాస్టిక్‌ పదార్థాలను వినియోగించి రోడ్లు నిర్మించవచ్చంటూ ముందుకు వచ్చింది. ఈ రోడ్లు ఎక్కువ కాలం మన్నికలో ఉంటాయని చెబుతోంది. 

దీనివల్ల పర్యావరణానికి మేలు జరగుతుందని రిలయన్స్ వివరిస్తోంది. సంస్థ అభివృద్ధి చేసిన నూతన టెక్నాలజీతో 'జాతీయ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)’ను సంప్రదించింది. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఇప్పటికే రోడ్ల నిర్మాణంలో కంపెనీ ప్లాస్టిక్‌ను వినియోగించిందని రిలయన్స్‌ తెలిపింది. రాయ్‌గఢ్‌లోని రిలయన్స్‌ నాగోథానె మానుఫ్యాక్చరింగ్‌ సైట్‌ వద్ద దాదాపు 40 కిలోమీటర్ల 'ప్లాస్టిక్‌ రోడ్‌'ను తాము నిర్మించామని రిలయన్స్ తెలిపింది. 

also read  స్పేర్ పార్ట్స్ పై కస్టమ్స్ తగ్గించాలి... లేదంటే గ్రే మార్కెట్‌దే హవా

50 టన్నుల వాడేసిన వృథా ప్లాస్టిక్‌ను తారుతో కలిపి ఈ రహదారిని నిర్మించామని రిలయన్స్ వెల్లడించింది. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు తమకు 14-18 నెలల సమయం పట్టిందని రిలయన్స్ పెట్రోకెమికల్స్‌ బిజినెస్‌ సీవోవో విపుల్‌ షా తెలిపారు. పాలిథిన్‌ బ్యాగ్‌లు, చిరుతిళ్ల ప్యాకెట్లు తదితర సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను రోడ్డు నిర్మాణంలో వినియోగించినట్లు చెప్పారు. 

జాతీయ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాతో కలిసి 'ప్లాస్టిక్‌ రోడ్ల'ను నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని విపుల్‌ షా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు కూడా తమ టెక్నాలజీని ఆఫర్‌ చేస్తున్నామన్నారు.'ఈ టెక్నాలజీ వల్ల ప్లాస్టిక్‌ను సమర్థంగా వినియోగించుకోవడంతోపాటు తక్కువ ఖర్చులో రోడ్ల నిర్మాణం చేపట్టొచ్చు’ అని రిలయన్స్ పెట్రో కెమికల్స్ బిజినెస్ విభాగం సీఓఓ విపుల్ షా అన్నారు.

కిలోమీటర్‌ రోడ్డు నిర్మాణానికి ఒక టన్ను వృథా ప్లాస్టిక్‌ అవసరమవుతుందని తేలింది. దీని వల్ల కిలోమీటర్‌కు దాదాపు రూ.లక్ష చొప్పున ఖర్చు ఆదా అవుతుంది' అని విపుల్‌ షా చెపారు. ఈ రోడ్లు వర్షాలకు కూడా తట్టుకుంటాయని తెలిపారు. నిరుడు కురిసిన కుండపోత వర్షాలకు కూడా ప్లాస్టిక్‌ రోడ్డు చెక్కుచెదరలేదని విపుల్ షా గుర్తుచేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో 10వేల కిలోమీటర్ల రోడ్లను ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించాలనుకుంటున్నది. 

also read Budget 2020: ఆయన బడ్జెట్‌ స్పీచ్ దేశ గతినే మార్చేసింది...

ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు మరో 23వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలని చూస్తున్నాయి. అయితే ప్లాస్టిక్‌ రోడ్ల వల్ల ధరణికి పలుఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కార్పోరేట్‌ సంస్థలు చెప్తున్నట్లు ప్లాస్టిక్‌ రోడ్ల వల్ల కేవలం తాత్కాలిక ఫలితాలే ఉంటాయని వారంటున్నారు. 

దీర్ఘకాలంలో దీని వల్ల పర్యావరణానికి మరింత హాని కలిగే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. సర్కారు ఇలాంటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించడంపై దృష్టి సారిస్తే మేలని వారు చెబుతున్నారు.

click me!