బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ...కారణమేమిటంటే!

By Sandra Ashok Kumar  |  First Published Nov 27, 2019, 1:06 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్లాగ్ షిప్ పథకాల్లో ఒక్కటైన ‘ముద్రా’ రుణాల జారీపై అప్రమత్తంగా ఉండాలని బ్యాంకర్లను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎంకే జైన్ హెచ్చరించారు. రుణ గ్రహీతల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దీనిపై ప్రారంభంలోనే అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేసినా.. నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొట్టి పారేశారు.


ముంబై: ముద్ర రుణాల జారీ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది. ఈ రుణాల్లో మొండి బకాయిలు పెరుగుతున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎంకే జైన్ మంగళవారం తెలిపారు. 2015 ఏప్రిల్‌లో ముద్ర పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. చిన్న వ్యాపారులకు రూ.10 లక్షలదాకా రుణం సులభంగా లభించే ఉద్దేశంతో దీన్ని పరిచయం చేశారు. 

ప్రస్తుతం ముద్ర రుణాల విలువ రూ.3.21 లక్షల కోట్లపైనే. ఇవన్నీ కూడా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇచ్చినవి. క్రెడిట్ రేటింగ్ పరంగా దిగువ స్థాయిలో ఉన్న కార్పొరేటేతర, చిన్న-సూక్ష్మ తరహా పరిశ్రమలు, సంస్థల పరిధిలో లేని వ్యక్తిగత వ్యాపారులకు ఈ రుణాలు అందుతున్నాయి.

Latest Videos

undefined

also read  అమ్మో కార్వీ!! సంక్షోభం నుంచి కోలుకుంటుందా?!!

అందుకే ఆర్బీఐ ఇప్పుడు ఈ రుణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ముద్ర రుణాలు చాలా మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాయి. ఈ రుణాల్లో మొండి బకాయిలు పెరుగుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది అని సూక్ష్మ రుణాలపై సిడ్బీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎంకే జైన్ మాట్లాడుతూ చెప్పారు. 

సాధారణ ఆర్థిక కార్యకలాపాలను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చాలావరకు ప్రభావితం చేసిందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎంకే జైన్ పేర్కొన్నారు. జీఎస్టీ దెబ్బకు ప్రతికూల పరిస్థతులు ఏర్పడ్డాయన్నారు. నిజానికి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐలకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లు ఆకర్షణీయ కస్టమర్లన్న ఆయన జీఎస్టీ అమలుతో ఇవి కుదేలైయ్యాయని వ్యాఖ్యానించారు.

నిజానికి ముద్ర రుణాల పథకం మొదలైన ఏడాది లోపలే అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ రుణాలపై జాగ్రత్త అని బ్యాంకులను హెచ్చరించారు. వీటికి భద్రత లేదని, రిస్క్ ఎక్కువని అన్నారు. నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. రాజన్ వాదనను కొట్టిపారేశారు. 

సాధారణంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలను ఇచ్చే ముందు రుణగ్రహీతలు తిరిగి చెల్లిస్తారా? లేదా? అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వ పథకం కావడంతో నిర్దేశిత లక్ష్యాలను అందుకోవడం కోసం రుణాలను బ్యాంకులు ఇస్తూ పోతున్నాయి. ఈ క్రమంలోనే రుణాలను మంజూరు చేసే ముందు రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితులను కూడా దగ్గరగా గమనించాలని బ్యాంకింగ్ రంగంలో విశేష అనుభవం ఉన్న జైన్ బ్యాంకులకు సూచించారు.

also read  పీఎస్‌ఎల్‌వీ C-47కి మొదలైన కౌంట్‌డౌన్‌: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కే. శివన్

గత ఆర్థిక సంవత్సరం (2018-19)లోనే ముద్ర పథకంలో మొండి బకాయిలు అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18)తో పోల్చితే ఏకంగా 126 శాతం పెరిగాయి. 2017-18లో రూ.7,277.31 కోట్లుగా ఉన్న ఎన్‌పీఏలు.. 2018-19 ఆఖరుకల్లా రూ.9,204.14 కోట్లు ఎగబాకి 16,481.45 కోట్లను తాకాయని  సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తెలుస్తున్నది.

 ఈ జూలైలో పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించిన వివరాలను చూస్తే కొంత తేడా కనిపిస్తున్నది. మరోవైపు ముద్ర పథకం ఆరంభం నుంచి 19 కోట్లకుపైగా రుణాలను పొడిగించారు. కాగా, మొత్తం ముద్ర ఖాతాల్లో 3.63 కోట్ల ఖాతాలు డిఫాల్ట్ అయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

click me!