ఎల్పీజీ సహా ఏ ఇంధన కొరత కూడా లేదు.. తేల్చేసిన ఐఓసీ

By narsimha lodeFirst Published Mar 30, 2020, 12:34 PM IST
Highlights

దేశంలో వంట గ్యాస్‌తో సహా ఏ ఇంధనానికి కొరత లేదని కేంద్ర ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ (ఎల్పీజీ)లకు కొరత ఏర్పడనున్నదన్న వార్తలను కంపెనీలు తోసిపుచ్చాయి.


న్యూఢిల్లీ: దేశంలో వంట గ్యాస్‌తో సహా ఏ ఇంధనానికి కొరత లేదని కేంద్ర ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ (ఎల్పీజీ)లకు కొరత ఏర్పడనున్నదన్న వార్తలను కంపెనీలు తోసిపుచ్చాయి.

లాక్‌డౌన్‌ తర్వాత ఏర్పడే అవసరాలకు మూడు వారాలకు సరిపడా కూడా సరిపడే స్థాయిలో నిల్వలు ఉన్నట్టు ఇండియన్‌ ఆయిల్‌ (ఐఓసీ), బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ప్రకటించాయి. లాక్‌డౌన్‌ ప్రకటించిన రోజూ 35 నుంచి 40 శాతం ఎల్పీజీ సిలిండర్లు అదనంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపాయి. 

లాక్‌డౌన్‌ ప్రారంభంలో సిబ్బంది కొరతతో కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థాయికి చేరినట్టు తెలిపాయి. వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరా విషయమై ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెచ్‌పీసీఎల్‌ సీఎండీ ముకేశ్‌ కుమార్‌ సురానా హామీ ఇచ్చారు.

పుకార్లు నమ్మి సిలిండర్ల కోసం ముందే బుక్‌ చేయవద్దని హెచ్‌పీసీఎల్‌ సీఎండీ ముకేశ్‌ కుమార్‌ సురానా కోరారు. లాక్‌డౌన్‌కు ముందు తమ రోజువారీ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా 12 లక్షలు ఉంటే ఇప్పుడు అది 15 లక్షలకు పెరిగిందన్నారు. బీపీసీఎల్‌ అధికారులు కూడా ఇదే విషయం చెప్పారు. 

మూడు వారాల లాక్‌డౌన్‌ ప్రకటించాక వంట గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌ అమాంతం 200 శాతం పెరగడంపై ఐఓసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 రోజలుగా ప్రభుత్వ రంగంలోని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు దేశవ్యాప్తంగా రోజుకు 52 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఇందులో 25 లక్షల సిలిండర్లు ఐఓసీ సరఫరా చేస్తోందని సంజీవ్ సింగ్ తెలిపారు. ఏదో కొరత ముంచుకు వస్తోందన్న భయంతో రెండు సిలిండర్లు ఉన్న గృహస్తులూ వంట గ్యాస్‌ బుక్‌ చేస్తున్నారని చెప్పారు.  

Also read:లాక్‌డౌన్: ప్రజలతో సోషల్ మీడియా మమేకమిలా...

లాక్‌డౌన్‌లతో దేశంలో వంట గ్యాస్‌ తప్ప మిగతా ఇంధనాల వినియోగం తగ్గిందని ఐఓసీ చైర్మన్‌ సంజీవ్ సింగ్ చెప్పారు. మార్చి నెలలో దేశంలో పెట్రోల్‌ వినియోగం ఎనిమిది శాతం, డీజిల్‌ వినియోగం 16 శాతం, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) వినియోగం 20 శాతం తగ్గాయి. 

వైరస్‌ విజృంభించిన నేపథ్యంలో ఇం టింటికి గ్యాస్‌ సరఫరా చేస్తున్న సిబ్బంది కోసం ఐవోసీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ వైరస్‌ వల్ల చనిపోతే వారి భార్యకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తెలిపింది. ఈ సమయంలో అందరూ విధి నిర్వహణలో ఉండాలని కోరింది. 

ఇదిలా ఉండగా పెరుగుతున్న వంటగ్యాస్‌ డిమాండ్‌ను తట్టుకునేందుకు కేంద్ర పెట్రోలియం ధర్మేంద్ర ప్రధాన్‌ ఇప్పటికే దీనిపై సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి అబ్దుల్‌అజీజ్‌ బిన్‌ సల్మాన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చలు జరిపారు. ముడి చమురు మార్కెట్‌ తాజా పరిస్థితిపైనా ఇద్దరు మంత్రులు చర్చించారు.  భారత ఎల్‌పీజీ అవసరాల తీర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సౌదీ అరేబియా మంత్రి అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్.. ప్రధాన్‌కు హామీ ఇచ్చారు. 

ఇదిలా ఉంటే కని పెంచిన తండ్రి మరణం. మరోవైపు విధి నిర్వహణ కర్తవ్యం. ఐఓసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ ఈ రెండింటి మధ్య నలిగిపోయారు. ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా మూడు వారాల లాక్‌డౌన్‌ ప్రకటించిన ఈ నెల 24న సింగ్‌ తండ్రి లక్నోలో చనిపోయారు. 

అయినా 24 గంటల్లో తండ్రి అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేసి, ఆ ఇంటినే వార్‌ రూమ్‌గా చేసుకుని దేశవ్యాప్తంగా ఐఓసీ ఇంధన సరఫరాలకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా సంజీవ్ సింగ్‌ పర్యవేక్షించారు. ‘అది వ్యక్తిగతంగా నాకు పెద్ద నష్టం. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో కర్తవ్య నిర్వహణ అవసరం నన్ను విధి నిర్వహణకు పురికొల్పింది’ అని భావోద్వేగంతో సంజీవ్ సింగ్ చెప్పారు. 
 

click me!