అగ్రశ్రేణి బిజినెస్ పర్సన్ సత్యనాదెళ్ల: బంగా, ఉల్లాల్‌లకూ ఫార్చ్యూన్‌లో చోటు

By Sandra Ashok Kumar  |  First Published Nov 21, 2019, 10:01 AM IST

వ్యూహాత్మకంగా సంస్థను ముందుకు నడిపించడంలో, కాంట్రాక్టులను గెలుచుకోవడంలో చూపిన చొరవ, సిబ్బంది పట్ల జాగ్రత్తలు, మిగతా నాయకత్వానికి స్వేచ్ఛ ఇచ్చి సంస్థను లాభాల బాట పట్టించినందుకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లకు ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ -2019 జాబితాలో తొలి స్థానంలో చోటు దక్కింది. ఇంకా మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా, అరిస్టా సీఈఓ జయ ఉల్లాల్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారిద్దరూ భారత సంతతి వారే కావడం విశేషం.


శాన్‌ ఫ్రాన్సిస్కో: తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల ఈ ఏడాది ‘ఫార్చూన్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2019’ జాబితాలో తొలి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. మాస్టర్ కార్డు సీఈఓ అజయ్ బంగా, అరిస్టా అధిపతి జయశ్రీ ఉల్లాల్‌లకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. సత్యనాదెళ్లతోపాటు అజయ్ బంగా, జయశ్రీ ఉల్లాల్ కూడా భారత సంతతి వారే.

also read మరో రికార్డు చేరువలో రిలయన్స్: 10లక్షల కోట్లకు రూ.1300 కోట్ల దూరం

Latest Videos

ధైర్యంగా అత్యుత్తమ లక్ష్యాలను చేరుకుని, అసాధ్యాలను సుసాధ్యం చేయడం, సృజనాత్మకంగా వినూత్న పరిష్కార మార్గాలను కనుగొనడం వంటి కీలక అంశాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో మొత్తం 20 మంది పేర్లు ఉండగా.. వీరిలో ముగ్గురు భారతీయ సంతతి వారే ఉండడం విశేషం. ఇక తెలుగు వాడైన సత్య నాదెళ్ల తొలి స్థానంలో ఉండడం మరో విశేషం. అజయ్ బంగా ఎనిమిదవ స్థానంలో, జయశ్రీ ఉల్లాల్ 18వ స్థానంలో నిలిచారు.

వ్యూహాత్మక నాయకుడి పాత్రలో ఒదిగిపోయిన సత్య నాదెళ్ల కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా దూసుకుపోతూ కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడం ద్వారా ఈ స్థానానికి చేరుకోగలిగారని ఫార్చూన్‌ మ్యాగజైన్‌ కొనియాడింది. తాజాగా 10 బిలియన్‌ డాలర్ల పెంటగాన్‌ క్లౌడ్‌ కాంట్రాక్టును అందుకోవడంలో నాదెళ్ల చూపిన చొరవ కంపెనీని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చిందని స్వయంగా ఆ సంస్థ స్వతంత్ర డైరెక్టర్లు చెప్పారన్నది. వాటాదారులకు అందిన ప్రతిఫలాల నుంచి మూలధనంపై అందిన ప్రతిఫలాల వరకు మొత్తం 10 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. 

బిల్‌ గేట్స్‌ వలే వ్యవస్థాపకుడు, స్టీవ్‌ బాల్‌మెర్‌ వంటి సేల్స్‌ లీడర్‌ కాకున్నా 2014లో ఆశ్చర్యకరంగా ఆయన ఎన్నిక జరిగింది. ఇటీవలే ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ(హెచ్‌బీఆర్‌) రూపొందించిన 10 అగ్రశేణి కంపెనీల సీఈఓల జాబితాలోనూ నాదెళ్ల కూడా ఉన్నారు.  కానీ ఆయన ఏనాడూ ఆర్థిక విభాగంలోనూ పని చేయలేదు. 

కానీ సత్య నాదెళ్ల వీటన్నింటిని అధిగమించి తనదైన శైలిలో మైక్రోసాఫ్ట్ నాయకత్వాన్ని ముందుండి నడిపించారని ఫార్చ్యూన్ పేర్కొంది. ‘నాకు నాపై నమ్మకం ఎక్కువ. అదే సమయంలో మిగతా వారినీ ఎదుగనిస్తాను. సీఈఓలకు అద్భుతమైన టీం లేకుంటే ఏం చేయలేరు. అద్రుష్టవశాత్తు నాకు అది లభించింది’ అని సత్య నాదెళ్ల పేర్కొన్నట్లు ఫార్చ్యూన్ తెలిపింది

also read  పెళ్లికి రుణమిస్తాం.. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు: బజాజ్ ఫిన్ సర్వ్

ఫార్చూన్‌ జాబితాలో మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. ఎనిమిదో స్థానంలో నిలిచిన మాస్టర్‌ కార్డ్‌ సీఈఓ అజయ్‌ బంగా.. మాస్టర్ కార్డ్ ఆర్థిక సేవల్లో తనదైన ముద్ర వేయడం వెనుక ఆయన దూరద్రుష్టి ఉందని ఫార్చ్యూన్ తెలిపింది. అంతే కాదు ఈ ఏడాది సంస్థ షేర్ 40 శాతం పెరిగి మదుపర్లకు అత్యంత ప్రీతిపాత్రమైన షేర్‌గా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. 

కాలిఫోర్నియా కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థ అరిస్టా హెడ్‌ జయశ్రీ ఉల్లాల్‌ 18వ స్థానంలో నిలిచారు. ఆమె తన కంపెనీ అరిస్టాను ఈథర్‌నెట్ స్విచెస్, ఓపెన్ సోర్స్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ విభాగంలో ఒక ప్రత్యేకమైన మార్కెట్ దిగ్గజంగా మార్చడానికి క్రుషి చేశారని ఫార్చ్యూన్ ప్రశంసించింది.

సత్య నాదెళ్ల తర్వాత పెర్త్‌కు చెందిన 2వ స్థానంలో ఫోర్టెస్క్యూ మెటల్స్‌ గ్రూప్‌ సీఈఓ ఎలిజబెత్‌ గెయినెస్, మూడో స్థానంలో చిపోటిల్‌ మెక్సికన్‌ గ్రిల్‌ సీఈఓ బ్రియాన్‌ నికోల్‌ ఉన్నారు. సింక్రొనీ ఫైనాన్షియల్‌ సీఈఓ మార్గరెట్‌ కీనే (4), ప్యూమా సీఈఓ జోర్న్‌ గుల్డెన్‌ 5వ స్థానంలో నిలిచారు. జేపీ మోర్గాన్ చేస్ సీఈఓ జామీ డిమాన్ పదవ స్థానంలో, అసెంచర్ సీఈఓ జాలీ స్వీట్ 15వ ర్యాంక్, ఆలీబాబా సీఈఓ డేనియల్ ఝాంగ్ 16వ స్థానం పొందారు.

click me!