బడ్జెట్‌ 2020:కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యంగా మూడు అంశాలపైనే ఆశలు...ఏంటంటే ?

By Sandra Ashok KumarFirst Published Jan 28, 2020, 12:32 PM IST
Highlights

వచ్చేనెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. అయితే అదే రోజు శనివారం అయినా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరుగనున్నది. దీర్ఘ కాలిక పెట్టుబడి లాభాలపై పన్ను, వ్యక్తిగత ఆదాయంపై పన్ను రాయితీలు స్టాక్ మార్కెట్లను నియంత్రిస్తాయి. ఒకవేళ పన్ను విధింపుల్లో రాయితీలు కల్పిస్తే స్టాక్ మార్కెట్లు పంచ కళ్యాణిలా దూసుకెళ్లడం ఖాయం.. మరి విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చేస్తారో వేచి చూద్దాం..
 

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందులు, ఒడుదొడుకుల మధ్య సాగుతోంది. మరోవైపు స్టాక్ మార్కెట్లు మాత్రం రేసు గుర్రాలను తలపిస్తున్నాయి. ఇప్పటికే కార్పొరేట్‌ పన్ను తగ్గించడంతోపాటు ఇతర తాయిలాలను మార్కెట్లకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వివిధ రంగాల సూచీలు దూసుకెళుతున్నాయి. 

దీంతోపాటు రియాల్టీ రంగంలోని వారికి ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్‌ ఏర్పాటు చేశారు. ఈ సారి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి పెట్టుబడులను ఆకర్షించేలా తన రెండో బడ్జెట్‌లో ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు. ముఖ్యంగా మూడు అంశాలపై మదుపర్లు ఆశలు పెట్టుకొన్నారు. 

also read budget 2020: మధ్యతరగతి వారికి గుడ్ న్యూస్...రూ. 7 లక్షల దాకా.. నో ట్యాక్స్...

14ఏళ్ల తర్వాత 2018-19 ఆర్థిక సంవత్సరంలో దీర్ఘ కాలిక పెట్టుబడి లాభాలపై పన్ను (ఎల్‌టీసీజీ)ని తిరిగి ప్రవేశపెట్టారు. రూ.లక్ష దాటిన షేర్లపై 10శాతం వరకు పన్ను విధిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక  పరిస్థితుల నేపథ్యంలో దేశీయ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి గల అవకాశాలు, నమోదిత కంపెనీలపై ఎల్టీసీజీ పన్ను తొలగింపు ప్రతిపాదనను పన్ను సలహాదారులు సూచించినట్లు ప్రభుత్వ అధికారులు అంటున్నారు. 

అదే సమయంలో ‘దీర్ఘకాలిక పెట్టుబడి’ గల నిర్వచనాన్ని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వశాఖ సన్నిహిత వర్గాలు తెలిపాయి.  ప్రస్తుతం ఎల్‌టీసీజీపై 10 శాతం పన్ను ఉంది. చాలా వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐ), ఇతర మదుపర్లు ప్రధాని హామీ నేపథ్యంలో ఎల్‌టీసీజీని తొలగిస్తారన్న అంచనాలతో ఉన్నారు.

పలువురు ఎఫ్‌పీఐలు ప్రభుత్వానికి ఎల్‌టీసీజీని తొలగించాలంటూ విజ్ఞప్తి కూడా చేశారని పన్ను విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్‌టీసీజీ, ఇతర పన్ను అంశాలతో పెట్టుబడుల ప్రణాళికలకు దూరంగా ఉన్నట్లు పలువురు విదేశీ మదుపర్లు చెబుతున్నారు. ప్రభుత్వం డివిడెండ్‌ను పంపిణీ చేసే కంపెనీలపై ఈ పన్ను విధిస్తోంది. కంపెనీకి వచ్చిన లాభాలకు అదనంగా దీనిని విధిస్తోంది. భారతీయ కంపెనీలు 20-21శాతం వరకు చెల్లిస్తున్నాయి. 

also read దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు మళ్ళీ బ్యాంకులు బంద్....

దీంతోపాటు డివిడెండ్లను పొందేవారిపై రూ.10లక్షలు దాటితే అదనంగా మరో 10శాతం పన్ను విధిస్తున్నారు. పన్నుమీద పన్ను పడే పరిస్థితి ఉండటంతో డివిడెండ్లను తొలగించాలని చాలా మంది కోరుకుంటున్నారు. వ్యవస్థలోకి నగదు ప్రవాహం పెంచడానికి వీలుగా ప్రజల్లో కొనుగోలు శక్తిని బలపర్చేందుకు వ్యక్తిగత ఆదాయం పన్నును తగ్గించే  అవకాశం ఉంది. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఆదాయంలో కొంత కోత పడినా పరోక్షంగా ప్రయోజనాలు లభిస్తాయి.

ప్రజలు మిగిలిన సొమ్మును కొనుగోళ్లు, పెట్టుబడులకు వినియోగించడంతో మళ్లీ వ్యవస్థలోకే వస్తుంది. ఇవన్నీ డిమాండ్‌ను పరోక్షంగా పెంచే చర్యలను తలపిస్తాయి. గత బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యక్తిగత పన్నుపై ఎటువంటి మార్పులు ప్రకటించకపోవడంతో మార్కెట్‌ భారీగా కుంగిన విషయం తెలిసిందే. పైమూడు అంశాల్లో ఆర్థిక మంత్రి ఏమాత్రం వెసులుబాటు కల్పించినా మార్కెట్లు రేసుగుర్రాల వలే పరుగులు తీస్తాయి. 

click me!