సుందర్ పిచాయ్ కి వరుస షాక్​లు... గూగుల్​కు ఏమైంది?

By Sandra Ashok Kumar  |  First Published Feb 12, 2020, 11:41 AM IST

గూగుల్,​ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ సీఈఓ సుందర్ పిచాయ్ ముంగిట సరికొత్త సవాల్ నిలిచింది. గతేడాది నాలుగో త్రైమాసికంలో ఆశించిన లాభాలు రాలేదు. ఈలోగా హెచ్ఆర్ విభాగం ఉపాధ్యక్షురాలు ఎలీన్ నౌటన్ రాజీనామా రూపంలో పిచాయ్‌కు మరో సవాల్ ఎదురైంది. 


న్యూయార్క్: ఇంటర్నెట్ సెర్చింజన్ ‘గూగుల్’​ అంతర్గత వ్యవహారాల్లో మరోసారి అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ సంస్థ హ్యూమన్ రీసోర్సెస్ చీఫ్​ ఎలీన్​ నౌటన్ రాజీనామా చేశారు. గత ఏడాది చివర్లో గూగుల్​ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ సీఈఓగా సుందర్​ పిచాయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 చివరి త్రైమాసికంలో ఆశించిన లాభాలు రాలేదు.

ఇలా ఇప్పటికే గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్ పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది​. ఆయన ఈ సవాళ్లను మరవక ముందే సంస్థ మానవ వనరుల విభాగం ఉపాధ్యక్షురాలు ఎలీన్​ నౌటన్ రాజీనామా తెరపైకి వచ్చింది.

Latest Videos

సెర్చ్​ ఇంజన్ దిగ్గజం గూగుల్​ను వరుస కష్టాలు వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్​ సీఈఓ సుందర్​పిచాయ్​ నేతృత్వంలో ప్రపంచవ్యాప్త కార్యకలాపాల్లో దూసుకుపోతున్నది. కానీ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం గత కొంతకాలంగా లుకలుకలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గూగుల్ హెచ్​ఆర్ ఉపాధ్యక్ష పదవికి ఎలీన్​ నౌటన్ రాజీనామా అందులో ఒకటి.

also read కొత్త విమానాశ్రయాన్ని నిర్మించనున్న జి‌ఎం‌ఆర్...ప్రభుత్వ అనుమతితో....

ఎలీన్ నౌటన్ రాజీనామా విషయాన్ని గూగుల్ సోమవారం అధికారికంగా వెల్లడించింది."గూగుల్​లో ఎలీన్​ అందించిన సేవలకు కృతజ్ఞతతో ఉన్నాం." అని గూగుల్​, మాతృ సంస్థ ఆల్ఫాబెట్​ సీఈఓ సుందర్​పిచాయ్​ ఓ ప్రకటనలో తెలిపారు. 

ఎలీన్​ గూగుల్​లో పనిచేసినప్పుడు దాదాపు 70వేల మంది ఉద్యోగులను చేర్చుకున్నారు."నా భర్త, నేను మొదట లండన్​లో, ఇప్పుడు శాన్​ఫ్రాన్సిస్కోలో ఆరు సంవత్సరాలు ఉన్నాం. ఇప్పుడు ఇక కుటుంబానికి దగ్గరగా న్యూయార్క్​లో ఉండాలని నిర్ణయించుకున్నాం" అని నౌటన్ చెప్పడం గమనార్హం. 

అయితే గూగుల్​ను వీడినా.. తన స్థానాన్ని భర్తీ చేసే అధికారిని నియమించడానికి సంస్థ సీఈఓ సుందర్​ పిచాయ్​, సీఎఫ్​ఓ రుత్​ పోర్ట్​లకు సహకరిస్తానని స్పష్టం చేశారు ఎలీన్​.

గత ఏడాది చివరి త్రైమాసిక ఫలితాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు రాబట్టలేకపోయింది గూగుల్​. ఇప్పుడు కీలక పదవి నుంచి నౌటన్ తప్పుకోవడం వల్ల సుందర్ పిచాయ్​ ముందుకు మరో కొత్త సవాల్ వచ్చినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత కొంత కాలంగా గూగుల్​ అంతర్గత వ్యవహారాల్లో పలు అంశాలు చర్చకు దారితీశాయి. అందులో ముఖ్యంగా ఉన్నత స్థాయిలో సంస్థ తీసుకున్న నిర్ణయాలను ఉద్యోగులే వ్యతిరేకించడం వంటి అంశాలు ఉన్నాయి. 

also read ఆ పేరు వింటేనే హోటల్‌ పరిశ్రమ వణికిపోతోంది...ఎందుకు.. ?

గత ఏడాది నవంబర్​లో డేటా సెక్యూరిటీ నిబంధనలను అతిక్రమించినందుకు గూగుల్ నలుగురు ఉద్యోగులపై వేటు వేసింది​. ఈ వ్యవహారంలో ఉద్యోగులను వేధిస్తోందని గూగుల్​పై ఆరోపణలు వచ్చాయి. అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో.. అమెరికా కస్టమ్స్​, సరిహద్దు పోర్టల్​ ఏజెన్సీలతో కలిసి గూగుల్ పని చేయడాన్ని సంస్థ ఉద్యోగులే వ్యతిరేకించారు.

సెర్చింజన్ గూగుల్ సీఈఓగా సుందర్​ పిచాయ్​ పారితోషికం ఇటీవల భారీగా పెంచడాన్ని కొంత మంది ఉద్యోగులు బాహాటంగానే విమర్శించారు. గూగుల్‌ సంస్థలో అంతర్గత సంఘర్షణల అణచివేత అనంతరం ఉద్యోగులు, యాజమాన్యం మధ్య విభేదాలు తలెత్తాయి. 

ఈ ఏడాది జరిగిన ఒక ఉద్యోగుల సమావేశంలో "సిలికాన్‌ వ్యాలీలో ఎంతో మంది ఉద్యోగులు తమ మనుగడ కోసం కష్టపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సుందర్ పిచాయ్‌కు అంత పారితోషికం అవసరమా?" అని ఒక ఉద్యోగి ప్రశ్నించారు.

2018లో గూగుల్ సంస్థలో లైంగిక వేధింపుల అంశం సంస్థను కుదిపేసింది. అప్పట్లో గూగుల్ మౌంట్​వ్యూ క్యాంపస్​ సహా ప్రపంచ దేశాల్లో సంస్థ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.

click me!