పన్ను రేట్ల...కోసం కసరత్తు: ఆదాయం పెంపునకు ‘నిర్మల’మ్మ స్ట్రాటర్జీ

By Sandra Ashok Kumar  |  First Published Nov 14, 2019, 10:51 AM IST

వచ్చే బడ్జెట్‌లో దేశ ప్రజలకు మరిన్ని పన్ను రాయితీలు అందుబాటులోకి రానున్నాయి. పన్ను రేట్ల హేతుబద్దీకరణ కోసం కసరత్తు సాగుతోంది. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లూ తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో డిమాండ్‌ పెంచడమే లక్ష్యంగా విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చర్యలు చేపడుతున్నారు.
 


న్యూఢిల్లీ: చతికిల పడిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోదీ సర్కార్‌ మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో సమర్పించే కేంద్ర బడ్జెట్‌ ఇందుకు వేదిక కానున్నది. ఆ దిశగా కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భారీగానే కసరత్తు చేస్తున్నారు.

వస్తు, సేవల డిమాండ్‌ పెంచేందుకు ప్రజల చేతుల్లో మరింత ఆదాయం ఉండేలా చేయడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ తయారీ ప్రక్రియ సాగుతున్నట్టు సమాచారం. ఇందుకోసం వ్యక్తిగత పన్ను రేట్లతోపాటు కార్పొరేట్‌ పన్నులు, ఎక్సైజ్‌, దిగుమతి సుంకాల్ని మరింత తగ్గించే అవకాశం కనిపిస్తోంది. 

Latest Videos

also read అంతర్జాతీయ విపణిలోకి భీమ్.. సింగపూర్‌‌‌‌లో ప్రారంభం...

పన్నుల హేతుబద్దీకరణ పేరుతో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రేట్లలో చేయాల్సిన మార్పులు చేర్పులపై ఈ నెల 21వ తేదీలోగా సూచనలు, సలహాలు పంపాలని ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం ఇప్పటికే పరిశ్రమలు, వాణిజ్య సంఘాలను కోరింది. ఈ సూచనలు, సలహాలతో వసూళ్లు పెద్దగా తగ్గకూడదని స్పష్టం చేసింది.
 
డిమాండ్‌ తగ్గడంతో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయి ఐదు శాతానికి పడి పోయింది. దీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కంపెనీల ఆదాయం పన్ను చెల్లింపు భారాన్ని దాదాపు 10 శాతం కుదిస్తున్నట్టు ప్రకటించారు ఎన్‌బీఎఫ్సీలతోపాటు రియల్టీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక సహాయ ప్యాకేజీలు ప్రకటించారు. 

అయినా ఆర్థిక వ్యవస్థ ఇంకా కుంటి నడక నడుస్తోంది. సెప్టెంబర్ నెలతో ముగిసిన రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధి రేటు 4.2% మించక పోవచ్చని ఎస్‌బీఐ ఎకోర్యాప్‌ పేర్కొన్నది. ఏ విధంగా చూసినా ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీ వృద్ధి రేటు 5 శాతం మించే ప్రశ్నే లేదని అంచనాలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారం మరింత తగ్గించి ప్రజలు, కంపెనీల చేతుల్లో ‘ఖర్చు చేసే’ ఆదాయం మరింత పెంచితే తప్ప, డిమాండ్‌ ఊపందుకునే అవకాశం లేదని ప్రభుత్వ పెద్దలు అంచనాకు వచ్చారు.
 
విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన తన రెండో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇందుకోసం ఇప్పటికే వివిధ రంగాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. 

also read హువావే బంపర్ ఆఫర్ : ఉద్యోగులకు డబుల్ ధమాకా

ఎక్సైజ్‌, దిగుమతి సుంకాలు, వ్యక్తిగత, కార్పొరేట్‌ ఆదాయం పన్ను రేట్లలో చేయాల్సిన మార్పులపై పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు తెలపాలని ఏకంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పరిశ్రమ, వాణిజ్యవర్గాల అభిప్రాయాలు, సూచనల కోసం మంత్రిత్వ శాఖ ఇలా నోటిఫికేషన్‌ విడుదల చేయడం ఇదే మొదటిసారి.
 
ప్రస్తుతం కంపెనీలు తమ లాభాల నుంచి వాటాదారులకు చెల్లించే డివిడెండ్‌పై ప్రభుత్వం 15 శాతం డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌ (డీడీటీ) వసూలు చేస్తోంది. సర్‌చార్జీలు కలిపితే ఇది 20 శాతం ఉంటుంది. దీనికి తోడు ఏ వ్యక్తికైనా వార్షిక డివిడెండ్‌ ఆదాయం రూ.10 లక్షలు మించితే ఆ అదనపు మొత్తాన్ని ఆయా వ్యక్తుల వ్యక్తిగత ఆదాయ శ్లాబుల్లో కలిపి పన్ను వసూలు చేస్తున్నారు. 

వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం దీన్లో కొన్ని రాయితీలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. కంపెనీల స్థాయిలో చెల్లించే డీడీటీని పక్కన పెట్టి, ఒక పరిమితికి మించిన డివిడెండ్‌ ఆదాయంపై ఇక ఆయా వ్యక్తుల స్థాయిలోనే పన్ను విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

click me!