సంస్కరణలను అమలు చేయడంపైనే కేంద్రీకరించాలని విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ను విశ్లేషకులు, మదుపర్లు కోరుతున్నారు. దీర్ఘ కాలిక పెట్టుబడులపై పన్ను తొలిగించడంతోపాటు సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు అన్ని వసతులు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. విద్యా ఆరోగ్య రంగాలకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, రియాల్టీకి బూస్ట్ ఇచ్చే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో సంస్కరణలపైనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి దృష్టి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్ వినియోగాన్ని ఎలా పెంచాలనే దానిపై దృష్టి పెట్టాలని, అలాచేస్తేనే ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవచ్చని అంటున్నారు.
ప్రభుత్వం ఐదు లక్షల వరకు పన్ను రహిత ఆదాయాన్ని ప్రకటించాలని పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చీఫ్ ఎకనామిస్ట్ ఎస్‌పి శర్మ అన్నారు. ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులను తగ్గించాలని, ఇది ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బును తెస్తుందని, ఖర్చులను పెంచుతుందని వివరించారు.
undefined
పూర్తిగా దీర్ఘ కాలిక పెట్టుబడి లాభాలపై పన్ను తొలిగించాలని మదుపర్లు, విశ్లేషకులు నిర్వచిస్తున్నారు. పడిపోతున్న జీడీపీ నేపథ్యంలో మదుపర్లలో విశ్వాసం కల్పించడంతోపాటు దశాబ్ద కాలం స్థాయికి పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
also read చిక్కుల్లో ఆర్థిక వ్యవస్థ.. ‘నిర్మల’మ్మకు బడ్జెట్ అగ్ని పరీక్ష
వ్యక్తులు, వ్యాపార వేత్తలకు మద్దతునివ్వాలని కోరుతున్నారు. అయితే ప్రస్తుత మందగమన పరిస్థితుల్లో ఉపశమనాలు కల్పించడానికి పరిమితులు ఉన్నాయని చెబుతున్నారు. ఏపీఏసీ ఈక్విటీస్ హెడ్ హర్ట్మూత్ ఎస్సెల్ మాట్లాడుతూ సంస్కరణలు చేపట్టేందుకు ప్రభుత్వం వెనుకంజ వేయొద్దని సూచించారు. ప్రస్తుతం చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదు. దీనివల్ల వారు నడపలేకపోతున్నారు. వారి వృద్ధి కూడా ప్రభావితమవుతోంది. ఎంఎస్‌ఎంఇలకు సహాయం చేయడానికి ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల నిధిని సృష్టించాలి.
దీంతో పాటు రుణాలు తీసుకునే చిన్నతరహా, సూక్ష్మ తరహా సంస్థలు ఎలాంటి హామీ లేకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు చేయాలి. అదే సమయంలో 95 శాతం ఎంఎస్‌ఎంఇలు యాజమాన్య లేదా భాగస్వామ్యంలో ఉన్నాయి. ఈ సంస్థలకు ఇటీవలి కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రయోజనం కూడా రాలేదు.
అటువంటి పరిస్థితిలో చిన్నతరహా, సూక్ష్మ తరహా సంస్థలపై పన్ను పరిమితిని 25 శాతానికి తగ్గించాలి. తద్వారా వారు తక్కువ పన్ను చెల్లించవచ్చు. అదే సమయంలో ఈ కంపెనీల ఎగుమతి ఆదాయాలపై పన్నును మాఫీ చేయాలి. దీంతో ఈ కంపెనీలు ప్రపంచ మార్కెట్లలో కూడా పోటీ పడేందుకు అవకాశాలు ఉన్నాయి.
ఆరోగ్యంపై ప్రభుత్వం బడ్జెట్ పెంచాల్సి ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు జీడీపీలో మూడు శాతం వరకు ఉండాలి. ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో ఇది పెరగాలి. తద్వారా ప్రజలు మంచి ఆరోగ్య సేవలను పొందవచ్చు. అదే సమయంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిని కూడా పెంచాలి. ఆసుపత్రి 10 కిలోమీటర్ల లోపు ఉండాలి, తద్వారా ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది.
ఈ బడ్జెట్‌లో విద్య వ్యయాన్ని జీడీపీలో 4.5 శాతానికి పెంచాలని ప్రభుత్వానికి సూచనలు అందుతున్నాయి. పాఠశాలలు ఒక కిలోమీటర్, 10 కిలోమీటర్లలోపు కళాశాలలు, 25 కిలోమీటర్ల లోపు విశ్వవిద్యాలయాలు ఉండాలి. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం దీన్ని చేయగలదు. అదే సమయంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వారి ఉత్పత్తుల నుండి ఎక్కువ ప్రయోజనం పొందే విధంగా ప్రభుత్వం మార్కెట్ యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలి.
also read Budget 2020: మధ్యతరగతి వారికి బిగ్ బోనంజా? రూ. 5 లక్షలదాకా నో ట్యాక్స్!
14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2018-19 ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను విధించారు. దీనివల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బ తిని ప్రతికూల ఫలితాలనిస్తాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను విధించడంతో 2018 నుంచి 2019 వరకు మూడు త్రైమాసికాల్లో సుమారు 900 కంపెనీలు ప్రతికూల ఫలితాలు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్నుపై పునరాలోచించాలని మదుపర్లు, విశ్లేషకులు కోరుతున్నారు.
2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు అందుబాటులోకి తేవాలంటే రియల్ ఎస్టేట్ రంగం, ఇళ్ల కొనుగోళ్లపై డిమాండ్ పెంపొందించేందుకు రాయితీలు కల్పించాలని, బ్యాంకుల నుంచి రుణాలిచ్చేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు. ఆస్తిపై పన్ను మినహాయింపులు ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని కోరుతున్నారు.
రూరల్ డిమాండ్ పెరుగుదలకు, వ్యవసాయ వ్యాపారానికి ఉద్దీపనలు కల్పించడం వల్ల కన్జూమర్ గూడ్స్, ఆటోమొబైల్, ఆర్థిక ఉత్పత్తుల పురోబివ్రుద్ధికి తోడ్పాటునిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, తద్వారా మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు.