Budget 2020: ఎలక్ట్రిక్ కార్లకు ఐటీ... విద్యుత్ సైకిళ్లపై జీఎస్టీ...

By Sandra Ashok KumarFirst Published Jan 29, 2020, 11:15 AM IST
Highlights

వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ వెలుగు చూసేందుకు మరో రెండు రోజుల టైం మాత్రమే ఉంది. వివిధ వర్గాల ప్రజలు, ప్రముఖులు తమకు రాయితీలు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. దశాబ్దంలోనే కనిష్ఠ స్థాయికి పతనమైన వాహనాల విక్రయం పెరుగుదలతోపాటు జీడీపీ వ్రుద్ధి కోసం ఎలక్ట్రిక్ సైకిళ్లపై జీఎస్టీ 12 నుంచి ఐదు శాతానికి తగ్గించాలని హీరో సైకిల్స్ కోరింది. మరోవైపు స్క్రాపేజీ పాలసీని ప్రకటించడం వల్ల వాహనాల కొనుగోలుకు డిమాండ్ పెరిగి ప్రభుత్వాదాయం గణనీయంగా వ్రుద్ధి సాధిస్తుందని టయోటా కిర్లోస్కర్ సేల్స్ అండ్ సర్వీసింగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు నవీన్ సోనీ చెప్పారు.

న్యూఢిల్లీ‌: పర్యావరణ హిత సైకిళ్ల తయారీపై జీఎస్‌టీని తగ్గించాలన్న డిమాండ్‌ క్రమంగా ఊపందుకుంది. ప్రముఖ సైకిళ్ల తయారీ సంస్థ హీరో ప్రభుత్వానికి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సైకిళ్లపై ఉన్న 12శాతం జీఎస్‌టీని ఐదు శాతానికి కుదించాలని కోరింది. 

ఇలా ఎలక్ట్రిక్ సైకిళ్ల వినియోగానికి డిమాండ్
ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ (పర్యావరణ హిత) సైకిళ్ల వినియోగానికి డిమాండ్‌ ఊపందుకుంటుందని పేర్కొంది. దీంతోపాటు ఫేమ్‌-2 పథకం వల్ల లభించే ప్రయోజనాలను ఎలక్ట్రిక్‌ సైకిళ్లకు కూడా వర్తింపచేయాలని హీరో మోటార్స్ కంపెనీ చైర్మన్ పంకజ్ ఎం ముంజాల్ కోరారు. 

also read Budget 2020: వృద్ది రేట్ పెంపు ‘నిర్మల’మ్మకు ఖచ్చితంగా సవాలే...

జీఎస్టీ తగ్గింపునకు చర్యలు తీసుకోవాలంటున్న పంకజ్ ముంజాల్
‘దేశంలో డిమాండ్‌ పెరిగేలా ఈ బడ్జెట్‌లో కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ క్రమంలో భాగంగా జీఎస్టీ శ్లాబులను పునర్‌ వ్యవస్థీకరించాలి. ఈ చర్యలతో ప్రజల చేతిలో ధనం మిగిలేటట్లు చూడాలి’ అని హీరో మోటార్స్ చైర్మన్ పంకజ్ ముంజాల్ చెప్పారు.

విద్యుత్ సైకిళ్లకూ ‘ఫేమ్-2’ అమలు చేయాలి
‘ఫేమ్‌-2 నిబంధనలను కూడా ఎలక్ట్రిక్ సైకిళ్లకు వర్తింపజేయాలి. ప్రభుత్వం విద్యుత్‌ సైకిళ్లను ప్రచారం చేయడంలో ఆవశ్యకతను గుర్తించిందని భావిస్తున్నా. విద్యుత్ కార్లు కాలుష్యం సమస్యను మాత్రమే తీరుస్తాయి. కానీ, ట్రాఫిక్‌ సమస్య అలాగే ఉండిపోతుంది. విద్యుత్తు సైకిళ్లు ఆ సమస్యను కూడా తీరుస్తాయి’ అని హీరో పంకజ్‌ ఎం ముంజల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

సైకిళ్లను వాడుతున్న అల్పాదాయ వర్గాలు
ఇప్పటికీ సైకిళ్లను అల్పదాయ వర్గాలు అత్యధికంగా వాడుతూ ఉన్నాయి. వీరిలో గ్రామీణులు ఎక్కువగా ఉంటున్నారు. అందుకే వీటిపై జీఎస్టీ తగ్గింపు గ్రామీణులకు ఉపయోగపడుతుందని హీరో మోటార్స్ చైర్మన్ పంకజ్ ఎం ముంజాల్ తెలిపారు.  

స్క్రాపేజీ పాలసీని అమల్లోకి తేవాలి: టయోటా కిర్లోస్కర్
పాత వాహనాలు, స్క్రాపేజీపై విధానాన్ని అందుబాటులోకి తేవడంపై కేంద్రం ద్రుష్టిని కేంద్రీకరించాలని, ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆ విధానాన్ని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నవీన్ సోనీ తెలిపారు. విద్యుత్ కార్లకు అమలు చేస్తున్న ఆదాయం పన్ను బెనిఫిట్లను ఇతర వాహనాలకు వర్తింపజేయాలని కోరారు.

స్క్రాపేజీ పాలసీ ప్రకటిస్తే.. మా అభిప్రాయాలు వెల్లడిస్తాం
స్క్రాపేజీ విధానం అమలులోకి తేవడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎటువంటి అదనపు భారం పడబోదని నవీన్ సోనీ చెప్పారు. దీనికి తోడు వాహనాల కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతుందన్నారు. ప్రభుత్వం స్క్రాపేజీ పాలసీని విడుదల చేస్తే.. ఆటో పరిశ్రమ కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటుందన్నారు. 

also read బడ్జెట్ 2020:విద్యుత్ వాహనాలకు ‘నిర్మల’మ్మ ప్రోత్సాహాలిస్తారా...?

ఎలక్ట్రిక్ కార్లకు ఐటీ మినహాయింపులు వర్తింపజేయాలి
ఎలక్ట్రిక్, ఇతర మోడల్ కార్లు, వాహనాలకు ఆదాయం పన్ను రాయితీలను వర్తింప చేయాలని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోనీ కోరారు. లేదా కంపెనీలకు, ప్రొఫెషనల్స్, వ్యక్తిగత కార్ల వినియోగదారులకు టాక్స్ బెనిఫిట్లు వర్తింపజేయాలని అభ్యర్థించారు. 

ఈ ఉద్దీపనలతో ప్రభుత్వ ఆదాయంలో గణనీయ పెరుగుదల సాధ్యమే
ఈ తరహా ఉద్దీపనలతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సేల్స్ అండ్ సర్వీసింగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు నవీన్ సోనీ తెలిపారు. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్న తరుణంలో ట్రాన్సిషన్ సమస్యలను ఎదుర్కొంటున్నది ఆటో పరిశ్రమ అని చెప్పారు. తాత్కాలికంగా తీసుకునే చర్యల వల్ల ఓవరాల్ సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తుందని నవీన్ సోనీ చెప్పారు. 

click me!