బ్యాంకుల్లో లక్షల కోట్ల మోసాలు...గుర్తించించిన ఆర్బీఐ

By Sandra Ashok Kumar  |  First Published Dec 28, 2019, 11:40 AM IST

బ్యాంకింగ్ మోసాలు చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని ఆర్బీఐ హెచ్చరించింది. ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంకుల్లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.1.13 లక్షల కోట్ల మోసాలు జరిగాయని గుర్తించింది. 
 


ముంబై: కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంక్ ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా బ్యాంకుల్లో మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలోనే బ్యాంకుల్లో రూ.1.13 లక్షల కోట్ల మేర మోసాలు జరిగాయి. ఆరునెలల్లో ఇంతటి స్థాయిలో మోసాలు జరుగడం ఇదే తొలిసారని రిజర్వు బ్యాంక్ తాజాగా శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడించింది. 

బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడిన వారిని గుర్తించడంలో ఆలస్యంకావడం ఇందుకు కారణమని ఆర్బీఐ విశ్లేషించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోగా దేశీయ బ్యాంకింగ్ రంగంలో 4,412 మోసాలు జరుగగా, వీటి విలువ లక్ష కోట్ల రూపాయల కంటే అధికమని తేలింది.

Latest Videos

also read  క్యాష్ విత్ డ్రాపై ఎస్‌బి‌ఐ కొత్త రూల్...జనవరి 1 అమలు...

గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో 6,801 మోసాలు జరుగగా, వీటి విలువ రూ.71,543 కోట్లు. అటు సంఖ్యపరంగా చూస్తే తగ్గినా, మోసం మాత్రం ఇంచుమించు 50 శాతానికి పైగా పెరుగడం విశేషం. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో జరిగిన మోసాలు అంతకంతకు పెరిగాయని ఆర్థిక స్థిరత్వం అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో రిజర్వుబ్యాంక్ వెల్లడించింది. 

2001-02 నుంచి 2017-18 మధ్య జరిగిన మోసాల మొత్తం..2018-19లో జరిగిన మొత్తంలో 90.6 శాతానికి సమానం. అలాగే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో జరిగిన మోసాల్లో వాటాకు 97.3 శాతానికి సమానం. ప్రస్తుత సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.50 కోట్ల కంటే అధికంగా జరిగిన 398 కేసుల మొత్తం రూ.1.05 లక్షల కోట్లు. 

అలాగే రూ.1,000 కోట్ల కంటే అధికంగా ఉన్న 21 కేసలు మొత్తం రూ.44,951 కోట్లు. వీటిలో రుణాల మోసాలు అత్యధికమని పేర్కొన్న నివేదిక..మొత్తం మోసాల్లో వీటి వాటా 90 శాతానికి పైమాటే. గత ఆరు నెలల్లో ఈ వాటా 97 శాతానికి పెరిగింది. బ్యాంకింగేతర సంస్థల మొండి బాకీలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఎన్‌బీఎఫ్‌సీల స్థూల నిరర్థక ఆస్తుల విలువ 6.1% నుంచి 6.3 శాతానికి చేరుకున్నది. అలాగే నికర మొండి బకాయి నిష్పత్తి నిలకడగా 3.4 శాతం వద్ద స్థిరంగా ఉన్నది. 

ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి చెందిన క్యాపిటల్ టూ రిస్క్ అసెట్స్ రేషియో(సీఆర్‌ఏఆర్) మాత్రం 20% నుంచి 19.5 శాతానికి పడిపోయింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అవకతవకల నేపథ్యంలో రిజర్వుబ్యాంక్ మార్గదర్శకాలను మరింత కఠినతరం చేసింది. కనీస మొత్తంలో నగదు నిల్వలు ఉంచుకోవాలని ఎన్‌బీఎఫ్‌సీలను నేరుగా ఆదేశించింది. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీలు రూ.8,29,468 కోట్ల మేర రుణాలు ఇచ్చాయి.

అతిపెద్ద సహకార బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ ఊరట కల్పించింది. రూ.5 కోట్ల కంటే అధికంగా రుణాలు నేరుగా ఇవ్వడానికి అతిపెద్ద కో-ఆపరేటివ్ బ్యాంకులను సెంట్రల్ బ్యాంక్ అనుమతినిచ్చింది. ఆయా బ్యాంకుల ఆర్థిక పరిస్థితులతో గతంలో నియంత్రణ విధించిన ఆర్బీఐ..ప్రస్తుతం వీటిపై నియంత్రణ ఎత్తివేసింది. రూ.500 కోట్ల కంటే అధిక ఆస్తులు కలిగిన అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించింది.

also read స్టాక్ మార్కెట్ల రికార్డు....ఐదేళ్లలో తొలిసారి....

రియల్ ఎస్టేట్ సంస్థలతో ప్రధాన బ్యాంకులు తీవ్ర ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి. గతేడాది జూన్ నాటికి 5.74 శాతంగా ఉన్న బ్యాంకుల నష్టాల వాటా ఈ ఏడాది జూన్ నాటికి ఇది 7.33 శాతానికి ఎగబాకాయి. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 15 శాతం నుంచి 18.71 శాతానికి చేరుకున్నది.

ఆర్థికాభివృద్ధి దారుణంగా మందగించినా దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉన్నదని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2019-20) ద్వితీయ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 4.5 శాతానికి పతనమై ఆరేళ్ల కనిష్ఠస్థాయికి దిగజారడంతో ఆర్బీఐ ఈ నెలలో నిర్వహించిన ద్రవ్య విధాన సమీక్షలో వృద్ధిరేటును 240 బేసిస్ పాయింట్లు తగ్గించి 5 శాతంగా నమోదవుతుందని అంచనావేసిన విషయం తెలిసిందే. 

అయితే దేశీయ వృద్ధిరేటు బలహీనపడినా భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ స్థిరంగానే కొనసాగుతున్నదని తాజాగా విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో రిజర్వు బ్యాంకు పేర్కొన్నది. అంతర్జాతీయ సమస్యలతోపాటు స్థూల ఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ మార్కెట్ల సమస్యలపై ప్రస్తుతం నెలకొన్న అభిప్రాయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ఓ మోస్తరుగా దుష్ప్రభావం చూపుతున్నాయని ఆర్బీఐ తెలిపింది.

click me!