స్టాక్ మార్కెట్ల రికార్డు....ఐదేళ్లలో తొలిసారి....
ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు రికార్డులు తిరగరాస్తూ కొత్త శిఖరాలకు చేరాయి. మార్కెట్లు ఇంత సానుకూలంగా కొనసాగుతున్నా.. 2019లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చిన కంపెనీలు చాలా తక్కువ అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో ఐపీవోకు వెళ్లిన సంస్లు తక్కువగా నమోదు కావడం ఈ ఏడాదే.
ముంబై: ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు రికార్డులు తిరగరాస్తూ.. కొత్త శిఖరాలకు చేరాయి. మార్కెట్లు ఇంత సానుకూలంగా కొనసాగుతున్నా.. 2019లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చిన కంపెనీలు చాలా తక్కువ అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2014 తర్వాత అతితక్కువ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) మార్కెట్లోకి వచ్చిన సంవత్సరం ఇదేనని గణాంకాలు చెబుతున్నాయి.
మరోపక్క సూచీలు రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్నా ఈ పరిస్థితి నెలకొనడం ఆశ్చర్యకరం. మరెన్నో కంపెనీలు జీవితకాల అత్యధిక ధరల వద్ద ట్రేడ్ అవుతుండటం ఆసక్తికర పరిణామం.నిజానికి ఈ ఏడాది చాలా కంపెనీలు సెబీ నుంచి అనుమతులు తెచ్చుకున్నా మార్కెట్లలోకి రాలేదు. సెబీ అనుమతులు ఇచ్చిన వాటిల్లో 47 కంపెనీలు మార్కెట్లోకి రాలేదు. దీంతో రూ.51,000 కోట్లు విలువైన ఐపీవోల అనుమతులు నిరుపయోగంగా మారాయి.
చిన్న, మధ్యశ్రేణి కంపెనీలు నిధుల సమీకరణ మందకొడిగా ఉండటంతో ఐపీవోలకు వెళ్లడానికి వివిధ సంస్థలు భయపడ్డాయి. ఈ సారి నిరుపయోగంగా మారిన అనుమతుల్లో ఎస్‌ఎంఈ ఐపీఓలు రూ.12,982 మాత్రమే సేకరించాయి. గత ఏడాది ఎస్ఎంఈలు ఐపీవో ద్వారా రూ.33,246 కోట్లు నిధులు సేకరించాయి. అదే 2014లో ఈ మొత్తం రూ.1,468 కోట్లుగా ఉన్నాయి.
ఈఏడాది ఐపీఓకు వచ్చిన 16 ప్రధాన కంపెనీల్లో ఏడు కంపెనీలకు దాదాపు 10 రెట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఐఆర్‌సీటీసీ 109 రెట్లు, ఉజ్వల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 100 రెట్లు, సీఎస్బీ బ్యాంక్ 48 రెట్లు, అఫ్లె 48 రెట్లు, పాలీక్యాబ్ 36 రెట్లు, నియోజన్ కెమికల్స్ 29 రెట్లు, ఇండియామార్ట్ 20 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. వీటిల్లో 15 ఐపీఓలు లిస్టింగ్ రోజే 10 శాతానికిపైగా లాభాలను తెచ్చి పెట్టాయి.